జాతీయ స్థాయిలో బండి సంజయ్‌కి కీలక పదవి! ప్రకటించిన జేపీ నడ్డా

జాతీయ స్థాయిలో బండి సంజయ్‌కి కీలక పదవి! ప్రకటించిన జేపీ నడ్డా

బీజేపీ నేత బండి సంజయ్‌కి ఆ పార్టీ అధినాయకత్వం కీలక పదవిని కట్టబెట్టింది. ఆయనను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణతో పాటు మరో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బండి సంజయ్‌కి కీలక పదవీ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు డీకే అరుణకు సైతం మంచి పదవి ఇచ్చారు. ఆమెను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించారు.

కాగా, ఇటివల బండి సంజయ్‌ని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే.. బండిని అధ్యక్ష హోదా నుంచి తప్పించడంపై తెలంగాణ కేడర్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. చాలా చోట్ల కొంతమంది నేతలు బహిరంగంగానే అధ్యక్ష మార్పుపై విమర్శలు గుప్పించారు. ఈ విషయం బీజేపీ హైకమాండ్‌ దృష్టికి సైతం వెళ్లినట్లు సమాచారం.

అలాగే కిషన్‌ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఇష్టం లేకపోయినా.. ఆయనను బలవంతంగా నియమించారనే టాక్‌ కూడా నడిచింది. ఎట్టకేలకు ఆయన ఇటీవల ఆ బాధ్యతలు స్వీకరించారు. అయితే.. బండి సంజయ్‌కి కేంద్ర మంత్రిగా ప్రమోషన్‌ ఇస్తారని అంతా భావించినా అది జరగలేదు. దీంతో సంజయ్‌కి బీజేపీ అధినాయకత్వం అన్యాయం చేస్తోందనే భావన ఆ పార్టీ కేడర్‌లోకి, బండి అభిమానుల్లోకి వెళ్లింది. దీంతో వెంటనే అప్రమత్తమైన బీజేపీ ఆయనను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు వెల్లడించింది. అయితే.. తెలంగాణలో బీజేపీ ఈ మాత్రం బలపడిందంటే అందుకు బండి సంజయ్‌ కారణమంటూ ఆ పార్టీలోని ప్రముఖ నేతలు పేర్కొంటున్నారు. మరి బండి సంజయ్‌కి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వారికి రూ.లక్ష సాయం అందజేయనున్న తెలంగాణ ప్రభుత్వం.. అప్లై చేసుకొండి!

Show comments