ఊహించిందే జరిగింది.. బాదుడు మొదలైంది..

రెండు నెలలుగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నా, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో పలు దేశాల్లో పెట్రోమంటలు తీవ్రమైనా.. ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలు పెంచలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దేశంలోని చమురు కంపెనీలు గత నవంబరు 4 నుంచి పెట్రో ధరలను పెంచలేదు. ఈ నెల 10న ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ధరలు పెంచేస్తారని కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలన్నీ పేర్కొన్నాయి. తీవ్రస్థాయిలో ప్రచారం జరిగింది. ఇప్పుడు అది నిజమైంది. మంగళవారం నుంచి మళ్లీ బాదుడు మొదలైంది. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.50 పెరిగింది. పెట్రోలు, డీజిల్‌ ధరలు కూడా పెరిగాయి.

దేశంలో మళ్లీ ‘పెట్రో’ బాదుడు మొదలైంది. సామాన్యులపై గ్యాస్‌ ‘బండ’ పడింది. దేశంలో 137 రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోలు, డీజిల్‌ ధరలకూ రెక్కలొచ్చాయి. గత అక్టోబరులో చివరిసారిగా పెరిగిన వంట గ్యాస్‌ ధర మంగళవారం రికార్డు స్థాయిలో పెరిగింది. చమురు సంస్థలు ఎల్పీజీ సిలిండర్‌పై రూ.50 పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో, వాణిజ్య రాజధాని ముంబైలో 14.2 కేజీల సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.949.50కు చేరింది. కోల్‌కతాలో రూ.976కు చేరుకుంది.

చివరిసారిగా గత ఏడాది అక్టోబరు 6న ఎల్పీజీ సిలిండర్‌ ధరను సవరించారు. గత ఏడాది జూలై, అక్టోబరు 6 మధ్యలో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.100 మేరకు పెంచేశారు. నెలవారీ ధరల సవరణపై తీవ్ర విమర్శలు రావడంతో ఆ ప్రక్రియను నిలిపివేశారు. 2020, మే నుంచి నేరుగా ఎల్పీజీ సబ్సిడీ ఇచ్చే విధానాన్ని కేంద్రం నిలిపివేసింది. రవాణా చార్జీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం నామమాత్రపు మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. మరోవైపు ప్రభుత్వరంగ చమురు సంస్థలు పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ.80 పైసల చొప్పున ధరలు పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.96.21కు, డీజిల్‌ ధర లీటరుకు రూ.87.47కు చేరుకుంది. ఇక పెట్రోలు, డీజిల్‌ ధరలను నవంబరు 4 తర్వాత పెంచలేదు. పైగా అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కొంత మేర ఉపశమనం కల్పించింది.

ఇక నుంచి ధరల పెంపు తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పెట్రో ఉత్పత్తుల ధరల పెంపును నిరసిస్తూ పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. మంగళవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్‌పక్ష నేత అధీర్‌రంజన్‌ చౌదరి ఈ అంశాన్ని లేవనెత్తి, కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రో ధరలు పెంచేశారని మండిపడ్డారు. కాంగ్రెస్‌, టీఎంసీ, ఎన్సీపీ, డీఎంకే, వామపక్ష సభ్యులు ధరల పెంపును నిరసిస్తూ నినాదాలు చేశారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

Show comments