బాబును వదిలి పార్టీ కార్యదర్శికి నోటీసులా..?

బాబును వదిలి పార్టీ కార్యదర్శికి నోటీసులా..?

రాజకీయ పార్టీలకు అతీతంగా సాగే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హామీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేశారంటూ.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ లీగల్‌ సెల్‌ ఫిర్యాదు చేసింది. నిబంధనలు అతిక్రమించిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషనర్‌ తాజాగా టీడీపీ కార్యదర్శి వెంకటరాజుకు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 2వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది.

పార్టీ అధినేతను వదిలి కార్యదర్శికి నోటీసులా..?

పంచాయతీ ఎన్నికలకు హామీలతో కూడిన ఎన్నికల మేనిఫెస్టోను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. పార్టీ గుర్తుల మీద ఈ ఎన్నికలు జరగవంటూనే.. టీడీపీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయాలి, అలా చేస్తే.. పల్లె ప్రగతి – పంచ సూత్రాల పేరుతో మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేస్తామని మీడియా ముఖంగా చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని వైసీపీ లీగల్‌ సెల్‌ ఫిర్యాదు చేయగా.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ చంద్రబాబును వదిలి ఆ పార్టీ కార్యదర్శి వెంకటరాజుకి నోటీ సులు జారీ చేయడం విడ్డూరంగా ఉంది. నిబంధనలు ఉల్లంఘించింది ఒకరైతే.. వివరణ మరొకరిని కోరుతున్న నిమ్మగడ్డ.. రేపు చర్యలు ఎవరిపై తీసుకుంటారో చూడాలి.

అందుకేనా నోటీసులు..?

ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పక్షపాతంగా, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అధికార పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. నిమ్మగడ్డ వ్యవహార శైలి కూడా అలాగే ఉందన్న విషయం ప్రజలు గుర్తించారు. ఈ లోపు టీడీపీ అధినేత చంద్రబాబు పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసి వైసీపీకి ఆయుధం అందించారు. ఇది నిమ్మగడ్డకు కూడా పరీక్షగా మారింది. నిబందనలు ఉల్లంఘించిన చంద్రబాబుపై.. ఏం చర్యలు తీసుకుంటారంటూ వైసీపీ నేతలు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను మీడియా సాక్షిగా నిలదీస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. దీంతో ఏదో ఒకటి చేయకపోతే లాభంలేదనుకున్న నిమ్మగడ్డ.. టీడీపీ కార్యదర్శికి నోటీసులు జారీ చేశారని అర్థమవుతోంది. మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబును పక్కనపెట్టి.. ఆ పార్టీ కార్యదర్శి వెంకటరాజుకి నోటీసులు జారీ చే సిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మరిన్ని విమర్శలకు తావివ్వడం గమనార్హం.

Show comments