Idream media
Idream media
లఖింపూర్ ఖేరి కేసులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వ్యవహార సరళిని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఈ కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్రకు ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేయాలన్న సిట్ నివేదిక, లేఖలను ఏం చేశారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కారును నిలదీసింది. దీనిపై ఏప్రిల్ నాలుగో తేదీ లోపు స్పందించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆదేశించారు.
యూపీలోని లఖింపూర్ ఖేరిలో వాహనం కిందపడి ఎనిమిదిమంది మరణించిన ఘటనలో అరెస్టు అయిన ఆశిష్ మిశ్రకు అలహాబాద్ హైకోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని పిటిషన్లు సుప్రీంకోర్టులో నమోదయ్యాయి. సుప్రీంకోర్టు ఈ ఘటనపై దర్యాప్తునకు సిట్‌ను నియమించి తొలినుంచీ తానే కేసును పర్యవేక్షణ చేస్తోంది. దీనికోసం రిటైర్డు జడ్జిని ప్రత్యేకంగా నియమించింది. ఈ నేపథ్యంలో.. సిట్ రిటైర్డు జడ్జీ తన నివేదిక సమర్పించారు. ఆశిష్ మిశ్రకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తాము కోరినా పట్టించుకోలేదని ఆ నివేదికలో ఫిర్యాదు చేశారు.
ఈ నివేదికపై బుధవారం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ‘‘అలహాబాద్ హైకోర్టు ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రకు మంజూరు చేసిన బెయిల్ రద్దు అయ్యేలా చూడాలంటూ సిట్ నుంచి రెండు లేఖలు యూపీ హోమ్‌శాఖ సహాయ కార్యదర్శికి అందాయి. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకుంది?’’ అని యూపీ ప్రభుత్వం తరపు న్యాయవాది మహేశ్ జెఠ్మలానీని చీఫ్ జస్టిస్ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీల బెంచ్ ప్రశ్నించింది. ఆ లేఖలు తమకు అందలేదని న్యాయవాది తెలపగా.. సిట్ సమర్పించిన పత్రాలను పరిశీలించి.. వచ్చే నెల నాలుగో తేదీ లోపు స్పందించాలని బెంచ్ ఆదేశించింది.
ఆశిష్ మిశ్రకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే కోరారు. తాను కూడా బెయిల్ మంజూరును వ్యతిరేకించినట్టు యూపీ ప్రభుత్వం చెప్పడాన్ని ఆయన ప్రస్తావించారు. ఘటన జరిగిన సమయంలో అక్కడ తాను లేనంటూ నిందితుడు సమర్పించిన పత్రాలు అసలివి కావని.. అవి సృష్టించినవని రాష్ట్ర ప్రభుత్వం వాదించిన విషయాన్నీ కోర్టు దృష్టికి తెచ్చారు. ఇదంతా చూస్తే హైకోర్టు సరైన పరిశీలన జరపకుండా ఇచ్చిన తీర్పుగా దీనిని పరిగణించాల్సిన అవసరం కనిపిస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో బెయిల్‌ను రద్దు చేయడం లేక హైకోర్టు నిర్ణయాన్ని పక్కనపెట్టడమే మిగిలిన దారి అని వాదించారు. ఈ వివరాలను బెంచ్ నమోదు చేసుకుంది. సిట్ రిటైర్డ్ జడ్జి నివేదిక, లేఖలను పిటిషనరు, యూపీ ప్రభుత్వానికి అందించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణకు ఏప్రిల్ నాలుగో తేదీకి బెంచ్ వాయిదా వేసింది.