ఆత్మకూరు బ‌రిలో బీజేపీ

మేకపాటి గౌతంరెడ్డి అకాల మరణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉపఎన్నికలు జ‌ర‌గాల్సి ఉంది. అయితే ఉపఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఇప్పటివరకు ఇంకా క్లారిటీ లేదు. ఉప ఎన్నిక షెడ్యూల్ కోసం రాజ‌కీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. వాస్త‌వానికి అది వైసీపీ సీటు. ఉప ఎన్నిక‌లో కూడా ఆ పార్టీదే మ‌ళ్లీ గెలుపు అనే దానిలో బ‌హుశా సందేహాలు అవ‌స‌రంలేదు. ఎందుకంటే.. ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన‌ మేక‌పాటి ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన సేవ‌లు స్థానికుల మ‌దిలో నిలిచిపోయాయి.

మేక‌పాటి మ‌ర‌ణం అనంత‌రం వైసీపీ నుంచి గౌతంరెడ్డి భార్య శ్రీకీర్తి పోటీచేసే అవకాశముంది అని మొదటి నుంచీ ప్రచారం జరుగుతోంది. అయితే.. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి రెండో కుమారుడు, గౌతంరెడ్డి సోదరుడు విక్రంరెడ్డి ని అక్క‌డి నుంచి పోటీకి దింపాల‌ని మేక‌పాటి కుటుంబం భావిస్తున్న‌ట్లు మ‌రో వార్త ప్ర‌చారంలో ఉంది. ఇప్పటికే రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ద్వారా మేకపాటి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్ప‌టివ‌ర‌కూ వైసీపీ అధిష్ఠానం నుంచి ఎటువంటి నిర్ణ‌య‌మూ తీసుకోలేదు. ఇదిలా ఉండ‌గా.. ఈ స్థానంపై బీజేపీ స్పందించింది.

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో త్వరలో జరిగే ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున అభ్యర్థిని నిలబెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కుటుంబ రాజ‌కీయాల‌కు దూరం అంటూ కడప జిల్లాలోని బద్వేల్ లో గ‌తేడాది అక్టోబ‌ర్ జ‌రిగిన ఉప ఎన్నికలో కూడా బీజేపీ పోటీ చేసింది. కానీ.. డిపాజిట్ కూడా ద‌క్కించుకోలేక‌పోయింది. ఇప్పుడు మ‌ళ్లీ ఆత్మ‌కూరులో పోటీకి సై అంటోంది. బ‌ద్వేలులో టీడీపీ, జ‌న‌సేన పోటీ నుంచి త‌ప్పుకున్నాయి. మేక‌పాటి కుటుంబానికే టికెట్ ఇస్తే పోటీ చేయ‌బోమ‌ని ఇప్ప‌టికే టీడీపీ ప్ర‌క‌టించింది. జ‌న‌సేన ఇప్ప‌టి వ‌ర‌కూ దీనిపై స్పందించ‌లేదు. మ‌రి మున్ముందు ఆత్మ‌కూరు ఉప ఎన్నిక చిత్రం ఎలా మార‌నుందో చూడాలి.

Show comments