Idream media
Idream media
తెలుగుదేశంలో ఉన్నంతకాలం ఎమ్మెల్యే రోజా అనిపించు కునేందుకు ఆర్‌కే రోజా పడరానిపాట్లు పడ్డారు. పార్టీలో ఎంతో కష్టపడ్డారు. కానీ.. పార్టీలోనే తనకు గోతులు తీసేవారని ఆమె ఎన్నోసార్లు వాపోయారు. అంతేకాదు.. అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేస్తానని చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. భవిష్యత్ లేకుండా చేస్తానని చంద్రబాబు అంటే.. వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఆమెకు రాజకీయ రంగంలో చిరస్థాయిలో నిలిచిపోయే చోటు కల్పించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా అయ్యే అవకాశం ఇవ్వడమే కాదు.. ఇప్పుడు ఏకంగా మంత్రిని చేశారు. దీంతో మినిస్టర్ రోజా ఆనందానికి హద్దుల్లేవు. జగనన్న ఇచ్చిన బాధ్యతలకు న్యాయం చేసేందుకు జబర్దస్త్ వంటి టీవీ షోలకు ఇక దూరం అని ప్రకటించారు.
సినిమాల్లో నటన ద్వారా గుర్తింపుపొందిన రోజా జీవితం సినిమా కథకు ఏ మాత్రం తీసిపోదు. చిన్నప్పటి నుంచే ఎంతో కష్టపడ్డారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎదిరించి నిలబడ్డారు. ఆమె అసలు పేరు శ్రీలత. తండ్రి కుమారస్వామి రెడ్డి చిత్తూరు జిల్లా నుంచి హైదరాబాద్‌కి వలస వెళ్లారు. ఆమెకు చిన్ననాటి నుంచీ ప్రజాజీవితంపై మక్కువ. అందుకే చదువు కూడా అందుకు తగిన విధంగానే ఎంచుకున్నారు. నాగార్జున యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ నుంచి డిగ్రీ అందుకున్నారు. కొన్ని సంవత్సరాలు కూచిపూడి నృత్యాన్ని నేర్చుకున్నారు. బీఎస్‌సీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు ప్రేమ తపస్సు చిత్రం ద్వారా సినిమాలకు పరిచయమయ్యారు రోజా. దానికంటే ముందు తమిళచిత్రం చంబరతి చిత్రంలో నటించారు. ఆ సినిమా తమిళంలో మ్యూజికల్ హిట్. తెలుగులో చామంతి కింద డబ్ చేశారు. ఆ సినిమాను ప్రముఖ ఛాయా గ్రహకుడు, దర్శకుడు అయిన ఆర్కే సెల్వమణి రూపొందించాడు. ఆయనతోనే ప్రేమలో పడిపోయిన రోజా పెద్దల అంగీకారంతో దంపతులయ్యారు. వీరికి కుమార్తె అన్షు మాలిక, కొడుకు కృష్ణ కౌశిక్ ఉన్నారు.
2004లోనే రాజకీయాల్లోకి వచ్చిన రోజా నగరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి వారి చెంగారెడ్డి పై పోటీ చేశారు. 2009లో చంద్రగిరి నియోజకవర్గంలో మరోసారి పోటీచేసినా ఫలితం దక్కలేదు. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్లో చేరిన రోజా.. ఆ తర్వాతి కాలంలో వైయస్సార్ కాంగ్రెస్ లో జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు నగరి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు పై విజయం సాధించిన రోజా.. 2019 ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్ పై గెలిచి సత్తా చాటారు.
కెరీర్‌పై కీలక నిర్ణయం
ప్రాణం ఉన్నంతవరకు సీఎం జగనన్నతోనే ఉంటానని, ఆయన కోసమే పనిచేస్తానని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. నూతన మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న అనంతరం ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం జగన్ ఇచ్చిన గుర్తింపు ఎప్పటికీ మర్చిపోలేను. నన్ను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని చంద్రబాబు అన్నారు. కానీ జగనన్న నాకు రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రిగా అవకాశం ఇచ్చారు. మహిళా పక్షపాత సీఎం క్యాబినెట్‌లో మహిళా మంత్రిగా చోటుదక్కడం నా అదృష్టం. సీఎం జగనన్న చెప్పిన పని చెయ్యడమే నా విధి. నన్ను ఐరన్ లెగ్ అని దుష్ప్రచారం చేశారు. కానీ ఈ రోజు జగనన్న మంత్రిగా చేశారు. నా ప్రాణం ఉన్నంత వరకు జగనన్న కోసం పనిచేస్తాను. మంత్రి అయినందుకు షూటింగ్‌లు మానేస్తున్నాను. టీవీ, సినిమా షూటింగ్‌లలో ఇక చెయ్యను’ అని నగరి ఎమ్మెల్యే రోజా ప్రకటించారు.