ఊర్వశివో రాక్షసివో రివ్యూ..

ఊర్వశివో రాక్షసివో రివ్యూ..

  • Published - 02:01 PM, Fri - 4 November 22
ఊర్వశివో రాక్షసివో రివ్యూ..

తండ్రి అగ్ర నిర్మాతల్లో ఒకరు, తాత పేరు మోసిన సుప్రసిద్ధ హాస్య నటుడు, అన్నయ్య ప్యాన్ ఇండియా స్టార్, మావయ్య కుటుంబం నిండా స్టార్లే. ఇన్ని సానుకూలతలు ఉన్నా అల్లు శిరీష్ కుదురుకోలేకపోవడానికి సవాలక్ష కారణాలున్నాయి. అయినా కూడా హీరోగా అప్పుడప్పుడు బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నాడు. ఆ క్రమంలో వచ్చిందే ఊర్వశివో రాక్షసివో. ముందు దీనికి పెట్టిన టైటిల్ ప్రేమే కాదంట. ఆ తర్వాత కారణమేంటో కానీ క్యాచీగా ఉంటుందని దీనికి షిఫ్ట్ అయ్యారు. బన్నీతో నా పేరు సూర్యలో ఆడిపాడిన అను ఇమ్మానియేల్ ఇందులో హీరోయిన్. ఇంతకీ  సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం పదండి

కథ..!
ఒకే ఐటి కంపెనీలో పని చేసే శ్రీ(అల్లు శిరీష్), సింధు(అను ఇమ్మానియేల్)లవి పూర్తిగా విరుద్ధ మనస్తత్వాలు. అయితే ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండటం వల్ల ఇద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారి అటువైపు శారీరక సంబంధం దాకా వెళ్తుంది. తమ రిలేషన్ పట్ల శ్రీ ఉన్నంత సీరియస్ గా సింధు ఉండదు. ఇదంతా మాములేనని తేలిగ్గా అతని ప్రపోజల్ ని తిరస్కరిస్తుంది. లివ్ ఇన్ రిలేషన్ లో ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలుపెడతారు. సాంప్రదాయబద్దంగా ఆలోచించే శ్రీకి అమెరికా వాసనలుండే సింధుకి చివరికి బాండింగ్ కుదిరిందా లేదా, వీళ్ళ లవ్ స్టోరీ ఆఖరికి ఏ మజిలీకి చేరుకుందనేది తెరమీద చూస్తేనే అర్థమవుతుంది.

నటీనటులు..
బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేకుండా ఏ హీరో అయినా ప్రేక్షకుల్లో ఒక స్థిరమైన అభిప్రాయం తెచ్చుకోవాలంటే ప్రాధమికంగా కావలసింది మంచి నటన. శిరీష్ ఈ విషయంలో ఎక్కువ హోమ్ వర్క్ చేసినట్టు ఏ సినిమాలోనూ కనిపించలేదు. తనకూ కొన్ని బలహీనతలు ఉన్నాయి. మాస్ అప్పీల్ ఉండదు. అమ్మాయిలను ఠక్కున ఆకట్టుకునే రూపం అనిపించదు. యూత్ కి ఫెవరెట్ గా మారిపోయే ఫీచర్స్ లేవు. ఉన్నదల్లా డీసెంట్ గా అనిపించే పెర్ఫార్మన్స్. ఇందులోనూ అదే చేశాడు. ఛాలెంజింగ్ అనిపించే ఎలాంటి రిస్క్ దర్శకుడు ఇవ్వలేదు. రొమాంటిక్ లిప్ లాక్ సీన్స్ లో జీవించేశాడు. స్టోరీ డిమాండ్ చేసిందే అయినా స్క్రీన్ మీద చెలరేగిపోయాడు.

అవకాశాలు బాగా తగ్గిపోయి ఇక రాదేమో అనుకున్న టైంలో అను ఇమ్మానియేల్ కి మంచి రీ ఎంట్రీ దొరికింది. క్యూట్ లుక్స్ తో స్వీట్ యాక్టింగ్ తో ఆ పాత్రకు సరిగ్గా సరిపోయింది. ఇంటిమేట్ సన్నివేశాల్లో ఏ మాత్రం మొహమాటపడకుండా అడిగినందంతా చేసేసింది. వీళిద్దరూ కాకుండా అంతకన్నా ఎక్కువగా నిలబెట్టింది గుర్తుండిపోయేది మాత్రం సునీల్, వెన్నెల కిషోర్ లే. ఈ మధ్య ఈ కమెడియన్స్ ని వాడుకోవడం చేతకాక చేతులెత్తేస్తున్న దర్శకులకు చెంపపెట్టులా రాకేష్ శశి రాసుకున్న హిలేరియస్ ఎపిసోడ్స్ చక్కగా పండించారు. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కన్నా ఇదే ఎక్కువ ఎంజాయ్ చేయడం కరెక్టే. పోసాని, ఆమని తదితరులకు ఎక్కువ స్కోప్ దక్కలేదు

డైరెక్టర్ అండ్ టీమ్..

