Uttarandra MLC- ఉత్తరాంధ్ర‌పై పదవుల జల్లు కురిపించిన జ‌గ‌న్

ఏపీలో వెనుక‌బ‌డిన ప్రాంతం ఉత్త‌రాంధ్ర వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక అభివృద్ధి బాట ప‌డుతోంది. మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న‌తో దేశం చూపు విశాఖ‌పై ప‌డింది. అయితే, సామాజికంగానే కాకుండా, రాజ‌కీయంగా కూడా ఉత్త‌రాంధ్ర‌కు త‌గిన ప్రాముఖ్య‌త ఇస్తున్నారు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్. ఇక్క‌డి మూడు జిల్లాలకు బాగా ప్రయారిటీ ఇస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ పదవుల కేటాయింపులో కూడా ఈ ప్రాంత నాయ‌కుల‌కు అవ‌కాశాలు క‌ల్పించారు. మొత్తం ప‌ద్నాలుగు ఎమ్మెల్సీలకు ఖాళీలు ఏర్పడితే ఇందులో నాలుగు పదవులు ఈ మూడు జిల్లాలకే కేటాయించారంటే ఈ ప్రాంతంపై జ‌గ‌న్ కు ఉన్న ప్రేమ‌ను అర్థం చేసుకోవ‌చ్చు.

ఇప్పటికే ఉత్త‌రాంధ్ర జిల్లాల నుంచి ఎమ్మెల్సీలు ఉన్నారు. గతంలో శ్రీకాకుళం జిల్లా తరఫున దువ్వాడ శ్రీనుకు పదవి ఇచ్చారు. ఇపుడు కూడా అదే జిల్లా నుంచి పాలవలస విక్రాంత్ కి పదవి దక్కింది. ఈయన తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన నేత. అలాగే, కొత్తవలసకు చెందిన ఇందుకూరి రఘురాజుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఈయన పారిశ్రామికవేత్తగా ఉన్నారు. క్షత్రియ సామాజికవర్గంలో బలం ఉంది. జగన్ విజయనగరం జిల్లా పాదయాత్ర సందర్భంగా ఆయన పార్టీలో చేరారు. ఆయన 2019 ఎన్నికల్లో ఎస్ కోట నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అయితే నాడు జగన్ న్యాయం చేస్తామని హామీ ఇచ్చి పార్టీ నిర్ణయించిన అభ్యర్ధిని గెలిపించాలని కోరారు. అక్కడ వైసీపీకి మంచి మెజారిటీ దక్కింది. దాంతో రఘురాజుకు ఇచ్చిన హామీ మేరకు జగన్ ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు.

అలాగే విశాఖ సిటీ ప్రెసిడెంట్ వంశీ క్రిష్ణ శ్రీనివాస్ కి ఎమ్మెల్సీ దక్కింది. ఆయన పదేళ్ళుగా వైసీపీలో ఉంటూ పోరాటం చేస్తున్నారు. జగన్ విశాఖ తొలిసారి వస్తే ఆయన ఇంట్లోనే బస చేశారు. నాటి నుంచి జగన్ తో సన్నిహిత బంధం ఏర్పడింది. ఆయనకు అధికార హోదా ఇవ్వాలని జగన్ కి ఉన్నా కూడా వివిధ రకాలైన సమీకరణలతో ఇప్పటిదాక కుదరలేదు. ఇపుడు ఆ అవకాశం వచ్చింది. విశాఖ సిటీ లో పెద్ద ఎత్తున యాదవులు ఉన్నారు. ఇక విశాఖ రూరల్ జిల్లా నుంచి మహిళా నేత వరుదు కళ్యాణికి ఎమ్మెల్సీ దక్కింది. ఆమె పోలినాటి వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు. ఆమె మొద‌టి నుంచీ పార్టీ విజయానికి కృషి చేశారన్న కారణంతోనే ఈ గౌరవం ఇచ్చారని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయంగా, సామాజికంగా అభివృద్ధికి దూరంగా ఉన్న ఉత్త‌రాంధ్ర‌కు జ‌గ‌న్ ప్రాధాన్యం ఇస్తుండ‌డంపై ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి.

Also Read :  MLC Elections, Sajjala, YCP Candidates – స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు… 11 మంది వైసీపీ అభ్యర్థులు వీరే..

Show comments