Idream media
Idream media
ప్రభువు సరైన నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు సంతోషిస్తారు. నాయకుడిపై నమ్మకం ఉంటే క్యాడర్ జై కొడుతుంది. ముఖ్యమంత్రి ఏం చేసినా బాగుకోసమే అని మంత్రులు నమ్మితే ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తారు. ఏపీ సీఎం జగన్ పై ఆ నమ్మకం ఉంది కనుకనే ప్రజలు ఆశీర్వదిస్తున్నారు.నేతలు ఆయన ఆదేశాలను పాటిస్తున్నారు. అందుకు తాజా నిదర్శనమే మంత్రివర్గం రాజీనామా.
ఏ పార్టీ చూసినా పదవుల కోసం పాకులాడే నేతలు చాలా మందే కనిపిస్తారు. పదవి వచ్చాక ఐదేళ్ల పాటు కొనసాగాలని ఉవ్విళ్లూరుతారు. అందుకోసం ఎటువంటి దారిలోనైనా వెళ్తారు. అనుకున్నదానికి భిన్నంగా జరిగితే ఆందోళన వ్యక్తం చేస్తారు. నాయకత్వంపై ఆగ్రహం వెలిబుచ్చుతారు. బురదజల్లే ప్రయత్నం చేస్తారు. ఐదేళ్లలో కనీసం ఏడాది ముందు పదవి నుంచి తప్పించినా పార్టీ నాయకుడిపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలు రాజకీయాల్లో చాలామంది కనిపిస్తారు. కానీ ఏపీలో వైసీపీ నేతల కమిట్మెంట్ రాజకీయవర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. టీమ్ స్పిరిట్ నాయకత్వ బలాన్ని నిరూపిస్తోంది. అధినేత మాట విని, ఆయనను నమ్మి ఒకేసారి 24 మంది మంత్రులు రాజీనామా చేయడం ఆషామాషీ కాదు.
జగన్ ఆదేశాలను పాటిస్తూ మంత్రులు అందరూ రాజీనామా చేయడమే కాదు.. ఏ ఒక్కరు కూడా దానిపై అసహనం వ్యక్తం చేయలేదు. జగన్ నిర్ణయాన్ని, నాయకత్వాన్ని సమర్ధించారు. ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో రాజీనామాలు సమర్పించారు. తమ లీడర్ పై తమకున్న నమ్మకమే అందుకు కారణం. ఇప్పటివరకూ నమ్మినవారికి అండగా నిలిచిన జగన్ స్వభావం మరో కారణం. రాజీనామాల గురించి ప్రమాణస్వీకారం రోజే ప్రకటించడం కూడా జగన్ చేసిన ఇంకో సాహసం. మరో విషయం ఏంటంటే.. మాట ఇచ్చారంటే తప్పరని నేతల్లో జగన్ గుర్తింపు పొందారు. ఏ సందర్భంలో చెప్పినా.. ఆ సందర్భం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకుని మరీ ఆ వ్యక్తికి పదవి కట్టబెట్టిన ఘటనలు వైసీపీలో కోకొల్లలు. మారుమాట్లాడకుండా మంత్రులు అందరూ రాజీనామా చేయడంలో ఈ విషయం కూడా కీలక పాత్ర పోషించింది.
దీనిపై ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ మంత్రి పదవులపై నిర్ణయం పూర్తిగా ముఖ్యమంత్రిదేనని అన్నారు. ‘సీఎం జగన్ ఎటువంటి పనిచెప్పినా చేయడానికి నేను సిద్ధం. ప్రభుత్వంలోకి తీసుకుంటారా.. పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా అనేది సీఎం ఇష్టం. ఆయన మాటకు మేమంతా కట్టుబడి ఉంటాం. ఆయన చెప్పగానే 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. అది మా కమిట్మెంట్.’ అని పేర్కొన్నారు. ఆయనే కాదు.. ఇతర పార్టీల్లో కూడా వైసీపీ నేతల కమిట్మెంట్ చర్చనీయాంశంగా మారింది.