ప్రశాంత్ కిషోర్ తో తమిళ హీరో భేటీ.. పొలిటికల్ ఎంట్రీ కోసమేనా?

తమిళ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి వస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ ఇప్పటికే పార్టీని రిజిస్టర్ చేయించి పోటీకి దిగనున్న సమయంలో మాకు ఆ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అని విజయ్ ప్రకటించడంతో ఇక వేరే దారి లేని పరిస్థితుల్లో దానిని ఉపసంహరించుకున్నారు. ‘ఆలిండియా దళపతి విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’ పేరుతో పార్టీ పేరును రిజిస్టర్‌ చేశారు. పార్టీని ఉపసంహరించుకున్నా పార్టీ కార్యాలయం అలానే ఉంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు. గతంలో విజయ్ తనకి రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని కూడా బహిరంగ వేదికల మీద చెప్పారు. కాని ఇటీవల తమిళనాడులో జరిగిన మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికల్లో కొన్నిచోట్ల విజయ్‌ మక్కల్‌ ఇయక్కంకు చెందిన అభ్యర్థులు పోటీ చేసి గెలుపొందారు. వారందరినీ విజయ్‌ ఇంటికి పిలిపించుకుని ఫోటోలు దిగారు. దీంతో మరోసారి విజయ్ రాజకీయాల్లోకి రానున్నారని తమిళ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

అయితే ఆ సంగతి పక్కన పెడితే విజయ్ హైదరాబాద్‌లో కొన్నిరోజుల క్రితం ప్రముఖ రాజకీయ నిపుణుడు, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్‌ కిషోర్‌ ని కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రశాంత్ కిషోర్ దేశంలోని పలు పార్టీలకి పనిచేసి విజయం సాధించేందుకు తమ స్ట్రాటజీలు అందించారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్, తమిళనాడు లో స్టాలిన్ అధికారంలోకి రావడం కోసం ప్రశాంత్ కిషోర్ టీం పనిచేసింది. ఇటీవల తెలంగాణ సీఎం కెసిఆర్ కూడా ప్రశాంత్ కిషోర్ ని వచ్చే ఎన్నికల్లో తమకోసం పని చేయమని నియమించుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు విజయ్ ప్రశాంత్ కిషోర్ ని కలిసాడని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. తమిళనాడు 2026 అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందే 2024 లోక్ సభ ఎలక్షన్స్ లో విజయ్ పోటీ చేయాలనుకుంటున్నాడని, అందుకు ప్రశాంత్ కిషోర్ సహాయం కోసం వచ్చి మాట్లాడినట్టు ప్రచారం జరుగుతోంది. నిజానికి తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు ప్రశాంత్ కిషోర్ పనిచేశారు.

ఆ పార్టీ బాగానే ఉన్నా జయలలిత చనిపోవడంతో అన్నాడీఎంకే నాయకత్వ లోపంతో సతమతం అవుతోంది. పార్టీ పెద్ద ఎవరు అని తేల్చుకోవడానికి అందులో ఉన్న నేతలకు సమయం సరిపోవడం లేదు. ఈ క్రమంలో ఆ పార్టీలోని కొంతమంది కీలక నాయకులు వేరే ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. ఎలాగూ డిఎంకెలో చేరలేరు, కమల్ హాసన్ పార్టీలో చేరాలన్నా ఫెయిల్యూర్ పార్టీ అని ముద్ర పడడంతో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. అలాంటి వారందరికీ విజయ్ పార్టీ సరైన వేదిక అవుతుందని భావిస్తున్నారు. విజయ్ రాజకీయ ఎంట్రీ కోసమే ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యారా లేక ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

Show comments