దర్శకుడు రాకేష్ శశిలో మంచి ఎంటర్ టైనింగ్ రైటర్ ఉన్నాడు. ఎమోషన్స్ ని నీట్ గా ప్రెజెంట్ చేయగలడు. గత చిత్రం మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ విజేతలో ఇది చేశాడు కానీ క్యాస్టింగ్ తో పాటు కాన్సెప్ట్ లో మరీ కొత్తదనం లేకపోవడం వల్ల అది ఆడియన్స్ కి రీచ్ కాలేదు. అందుకే రిస్క్ వద్దకునున్నాడో ఏమో ఈసారి తమిళ హిట్ రీమేక్ కు మొగ్గు చూపాడు. ఒరిజినల్ వెర్షన్ మంచి విజయం సాధించింది. అందుకే సాధ్యమైనంత వరకు దానికే కట్టుబడి తన బలమంతా కలం ద్వారా చూపించే ప్రయత్నం చేశాడు. లైన్ పరంగా చూసుకుంటే ఇందులో పెద్దగా కొత్తదనం ఏమి లేదు. ఎన్ని వచ్చాయో గుర్తుచేసుకోవడమూ కష్టం. చాలా సినిమాల్లో చూసిందే.

ఇదే పాయింట్ తో లెక్కలేనన్ని వెబ్ సిరీస్ లు కూడా వచ్చాయి. ఈ మధ్యే రిలీజైన కృష్ణ వృందా విహారిలోనూ ఇంచుమించు ఇదే తరహా కాంఫ్లిక్ట్ కనిపిస్తుంది. అందుకే రాకేష్ శశి ఇలాంటి సబ్జెక్టుని ఫ్లాట్ గా ప్రెజెంట్ చేస్తే లాభం లేదని కామెడీ మీద ఆధారపడ్డాడు. ఫస్ట్ హాఫ్ లో దాదాపు సక్సెస్ అయ్యాడు. తను టార్గెట్ చేసిన యూత్ ని నవ్వించడంలో సరైన ట్రాక్ లోనే వెళ్ళాడు. అవసరానికి మించి ముద్దు సీన్లు పెట్టడం యువత కోసమే అయినా మరీ ఇన్నేసి అవసరం లేదనిపిస్తుంది. టెక్నాలజీ పెరిగిన ట్రెండ్ లో కేవలం వీటికోసమే ఎగబడి థియేటర్లకొచ్చే కుర్రకారు తక్కువ. స్మార్ట్ ఫోన్ లోనే సవాలక్ష ఆప్షన్లు ఉండగా మళ్ళీ కిస్సుల కోసమే టికెట్లు కొనరుగా.

ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీసింది కాకపోవచ్చు. అయినా కూడా అల్లు బ్రాండ్ హీరో కాబట్టి ఎంతో కొంత డీసెంట్ కంటెంట్ ఆశించే జనాలు ఉంటారు. కానీ రాకేష్ సెక్స్ కాన్సెప్ట్ మీద అంత సాగదీయడం లెన్త్ కు పనికొచ్చిందే తప్ప కంటెంట్ పరంగా ఎలాంటి వేల్యూని యాడ్ చేయలేదు. పైగా దీనికి సంబంధించి సందేశాలు ఎమోషన్లు పట్టించుకునే మూడ్ లో అమ్మాయిలు అబ్బాయిలు ఉండరు కాబట్టి ఈ ట్రాక్స్ ని ట్రిమ్ చేసి ఉంటే వేగం పెరిగి ల్యాగ్ ఫ్యాక్టర్ తగ్గిపోయేది. రెండున్నరట గంటల నిడివిలో చెప్పే కథ కూడా కాదిది. ఈజీగా ఒక ఇరవై నిముషాలు కోత ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో అవసరం లేనివి ఉన్నాయి.

కథనం ఊహించినట్టే సాగుతుంది. ఎక్కడా థ్రిల్స్ కానీ సర్ప్రైజులు కానీ ఉండవు.. కాకపోతే రెండు మూడు చిన్న ట్విస్టులు వర్కౌట్ అయ్యేలా చేసుకున్నారు. మదర్ సెంటిమెంట్ డ్రామా కోసం ఇరికించినట్టు అనిపించినా ఓవరాల్ గా మరీ నెగటివ్ ఫీలింగ్ కలిగించలేదు. పెళ్లి లివిన్ మధ్య ఉన్న సన్నని గీత గురించి చెప్పాలనే ప్రయత్నం ఈ కథ సృష్టికర్తది. చిత్రం ద్వారా తేజ ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితమే టచ్ చేశాడు. ఆ తర్వాత ఎందరో క్రియేటివ్ గా చెప్పే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు డిజాస్టర్లు అందుకున్నారు. వాటికి కారణాలు అనేకం. ఊర్వశివో రాక్షసివో ఏ క్యాటగిరిలో వస్తుందో కుర్రకారు ఎగబడి చూడటం మీదే ఉంటుంది

