'రోలెక్స్'.. ఓ అనాథ పెట్టిన కంపెనీ కథ! ఆ వాచ్ ఎందుకంత ఖరీదు?

‘రోలెక్స్’.. ఓ అనాథ పెట్టిన కంపెనీ కథ! ఆ వాచ్ ఎందుకంత ఖరీదు?

  • Author Soma Sekhar Published - 03:18 PM, Sat - 25 November 23

రిస్ట్ వాచ్ ల్లో ప్రపంచ అగ్రగామి సంస్థగా వెలుగొందుతున్న 'రోలెక్స్' ఈ స్థాయిలో ఉండటానికి కారణాలు ఏంటి? ఆ వాచ్ ఎందుకంత ఖరీదు? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

రిస్ట్ వాచ్ ల్లో ప్రపంచ అగ్రగామి సంస్థగా వెలుగొందుతున్న 'రోలెక్స్' ఈ స్థాయిలో ఉండటానికి కారణాలు ఏంటి? ఆ వాచ్ ఎందుకంత ఖరీదు? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 03:18 PM, Sat - 25 November 23

ఈ కథనం చదవబోయే ముందు మీకో చిన్న కథ చెప్తాను. X, Y అనే ఇద్దరు వ్యక్తులు బిజినెస్ మ్యాన్స్. X కు ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు ఉన్నాయి. వాటి ద్వారా అతడు ఎంతో డబ్బును సంపాదిస్తున్నాడు. ఇక Y అనే వ్యక్తి ఒకే ఒక్క కంపెనీని స్థాపించాడు. తన ఐడియాలతో, పనితనంతో ఆ సంస్థను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడమే కాకుండా.. భారీ లాభాలను సైతం గడిస్తున్నాడు. డబ్బుతో పాటుగా ఇతడి కంపెనీ పేరు వరల్డ్ వైడ్ గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. సమకాలీన ప్రపంచంలో ఆ కంపెనీ పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఇదే సమయంలో X కు అనేక సంస్థలు ఉన్నప్పటకీ అతడి పేరు, వాళ్ల కంపెనీ పేర్లు చాలా మందికి తెలీయవు. వీరిద్దరి కథలో ఒకే ఒక్క పాయింట్ Y పేరును ప్రపంచ వ్యాప్తం చేసింది. ఆ పాయింటే ‘బ్రాండ్’. ఇక ఆ Y పేరు ‘హన్స్ విల్ డార్ఫ్’. మార్కెట్ లో ఏ చిన్న వస్తువు కొనాలన్నా ముందుగా చూసేది బ్రాండే. ఇదే స్ట్రాటజీని అతడు ఫాలో అయ్యాడు.. అవుతున్నాడు. పైన చెప్పిన కథంతా రిస్ట్ వాచ్ ల్లో ప్రపంచ అగ్రగామి సంస్థగా వెలుగొందుతున్న ‘రోలెక్స్’ కంపెనీ గురించే. ఓ అనాథ స్థాపించిన సంస్థ ఈ స్థాయిలో ఉండటానికి కారణాలు ఏంటి? ఆ వాచ్ ఎందుకంత ఖరీదు? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

హన్స్ విల్ డార్ఫ్ బాల్యం

1881 మార్చి 22న జర్మనీలో హన్స్ విల్ డార్ఫ్ జన్మించాడు. అందరి పిల్లల్లాగే ఇతడి బాల్యం సాగిందనుకుంటే పొరపాటే. జర్మనీలోని బవేరియాలో చిన్న వ్యాపారం చేసుకుంటూ వీరి కుటుంబం నివసించేది. విల్ డార్ఫ్ కు 12 సంవత్సరాలు వచ్చే వరకు అతడి లైఫ్ సాఫీగానే సాగింది. ఈ క్రమంలోనే ఊహించని విషాదం అతడి జీవితంలో చోటుచేసుకుంది. డార్ఫ్ తల్లి అనారోగ్యంతో చనిపోవడం.. ఆ బాధను తట్టుకోలేక తండ్రి కూడా మరణించడం డార్ఫ్ జీవితాన్ని కుంగదీసింది. ఈ విషాదం అతడిని మానసికంగా తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేసింది. తల్లిదండ్రుల మరణం తర్వాత ఆస్తి మెుత్తం అమ్మి.. ముగ్గురు పిల్లలను స్కూల్లో జాయిన్ చేపించారు బంధువులు. కానీ స్కూల్లో ఎవ్వరితోనూ సరిగ్గా కలిసేవాడు, మాట్లాడేవాడు కాదు విల్. అయితే తనకు నచ్చిన సబ్జెక్ట్ ల్లో మాత్రం బాగా రాణించేవాడు. ఇక ఈ బాధలో నుంచి బయటపడేందుకు చిన్నతనంలో ఉద్యోగాలు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషలను నేర్చుకున్నాడు.

