CM Kejriwal: VIDEO: ఉప్పొంగుతున్న యమున.. వరద గుప్పిట్లో కేజ్రీవాల్‌ నివాసం!

VIDEO: ఉప్పొంగుతున్న యమున.. వరద గుప్పిట్లో కేజ్రీవాల్‌ నివాసం!

ఉత్తర భారతాన్ని భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు లేకపోయినా.. యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో ఢిల్లీ తల్లడిల్లుతోంది. పైగా హర్యానాలోని హత్నికుండా బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేయడంతో యమున నది గరిష్ఠ నీటి మట్టంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అనేక మార్గాల్లో రాకపోకలను నిలిపివేశారు.

దాదాపు 45 ఏళ్ల క్రితం ఇంత ఉగ్రరూపం దాల్చిన యమునా మళ్లీ ఆ రికార్డును బద్దలుకొడుతూ.. 208.66 మీటర్ల గరిష్ఠ నీటి మట్టంతో ప్రవహిస్తోంది. దీంతో చాలా ప్రాంతాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. ముఖ్యంగా సెంట్రల్‌ ఢిల్లీ ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. సీఎం కేజ్రీవాల్‌ నివాసం, ఢిల్లీ అసెంబ్లీని వరద నీరు చుట్టుముట్టేసింది. మనిషి ఎత్తు వరద సీఎం ఇంటి చుట్టూ చేరింది. లోపలికి వెళ్లేందుకు అవకాశం లేకుండా ఉంది.

సీఎం ఇంటితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్ని నీట మునిగాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్‌కు సెలవులు ఇచ్చింది. మరో రెండు రోజుల వరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయితే గురువారం మధ్యాహ్నం నుంచి వరద తగ్గుముఖం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: సగం కాలిన శవాన్ని తిన్న మందుబాబులు.. భయాందోళనలో ప్రజలు!

Show comments