నిమ్మగడ్డ.. ఇప్పుడేం చేస్తారు..?

నిమ్మగడ్డ.. ఇప్పుడేం చేస్తారు..?

అధికార పార్టీ నేతలపై ఫిర్యాదులు, అధికారులపై చర్యలు తీసుకుంటూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తీరు వివాదాస్పదమవుతోంది. పరిధికి మించి వ్యవహరిస్తూ, అధికారులతోపాటు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని కూడా పదవి నుంచి తొలగించాలని గవర్నర్‌కు సిఫార్సు చేయడం నిమ్మగడ్డ వ్యవహారించే తీరు ఎలా ఉందో తెలుపుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆడమన్నట్లు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆడుతున్నారనే విమర్శలను వైసీపీ నేతల నుంచి ఎదుర్కొంటున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ప్రజల నుంచి మద్ధతు కూడా లభిస్తోంది. తనపై వైసీపీ నేతలు విమర్శలు చేసే అస్కారం నిమ్మగడ్డ పనితీరు ద్వారానే ఇస్తున్నారని స్పష్టమవుతోంది.

కోడ్‌ పేరుతో హల్‌చల్‌ చేస్తున్న నిమ్మగడ్డ.. దాన్ని కేవలం వైసీపీ నేతలకే పరిమితం చేస్తున్నారనేలా ఆయన పనితీరు ఉంటోంది. నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాజకీయ పార్టీల ప్రమేయం, గుర్తులు లేకుండా జరిగే ఎన్నికలని చెబుతూనే.. పార్టీ తరఫున ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసి వార్తల్లో నిలిచారు. చంద్రబాబు తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన వైసీపీ.. ఈ అంశం కోడ్‌ ఉల్లంఘన కిందకు రాదా..? అని ప్రశ్నిస్తోంది. కోడ్‌ ఉల్లంఘించి, నిబంధలనకు విరుద్ధంగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడుపై ఏం చర్యలు తీసుకున్నారని గురువారం వైసీపీ నేత, ఎమ్మెల్యేల అంబటి రాంబాబు, ఈ రోజు ఎంపీ విజయసాయి రెడ్డిలు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను సూటిగా ప్రశ్నించారు. అధికారికంగా ఫిర్యాదు రాకపోవడంతో చర్యలు తీసుకోలేదనుకుంటే.. ఈ రోజు వైసీపీ లీగల్‌ సెల్‌ చంద్రబాబుపై ఫిర్యాదు చేసింది. అయినా నిమ్మగడ్డ నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు.

అధికార పార్టీ నాయకులు రాజకీయపరమైన ప్రకటనలు చేస్తున్నారని, కోడ్‌ ఉల్లంఘిస్తున్నారని, తనపై విమర్శలు చేస్తున్నారంటూ వారిపై ఫిర్యాదులు, చర్యలకు సిఫార్సులు చేస్తున్న నిమ్మగడ్డకు.. నిన్న చంద్రబాబు చేసిన పని కోడ్‌ ఉల్లంఘన కిందకు రాదని భావించారా..? లేక వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల మాదిరిగా.. చంద్రబాబు కనుసన్నల్లో నిమ్మగడ్డ నడుస్తున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతం మరిచిపోయాను, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యమంటూ చెప్పుకొస్తున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. ఆ మాటలను చేతల్లో చూపిస్తే.. ఎలాంటి విమర్శలు ఎదుర్కొనాల్సిన అవసరం ఉండదు. అధికార పార్టీ నేతలపై ఫిర్యాదులు చేయాల్సిన అగత్యం పట్టదు. కానీ మాటలకు చేతలకు పొంతన లేకుండా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ.. ఏకపక్షంగా వ్యవహరిస్తే.. విమర్శలు ఎదుర్కొనక తప్పదు. మరి చంద్రబాబుపై చర్యలు తీసుకుని తనపై వస్తున్న విమర్శలకు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ చెక్‌ పెడతారా..? లేక తన దారి తనదేనన్నట్లు వ్యవహరిస్తారా..? వేచి చూడాలి.

Show comments