ఆసియా కప్‌ జట్టు ఎంపికలో ఆ ఒక్కడి తీవ్ర అన్యాయం! మండిపడుతున్న ఫ్యాన్స్‌

ఆసియా కప్‌ 2023 కోసం బీసీసీఐ 18 మందితో కూడిన స్క్వౌడ్‌ను ప్రకటించింది. అందులో సంజు శాంసన్‌ స్టాడ్‌బై ప్లేయర్‌గా ఉన్నాడు. రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా, హార్దిక్‌ పాండ్యా వైస్‌ కెప్టెన్‌గా పటిష్టమైన జట్టునే బీసీసీఐ ప్రకటించింది. అయితే.. దాదాపు ఇదే జట్టు అక్టోబర్‌లో మన దేశంలోనే జరగనున్న వన్డే వరల్డ్‌ కప్‌ కూడా ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఈ నెల 30 నుంచి సెప్టెంబర్‌ 17 వరకు ఆసియా కప్‌ 2023 శ్రీలంక, పాకిస్థాన్‌ వేదికగా జరగనుంది. దాని తర్వాత మరే సిరీస్‌లు లేవు. సో.. కొత్త ఆటగాళ్లను జట్టులో చేర్చడం, ఇప్పుడున్న వాళ్లు తీసేయడం జరగకపోవచ్చు. ఎవరైనా గాయపడితే తప్పా.. పెద్దగా మార్పులు లేకుండానే భారత వరల్డ్‌ కప్‌ టీమ్‌ ఇలానే ఉంటుంది.

అయితే.. ఆసియా కప్‌ జట్టును ఒకసారి పరిశీలిస్తే.. రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, ఇషాన్‌ కిషన్‌, హర్దిక్‌ పాండ్యా(వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దుల్‌ ఠాకూర్‌, జస్ప్రీత్‌ బుమ్రా, షమీ, సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, సంజు శాంసన్‌(స్టాండ్‌బై ప్లేయర్‌) ఉన్నారు. అయితే.. ఈ టీమ్‌లో ఎవరిది కూడా తప్పు ఎంపిక అని చెప్పడానికి లేదు. అయితే.. ఒక్క ప్లేయర్‌కు మాత్రం తీవ్ర అన్యాయం జరిగిందనే విమర్శలు వస్తున్నా‍యి. ఆసియా కప్‌ 2023 టీమ్‌లో ఉండాల్సిన ఆటగాడంటూ, అతనికి చోటు ఇవ్వకపోవడం అన్యాయం అంటూ క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా పేర్కొంటున్నారు.

ఇంతకీ ఆ ప్లేయర్‌ ఎవరంటే.. స్టార్‌ లెగ్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌. ఈ చాహల్‌ ఎంత క్వాలిటీ స్పిన్నరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచి వికెట్‌ టేకింగ్‌ ఎబిలిటీ ఉన్న బౌలర్‌. అలాంటి బౌలర్‌ను ఆసియా కప్‌ కోసం ఎంపిక చేయకపోవడం కరెక్ట్‌ కాదని ఫ్యాన్స్‌ అంటున్నారు. జట్టు కుల్దీప్ యాదవ్‌ రూపంలో ఒక్కడే క్వాలిటీ స్పిన్నర్‌ ఉన్నాడని, టోర్నీ ఉపఖండంలో జరుగుతున్న నేపథ్యంలో జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నా తప్పులేదని పేర్కొంటున్నారు. నిజానికి వారి వాదనలో కూడా నిజముందనే చెప్పాలి. ఎందుకంటే.. ప్రస్తుతమున్న స్క్వౌడ్‌ను పరిశీలిస్తే.. టీమిండియా ఒక స్పిన్నర్‌, ముగ్గురు స్పెషలిస్ట్‌ బౌలర్లు, ఒక ఆల్‌రౌండర్‌తో ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఉంటుంది.

హార్దిక్‌ పాండ్యా వైస్‌ కెప్టెన్‌ కాబట్టి ఆల్‌రౌండర్‌ కోటాలో అతనే ఆడతాడు. అలాంటి టైమ్‌లో స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా ఉన్న అక్షర్ పటేల్‌కు ఎలాగో జట్టులో స్థానం దక్కదు. ఒక పేసర్‌ను పక్కనపెట్టి అక్షర్‌ను ఆడించాల్సి ఉంటుంది. కానీ, చాహల్‌ చూపించినంత ప్రభావం అక్షర్‌ చూపిస్తాడా? అంటే అనుమానమే. పైగా ఆసియా కప్‌ తర్వాత వన్డే వరల్డ్‌ కప్‌ కూడా మన దేశంలో జరగనుంది. మన దేశంలోని పిచ్‌లు స్పిన్‌కు ఏ రేంజ్‌లో అనుకూలంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే చాహల్‌ను ఆసియా కప్‌ కోపం ఎంపిక చేసి ఉండాల్సిందని భారత క్రికెట్‌ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ ఆలోచనను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీ20 కెప్టెన్‌గా బుమ్రా భేష్‌! పాండ్యా.. చూసి నేర్చుకోవాలి అంటూ..!

Show comments