Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్‌కు రాష్ట్ర మహిళా కమిషన్‌ నోటీసులు

పవన్‌ కళ్యాణ్‌కు రాష్ట్ర మహిళా కమిషన్‌ నోటీసులు

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు ఆంధ్ర ప్రదేశ్‌ మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో వేల మంది మహిళలు తప్పిపోయారని, వారి ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదని వారాహి విజయ యాత్రలో పవన్‌ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్‌ సీరియస్‌ అయింది. తప్పిపోయిన మహిళల వివరాలు తమకు ఇవ్వాలని కోరింది. పవన్‌ చేసిన వ్యాఖ్యలపై తమకు పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేకుంటే క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది.

మహిళల మిస్సింగ్‌, ఉమెన్‌ ట్రాఫికింగ్‌పై పవన్‌కు ఏ కేంద్ర నిఘా వ్యవస్థ సమాచారం ఇచ్చిందో కూడా చెప్పాలని కోరింది. వారాహి విజయ యాత్రలో భాగంగా ఆదివారం ఏలూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళల అదృశ్యాలకు వాలంటీర్ల వ్యవస్థ ప్రధాన కారణమని ఆరోపించారు. వైసీపీ పాలనలో దాదాపు 30 వేల మంది మహిళలు అదృశ్యమైతే అందులో 14 వేల మంది ఆచూకీ ఇంకా లభించలేదని అన్నారు.

వైసీపీ ప్రభుత్వం ప్రతి గ్రామంలో వాలంటీర్లను పెట్టి.. ఏ కుటుంబంలో ఎంత మంది ఉన్నారు? వారిలో మహిళలు, అమ్మాయిలు ఎంత మంది? ఒంటరి మహిళలు ఎంత మంది అని వివరాలు సేకరించి, ఒంటరి మహిళలను టార్గెట్‌ చేస్తున్నట్లు, ఆ వివరాలను సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో రాష్ట్ర మహిళా కమిషన్‌ స్పందించి పవన్‌కు నోటీసులు జారీ చేసింది.

Show comments