చేసిన ఉద్యోగాలు

విల్ డార్ఫ్ తన తల్లిదండ్రులను కోల్పోయిన బాధ నుంచి తేరుకోవడానికి ఉద్యోగాలు చేయడం మెుదలుపెట్టాడు. ఈ క్రమంలోనే తన తొలి జాబ్ ను ముత్యాలు, వజ్రాల కంపెనీలో చేశాడు. అక్కడే కొన్ని మెలకువలు నేర్చుకున్నాడు. ముత్యాలు, వజ్రాలు తక్కువ రేటుకు లభించే ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి.. వాటిని ఎక్కువ రేటుకు అమ్ముకోవడంతో పాటుగా,  డిమాండ్ సృష్టించి ఎలా క్యాష్ చేసుకోవాలో గమనించాడు. ఆ తర్వాత స్విట్జర్లాండ్ లో వాచ్ లకు సంబంధించిన సంస్థలో చేరాడు. ఇది అతడి జీవితంలో మలుపు తిప్పిన సంఘటనగా చెప్పవచ్చు. ఈ కంపెనీలో అతడి పని ఏంటంటే? అప్పట్లో ఉన్న పాకెట్ గడియారాలు కచ్చితంగా టైమ్ చూపెడుతున్నాయా? లేదా? అని వాటి క్వాలిటీని చెక్ చేయడమే. దీంతో పాటుగా.. మార్కెటింగ్ ఎలా చేయాలో ఇక్కడే అవపోసన పట్టాడు విల్ డార్ఫ్.

రోలెక్స్ స్థాపన

మార్కెటింగ్ పై అపారమైన పట్టు, వాచ్ లను తయ్యారు చేయడంలో అనుభవం.. అదీకాక అప్పట్లో పాకెట్ వాచ్ లే ఉండటం. ఈ కారణాలన్నీ కలిసి విల్ డార్ఫ్ ను రోలెక్స్ రిస్ట్ వాచ్ కంపెనీ స్థాపనకు ప్రేరేపించాయి. అయితే తన దగ్గర ఐడియా, పనితనం అయితే ఉన్నాయి గానీ.. దానిని ముందుకు నడిపించే డబ్బు మాత్రం లేదు. దీంతో డేవిస్ అనే మరో వ్యక్తితో చేతులు కలిపాడు. డేవిస్ పెట్టుబడి పెట్టడంతో.. 1905లో లండన్ లో రిస్ట్ వాచ్ ల తయ్యారీ కంపెనీ ‘రోలెక్స్’ను స్థాపించారు. మెుదట్లో ఈ సంస్థ పేరు రోలెక్స్ కాదు.. విల్ డార్ఫ్ & డేవిస్. కానీ పేరు పెద్దగా ఉండటంతో.. రోలెక్స్ అని పెట్టారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? రోలెక్స్ అంటే అర్ధం ఏంటో కూడా తెలీదు. డిక్షనరీలో కూడా ఈ పదానికి అర్ధం లేదని తెలుస్తోంది. ఈ కంపెనీ స్థాపన అప్పట్లో ఓ సంచలనమే చెప్పాలి. ఎందుకంటే? పాకెట్ వాచ్ లు ఆ సమయానికి మార్కెట్ ను ఏలుతున్నాయి. ఇది గమనించిన విల్ డార్ఫ్.. రాబోయే తరం రిస్ట్ వాచ్ లదే అని ముందుగానే ఊహించి.. రోలెక్స్ కంపెనీని ప్రారంభించాడు.

రోలెక్స్ లో కుదుపు

రోలెక్స్.. అతి తక్కువ కాలంలోనే ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. యూరప్ లో నెంబర్ 1 కంపెనీగా పేరుగాంచింది. చేతి వాచ్ లు తయ్యారు చేస్తున్నారు అని తెలియగానే చాలా మంది విమర్శలు గుప్పించారు. పాకెట్ వాచ్ లు మార్కెట్ ను ఏలుతున్న కాలంలో వీటిని ఎవరు కొంటారంటూ హేళన చేశారు. కానీ ఈ సంస్థ వాచ్ ల తయ్యారి ప్రారంభించాక అందరి నోళ్లు మూయించాడు విల్ డార్ఫ్-డేవిస్. కొద్ది కాలంలోనే యూరప్ లో అగ్రగామిగా నిలిచింది. ఈ క్రమంలోనే రోలెక్స్ కుదుపునకు గురైంది. లండన్ లో కంపెనీకి వచ్చే లాభాల కంటే వాటికి కట్టే ట్యాక్స్ లే ఎక్కువగా ఉండేవి. దీంతో సంస్థ అక్కడ ఆఫీస్ ను 1919లో మూయక తప్పలేదు. ఇది రోలెక్స్ ప్రస్థానంలో అతిపెద్ద సంఘటన. అయితే ఇక్కడి కంపెనీ మూసేసే సమయానికంటే 11 ఏళ్ల ముందుగానే అంటే 1908లో స్విట్జర్ లాండ్ లోని జెనీవా పట్టణంలో కొత్త కార్యాలయ్యాన్ని ప్రారంభించారు. ఇది వారికి ఎంతో ఊపయోగకరం అయ్యింది. ప్రస్తుతం జెనీవాలో ఉన్న ఈ ఆఫీస్ రోలెక్స్ వాచ్ హెడ్ క్వార్టర్ గా కొనసాగుతోంది.

