Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొమ్మారెడ్డి పట్టాభి హాట్ టాపిక్ గా మారారు. దుర్భాషలు మాట్లాడి రాష్ట్రంలోని ప్రశాంత వాతావరణంలో అలజడి సృష్టించారు. పట్టాభి మాత్రం తన మాటలను సమర్థించుకుంటున్నారు. లేని అర్థాలను ఆపాదిస్తున్నారని చెప్పుకుంటున్నారు. పట్టాభి దృష్టిలో అర్థాలు ఎలాగున్నా ఆ మాటలు సృష్టించిన మంటల ఫలితంగా ఆయనకు అరెస్టులు, జైలు, బెయిలు తప్పలేదు. అనంతరం కుటుంబంతో విహారానికి వెళ్లారు. బెయిలుపై వచ్చిన వెంటనే రాష్ట్రాన్ని వీడి వెళ్లడం కూడా చర్చనీయాంశంగా మారింది. అందుకు రకరకాల కారణాలు చక్కర్లు కొట్టాయి. దీనికి పట్టాభి వివరణ ఇచ్చుకున్నారు. జరిగిన సంఘటనలతో తన కుమార్తె భయపడిందని, ఆమె కోసం దూరంగా వచ్చాను అని చెప్పారు.
ఆ విషయం అలా ఉంచితే రాష్ట్రంలో టీడీపీ నిలదొక్కుకోవడం ప్రస్తుతం జీవన్మరణ సమస్యగా మారింది. అందుకోసం ఎటువంటి రాద్దాంతం అయినా చేసేందుకు సిద్ధపడుతోందని తాజా సమీకరణాలు తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి నుంచి ఆ పార్టీ నేత పట్టాభికి ప్రాణహాని పొంచి ఉందని చంద్రశేఖరరెడ్డి అన్నారు. రాజకీయ లబ్ధి కోసం పట్టాభి ప్రాణాలు తీసి, ఆ నేరాన్ని వైఎస్సార్ సీపీపై నెట్టి ప్రజల్లో సానుభూతి పొందాలనే కుట్రపూరితతత్వం చంద్రబాబుదని ఆరోపించారు. ఈ విషయంలో పట్టాభి కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు పార్టీ మనుగడ కోసం ఎంతకైనా దిగజారుతారని వ్యాఖ్యానించారు. ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్ కోరడంపై స్పందిస్తూ,ఒకప్పుడు అమిత్‌షా కాన్వాయ్ పై రాళ్ల దాడి చేయించిన చంద్రబాబు ఈవేళ ఆయన అపాయింట్‌మెంట్ కోరడానికి సిగ్గుండాలని అన్నారు.
మళ్లీ అరెస్టు తప్పదా?
సీఎం జగన్, డీజీపీ సవాంగ్ పై విమర్శలు చేసిన సమయంలో పట్టాభి నోట మరికొన్ని వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. పిత్తబరిగెలు ఏరుకునే వాళ్లంటూ పట్టాభి అదే ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలపై కూడా ఇప్పుడు వివాదం నడుస్తోంది.మత్స్యశాఖా మంత్రి అప్పలరాజు పట్టాభి పిత్తబరిగెల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.మత్స్యకారులని కించపరిచారంటూ మొన్న జనాగ్రహ దీక్షలో నిప్పులు చెరిగారు.ఇప్పుడు మత్స్యకారుల ఫిర్యాదులతో పోలీసులు కేసులు పెడుతున్నారు. ఇప్పుడు పిత్తబరిగెల వ్యాఖ్యలతో రాజుకున్న వివాదంలో ఫిర్యాదులు అందడంతో ఆయన అరెస్టు కోసం పోలీసులు రంగంలోకి దిగే అవకాశముంది. పిత్తబరిగెల వ్యాఖ్యలపై పట్టాభిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తే ముందుగా ఆయన ఇంటికి వెళ్లనున్నారు. అక్కడ కనిపించకపోతే మాత్రం గాలింపు చేపట్టే అవకాశముంది. వెంటనే దొరక్కపోతే పరారీలో ఉన్నట్లు ప్రకటించే అవకాశాలూ లేకపోలేదు. దీంతో టీడీపీ నేతలు కూడా అప్రమత్తమవుతున్నారు.
Also Read : Chandrababu May Lost Pattabhiram – బాబు ఇంకొకరిని వెతుక్కోవాల్సిందేనా..?