యువతరం దర్శకులు రామ్ కామ్ అనుకున్నప్పుడు కేవలం రెండు మూడు అంశాల మీద ఫోకస్ పెట్టడంతో కొన్ని రిపీట్ అవుతున్న ఫీలింగ్ కలుగుతోంది. బొమ్మరిల్లు తరహా ఆలోచనలు ఇప్పుడు అవుట్ డేటెడ్ అనిపించినా నిజానికి కాలదోషం లేనిది వాటికే. అన్ని వర్గాలను ఆకట్టుకునే ఛాన్స్ ఉంటుంది. న్యూ ఏజ్ థాట్స్ అని సెక్స్, లివింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం తప్పని కాదు. ఓకే బంగారంలో మణిరత్నం డిస్కస్ చేసింది కూడా ఇదే. కానీ సామజిక వాతావరణంలో ఒక పరిమిత వర్గానికి తప్ప ఇంకా ఈ ధోరణి అందరికీ అలవడలేదు. అలాంటప్పుడు పదే పదే యాక్సెప్ టెన్స్ దక్కడం కష్టమే అందులోనూ శిరీష్ లాంటి హీరోతో
ఎలాంటి అంచనాలు లేకపోవడమే ఊర్వశివో రాక్షసివోకు కలిసొచ్చిన అతి పెద్ద ప్లస్ పాయింట్. ఇంత ఫన్ ఉంటుందనుకోలేదని ఖచ్చితంగా అనిపిస్తుంది. అలా అని అందరికీ రికమండ్ చేసే తీరాలన్న భావన కలగకపోయినా ఈ మాత్రం ఉందన్న సంతృప్తి కలిగించడంలో రాకేష్ శశి విజయం సాధించాడు. ఇంకొంచెం బెటర్ గా చేసుండే అవకాశం ఉంది కానీ రీమేక్ కావడంతో ఏం చేస్తే ఎక్కడ సోల్ దెబ్బ తింటుందోనన్న భయంతో మార్పుల జోలికి పెద్దగా వెళ్ళలేదు. మరి ఈ సినిమా ష్యుర్ షాట్ గా థియేటర్లోనే చూడాల్సిన కంటెంటా అంటే క్యాస్టింగ్ కోణంలో పూర్తిగా ఎస్ చెప్పలేం కానీ వినోదం ఆశించే సగటు ప్రేక్షకుడికి మాత్రం నో అనిపించబుద్ది కాదు.

ఇలాంటి సినిమాలకు సంగీతం చాలా కీలకం. అయితే ఛార్ట్ బస్టర్స్ అనిపించే స్థాయిలో సాంగ్స్ లేకపోవడం మైనస్సే కానీ మరీ బ్యాడ్ గా అయితే లేవు. అచ్చు రాజమణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఫీల్ ఇచ్చింది. మూడ్ కి తగట్టు చక్కగా కంపోజ్ చేశారు. ఎటొచ్చి అనూప్ రూబెన్స్ నుంచే బెటర్ అవుట్ ఫుట్ ఎక్స్ పెక్ట్ చేస్తాం. తన్విర్ మిర్ ఛాయాగ్రహణంలో విజువల్స్ బాగా పడ్డాయి. రిచ్ నెస్ కనిపించడంలో మంచి కృషి చేశారు. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్ గా ఉంటే పాజిటివ్ నెస్ పెరిగేది. ఆర్టిస్టులకు తగ్గట్టు రాసుకున్న సంభాషణలు బాగా కుదిరాయి. గీతా ఆర్ట్స్ 2 నిర్మాణం గురించి ప్రత్యేకంగా చెప్పేందుకేమీ లేదు.

ప్లస్ గా అనిపించేవి
కామెడీ
ఫస్ట్ హాఫ్
సునీల్, వెన్నెల కిషోర్

మైనస్ గా తోచేవి
ఊహించగలిగే కథనం
రొమాన్స్ డోస్
క్లైమాక్స్ లో హడావిడి

కంక్లూజన్..
యూత్ ని టార్గెట్ చేసిన సినిమాలకు అన్ని వర్గాలను ఆశించలేం. కేవలం ఆ జానర్ ఆడియన్స్ ని మెప్పిస్తుందా లేదా అనే కోణంలోనే చూడాలి. అలా చెప్పుకుంటే ఊర్వశివో రాక్షసివో మరీ విసిగించకుండా బయటికి వస్తున్నప్పుడు ఓకే అనిపించిందంటే పాస్ అయినట్టే. ఒకవేళ శిరీష్ కాకుండా ఇమేజ్ ఉన్న మీడియం రేంజ్ స్టార్ హీరో చేసుంటే దీని స్థాయిలో ఖచ్చితంగా పెరిగేది. అల్లు తమ్ముడి కోసం థియేటర్ కు ఏం వెళతాంలే అనుకునే పబ్లిక్ ని పూర్తి స్థాయిలో మెప్పించేలా లేదు కానీ ఇతను గతంలో చేసినవాటి కంటే బెటర్ అనిపిస్తుంది కాబట్టి వీకెండ్ లేదా ఖాళీ టైంలో ఈ జంటను అనుమానపడకుండా ఓసారి నిక్షేపంగా పలకరించి రావొచ్చు

ఒక్క మాటలో – యూత్ రాక్షసి
రేటింగ్: 2.75 / 5 

Show comments