వాచ్ ల రంగంలో సంచలనం

రోలెక్స్ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకోవడానికి ప్రధాన కారణం వారి క్వాలిటీ అయితే.. మరో రీజన్ వారి మార్కెటింగ్ స్ట్రాటజీ. ప్రత్యర్థి కంపెనీలకు ధీటుగా, వెరైటీగా తమ ప్రచారాన్ని చేసేవారు. ఈ క్రమంలోనే ఓ నూతన ఇన్నోవేషన్ కు శ్రీకారం చుట్టారు విల్ డార్ఫ్-డేవిస్ ద్వయం. ప్రపంచంలోనే మెుట్టమెుదటి వాటర్ ఫ్రూఫ్ రిస్ట్ వాచ్ ను తయ్యారు చేసింది. 1926లో ‘రోలెక్స్ వోయ్ స్టర్’ అనే వాటర్ ఫ్రూఫ్ వాచ్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఇది వాచ్ ల రంగంలోనే పెను సంచలనం సృష్టించింది. అయితే ఈ వాచ్ కు మార్కెట్ లో గుర్తింపు తీసుకురావడానికి సరైన అవకాశం కోసం వీరిద్దరు ఎదురుచూస్తున్నారు. అలాంటి టైమ్ లోనే స్పోర్ట్స్ పై వీరి చూపు పడింది. ఈ వాచ్ కనిపెట్టిన సంవత్సరం తర్వాత అంటే.. 1927లో మార్కెట్ లో దీని గురించి మాట్లాడుకోవడం మెుదలు పెట్టారు. దానికి కారణం.. ఓ స్విమ్మర్. మెర్సిడెస్ గ్లిట్జే అనే లేడీ స్విమ్మర్ ఫ్రాన్స్-ఇంగ్లాండ్ మధ్య ఉన్న ఇంగ్లీష్ ఛానల్ అనే సముద్రాన్ని ఈదడానికి రెడీ అయ్యింది. ఈ సమయంలో ఆమెను కలిసి తమ వాచ్ ను టైమ్ చూసుకోవడానికి ఇచ్చారు. మెర్సిడెస్ 10 గంటల పాటు ఆ ఇంగ్లీష్ ఛానల్ ను ఈదింది. ఈ 10 గంటలు కూడా వాచ్ కచ్చితంగా టైమ్ ను చూపించడం విశేషం. సముద్ర ఒత్తిడిని తట్టుకుని అక్యూరెస్ గా టైమ్ చూపించడంతో.. మరుసటి రోజు పేపర్లో స్విమ్మర్ తో పాటుగా రోలెక్స్ వోయ్ స్టర్ కూడా మెయిన్ హెడ్డింగ్ గా నిలిచింది.

మార్కెటింగ్ స్టాటజీ

విల్ డార్ఫ్-డేవిస్ లు వినూత్నమైన మార్కెటింగ్ స్ట్రాటజీలను అప్లై చేసేవారు. వారి ఐడియాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా తమ వాచ్ లను పబ్లిసిటీ చేసుకున్నారు. తొలుత స్విమ్మర్ ద్వారా వాటర్ ఫ్రూఫ్ రిస్ట్ వాచ్ ను ప్రజల్లోకి తీసుకెళ్తే.. ఆ తర్వాత తమ దృష్టిని పర్వతారోహణ చేసే వారిపై పడింది. 1953లో ఎడ్మండ్ హిల్లరీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ ను అధిరోహించారు. ఆ సంఘటన వరల్డ్ వైడ్ గా సంచలనం రేపడంతో.. అప్పటి నుంచి ఎవరెస్ట్ ను ఎక్కే పర్వతారోహకులకు తమ వాచ్ లను ఇవ్వడం మెుదలు పెట్టింది. అంత మంచులోనూ, అంత ఎత్తులోనూ రోలెక్స్ వాచ్ లు కచ్చితంగా టైమ్ ను సూచించడంతో మార్కెట్ లో ఈ కంపెనీ వాచ్ లపై ఎనలేని ఆదరణ పెరిగింది. ఆ తర్వాత కార్లలో కూడా వీటిని పరీక్షించారు. 1960లో ఓ ప్రాజెక్ట్ లో భాగంగా సముద్రంలో 100 అడుగుల లోతులోకి రోలెక్స్ వాచ్ ను పంపించారు. అంత ఒత్తిడి, ఉప్పునీరు, చల్లటి వాతావరణంలో కూడా రోలెక్స్ అద్భుతంగా పనిచేసి ప్రపంచాన్ని అబ్బురపరిచింది.

