లఖింపూర్‌ ఖేరీ కేసు..కేంద్ర మంత్రి కుమారుడికి షాక్‌

గ‌తేడాది అక్టోబర్ లో లఖింపూర్‌ ఖేరీలో ఆందోళన చేస్తోన్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా తనయుడు ఆశిష్‌ మిశ్రా కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించగా.. అనంతరం జరిగిన అల్లర్లలో ఆశిష్‌ డ్రైవర్‌, ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఓ జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయారు. లఖింపూర్‌ ఖేరీ హింస కేసులో.. కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా తనయుడు ఆశిష్‌ మిశ్రాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఫిబ్రవరి 10న అలహాబాద్‌ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను.. సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమాకోహ్లీల ధర్మాసనం సోమవారం తీర్పునిచ్చింది.

ఆశిష్‌ మిశ్రా బెయిల్‌ను రద్దు చేయాలంటూ బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నెల 4న ఈ కేసులో వాదోపవాదాలు ముగియగా.. ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది.సోమవారం నాటి తీర్పు సందర్భంగా అలహాబాద్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన తీరును ధర్మాసనం తప్పుపట్టింది. బాధితుల వాదనను వినలేదని ఆక్షేపించింది. అలహాబాద్‌ హైకోర్టు విచారణ వర్చువల్‌గా జరిగిందని.. ఆ సమయంలో తమ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్లు వివరించారు. వర్చువల్‌ హియరింగ్‌ సమయంలో సాంకేతిక కారణాలతో కనెక్షన్‌ కట్‌ అయ్యిందని.. ఆ తర్వాత తమ వాదనలను పరిగణనలోకి తీసుకోవాలని కోరినా.. పట్టించుకోలేదని పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఘనవిజయాన్ని ప్రస్తావిస్తూ.. సాక్షులకు బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయని, గత నెల ఓ సాక్షిపై దాడి జరిగిందని గుర్తుచేశారు. దీనిపై జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ధర్మాసనం స్పందిస్తూ.. అలహాబాద్‌ హైకోర్టు హడావుడిగా, హ్రస్వదృష్టితో తీర్పునిచ్చినట్లు స్పష్టమవుతోందని వ్యాఖ్యానించింది. ‘‘అసలు బెయిల్‌ పిటిషన్‌కు ఎఫ్‌ఐఆర్‌, పోస్టుమార్టం నివేదికలతో సంబంధమేంటి? ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ ఎన్‌సైక్లోపీడియా కాదు కదా? బెయిల్‌ సమయంలో అసంబద్ధమైన అంశాలను, విశ్లేషణలను, అప్రధాన కారణాలను పరిగణనలోకి తీసుకున్నారు. రికార్డుల్లో ఉన్న వివరాలతో.. హ్రస్వదృష్టితో తీర్పునిచ్చారు. సంఘటన తీవ్రతను పరిగణనలోకి తీసుకోలేదు. ఈ కేసులో అభియోగాలు నిజమైతే..శిక్ష తీవ్రతను గుర్తించలేకపోయారు. ఆగమేఘాల మీద బెయిల్‌ ఇచ్చేశారు’’ అని ధర్మాసనం తన 24 పేజీల తీర్పులో పేర్కొంది.

విచారణలో ప్రతి దశలో తమ వాదనలను వినిపించే హక్కు బాధితులకు ఉంటుందనే విషయం తెలియదా? అంటూ.. హైకోర్టు తీర్పుపట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంలో హైకోర్టు తన పరిధిని దాటి వ్యవహరించిందని అభిప్రాయపడింది. కాగా.. ఫిబ్రవరి 10 నాటి బెయిల్‌ తీర్పులో అలహాబాద్‌ హైకోర్టు పోలీసుల తీరును తప్పుబట్టింది. ఎఫ్‌ఐఆర్‌లో తుపాకీతో కాల్పులు జరిపారని పేర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. పోస్టుమార్టం నివేదికలో ఎక్కడా మృతుల శరీరాల్లో తూటాలు లభించలేదని, క్షతగాత్రులకూ బుల్లెట్‌ గాయాలు కాలేదని పేర్కొంది. పోలీసుల దర్యాప్తు సరిగాలేదని పేర్కొంటూ ఆశిష్‌ మిశ్రాకు బెయిల్‌ మంజూరు చేసింది.

ఈ అంశాలను సుప్రీంకోర్టు ధర్మాసనం ఎత్తిచూపుతూ.. విచారణ ప్రారంభం కాకముందే పోస్టుమార్టం నివేదిక, గాయాల గురించి అలహాబాద్‌ హైకోర్టు తన బెయిల్‌ ఉత్తర్వుల్లో ప్రస్తావించడాన్ని తప్పుబట్టింది. అలహాబాద్‌ హైకోర్టులో మరో జడ్జి ధర్మాసనానికి ఈ విచారణను బదలాయించాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తిరిగి విచారించాలని ఆదేశించింది.

Show comments