తెలంగాణ ప్రజలు మాత్రమే కాక చత్తీస్గడ్, ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన ఆదివాసీలు కొందరు తమ ఇలవేల్పుగా భావించే సమ్మక్క, సారలమ్మ గురించి చిన్నజీయర్ స్వామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అసలు ఆ కామెంట్స్ ఆయన ఎప్పుడు చేశారు అన్న దాని మీద అసలు క్లారిటీ లేదు., ఈ వీడియో ప్రకారం చిన్నజీయర్ స్వామి కాస్త యవ్వనంలోనే ఉన్నట్లు కనిపిస్తున్నారు. అయితే ఆ వీడియో ఇప్పుడు ఎందుకు తెరమీదకు వచ్చింది అనేది కూడా ఎవరికీ అంతుపట్టడం లేదు. ఆ వీడియోలో చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ సమ్మక్క, సారలమ్మ అసలు దేవతలు ఎలా అయ్యారు? వారు బ్రహ్మలోకం నుంచి ఏమైనా ఊడిపడ్డారా అంటూ ప్రశ్నించారు.
అక్కడికి చదువుకున్న వారు కూడా వెళ్లడం బాగోలేదని దాన్ని వ్యాపారం చేస్తున్నారు అంటూ ఆయన వీడియోలో మాట్లాడారు. ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతోన్న తరుణంలో ఎట్టకేలకు ఈ అంశం మీద చిన్నజీయర్ స్వామి స్పందించారు. కొందరు సొంత లాభం కోసమే ఈ రకమైన వివాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని అన్నారు. అసలు ఈ వివాదం ఎందుకు తెరపైకి తీసుకొచ్చారన్నది అలా చేసిన వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. ఎఫ్పుడో 20 ఏళ్ల క్రితం తాను చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు వివాదం చేస్తున్నారని, ఆదివాసీల కోసం తాము పాఠశాలలను నిర్వహిస్తున్నామని.. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు.
మహిళల్ని ఆదరించాలని భావించే తాను మహిళల్ని, దేవతల్ని చిన్నచూపుతో మాట్లాడతామని అనుకోవడం పొరపాటని అన్నారు. ఎవరైనా దేని గురించైనా మాట్లాడినప్పుడు దాని పూర్వాపరాలు కూడా తెలుసుకోవాలని చిన్నజీయర్ అన్నారు. అది లేకుండా కేవలం కొన్ని మాటలను మాత్రమే తీసుకుని ఆ వ్యక్తి అలా అన్నాడని అంటే అది హాస్యాస్పదమే అవుతుందని అన్నారు. ఇక తనకు ఎవరితో గ్యాప్ ఉండదని, ఎవరైనా తనకు దూరంగా ఉండాలనుకుంటే తాను చేయగలిగింది ఏమీ లేదని వ్యాఖ్యానించారు.