రోలెక్స్ ఎందుకంత ఖరీదు?

ప్రపంచ మార్కెట్ లో రోలెక్స్ కంపెనీతో పాటుగా మరెన్నో అగ్రగామి వాచ్ ల కంపెనీలు ఉన్నాయి. కానీ వాటికంటే ఎక్కువగా వినిపించే పేరు ‘రోలెక్స్’. అత్యంత ఖరీదైన వాచ్ గా రోలెక్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. మరి ఈ వాచ్ కు ఎందుకంత రేటు? దానికి ఒకే ఒక్క రీజన్ ‘బ్రాండ్’. అవును మీరు నమ్మినా నమ్మకపోయినా.. రోలెక్స్ అంటేనే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ కే విలువెక్కువగా. ఇదొక్కటే కాక ఈ వాచ్ ల్లో వాడే స్టీల్ మిగతా కంపెనీల కంటే కాస్ట్లీ కావడమే. మిగతా వాచ్ ల్లో 3161 స్టీల్ వాడితే.. రోలెక్స్ లో మాత్రం 9401 స్టీల్ ను వాడుతారు. వీటి తయ్యారిలో వాడే మిగతా గూడ్స్ కూడా అత్యంత ఖరీదైనవే. ఇవన్నీ ఒకెత్తు అయితే.. సముద్రంలోనూ, మంచు పర్వతాల మీద, దుమ్మూ, ధూళీ లాంటి ప్రదేశాల్లో కచ్చితమైన టైమింగ్ చూపించడం రోలెక్స్ ప్రత్యేకత.

ఇక ఇక్కడ చర్చించుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే? ఈ వాచ్ లను ఇబ్బడి ముబ్బడిగా తయ్యారు చెయ్యరు. ఆర్డర్ల ప్రకారంమే వీటిని మాన్యూఫ్యాక్చరింగ్ చేస్తారు. అందుకే ఇవి ఆర్డర్ పెట్టిన కొన్ని సంవత్సరాలకు వారి చేతికి వస్తాయి. సౌదీ అరేబియా రాజులు సైతం వీటి కోసం ఎదురుచూస్తారంటేనే వీటి విలువ ఏంటో అర్ధమవుతోంది. పైగా రోలెక్స్ వాచ్ లను స్టేటస్ సింబల్ గా చూస్తున్నారు. ఇది కూడా వాటి ధర పెరగడానికి పరోక్షంగా కారణం అవుతోంది. ఆన్లైన్ లో రోలెక్స్ వాచ్ లు అస్సలు దొరకవు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మార్కెట్ లో ఎక్కువ దొరకుండా చేసి.. వాటికి కృత్రిమ డిమాండ్ సృష్టించడం కూడా వీటి ధర ఎక్కువగా ఉండాటానికి ప్రధాన కారణం. డబ్బున్న వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేసుకుని తన ప్రస్థానాన్ని ఇప్పటికీ దిగ్విజయంగా కొనసాగిస్తోంది.

ఇక మోడల్స్ ను బట్టి వీటి ధరలు లక్షల నుంచి కోట్ల వరకు ఉంటాయి. ప్రస్తుతం ఈ కంపెనీలో 30 వేల ఉద్యోగులు ఉండగా.. ప్రతీ ఏడాది 10 లక్షల వాచ్ లను తయ్యారు చేసి.. 8 వేల కోట్లు సంపాదిస్తోంది కంపెనీ. ఇదిలా ఉండగా.. సేవా కార్యక్రమాల్లో కూడా రోలెక్స్ తన వంతు సహాయం చేస్తోంది. కంపెనీకి వస్తున్న లాభాల్లో 90 శాతం ప్రపంచ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ.. తన మంచి మనసును చాటుకుంటోంది. ప్రపంచానికి ఓ అద్భుతమైన వాచ్ ను అందించిన విల్ డార్ఫ్ 1960 జులై 6న మరణించాడు. మరి రోలెక్స్ వాచ్ కు ఇంత ధర ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments