Idream media
Idream media
ఇటీవల ముగిసిన సౌతాఫ్రికా పర్యటనలో మొదటి టెస్టు గెలిచిన కోహ్లీసేన ఇప్పటివరకూ దక్షిణాఫ్రికాలో పర్యటించిన ఏ జట్టు సాధించలేని టెస్టు సిరీస్ విజయం సాధించగలదని అభిమానులు ఆశ పడ్డారు. అయితే, ఆ తర్వాత రెండు టెస్టులు దక్షిణాఫ్రికా గెలుచుకోవడంతో దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ మరోసారి భారత జట్టుకు అందకుండా పోయింది.
విదేశీ గడ్డ మీద కష్టాలు
ఏ క్రికెట్ జట్టుకైనా విదేశీ పర్యటనలో విజయం సాధించడం సొంతగడ్డ మీద గెలవడం కన్నా మంచి పేరు తెచ్చి పెడుతుంది. స్వదేశంలో జరిగే పోటీల్లో ఏ జట్టు అయినా తమకు అనుకూలంగా ఉండే పిచ్ లు తయారు చేయించి ఆడుతుంది. అలాగే స్టాండ్స్ లో ప్రేక్షకులు కూడా ప్రతి క్షణం తమ జట్టుకి అనుకూలంగా సందడి చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అంపైర్లు కూడా తమ స్వంత జట్టుకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు.
పాకిస్తాన్ లో పర్యటించే ఏ జట్టు అయినా పదకొండు మంది పాకిస్తాన్ ఆటగాళ్లు, ఇద్దరు అంపైర్లతో కలిపి పదమూడు మంది ఆటగాళ్లతో తలపడాలి అని అంటూ ఉంటారు క్రికెట్ విశ్లేషకులు. కొన్నిసార్లు ఆస్ట్రేలియా పర్యటనలో కూడా ప్రత్యర్థి ఆటగాళ్లు అంపైర్ల తప్పుడు నిర్ణయాలు ఎదుర్కొన్న సంఘటనలు ఉన్నాయి. వీటిలో అందరికి గుర్తు ఉండేది 1999 ఆస్ట్రేలియా పర్యటనలో, అడిలైడ్ లో జరిగిన మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ భుజానికి బంతి తగిలితే ఆస్ట్రేలియా అంపైర్ డారిల్ హార్పర్ సచిన్ ఎల్బీడబ్ల్యూ అయినట్లు ప్రకటించడం. అలాగే చాలా మంది క్రికెట్ అభిమానులకు బాగా గుర్తు ఉండేది 1981లో మెల్బోర్న్ లో జరిగిన మ్యాచ్ లో భారత కెప్టెన్, ఓపెనర్ సునీల్ గవాస్కర్ తనకు వ్యతిరేకంగా ఇచ్చిన ఎల్బీడబ్ల్యూ నిర్ణయం తప్పు అని భావించి తనతో పాటు మరో ఓపెనర్ చేతన్ చౌహాన్ తో కలిసి వాకౌట్ చేసిన దృశ్యం.
తటస్థ అంపైర్లు
అంపైర్లు తమ జట్టుకి అనుకూలంగా వ్యవహరిస్తారు అన్న భావం తొలగించడానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 1994 లో ఒక తటస్థ అంపైర్ ఉండాలని నిర్ణయించి, 2002లో ఇద్దరు తటస్థ అంపైర్లు ఉండాలని నిర్ణయం తీసుకుంది. దీనికి తోడు అంపైర్ల నిర్ణయాలలో మానవ తప్పిదాలు తగ్గించాలని నవంబర్ 1992లో టెలివిజన్ రీప్లే చూసి రనౌట్, స్టంపింగ్, నో బాల్ నిర్ణయాలు తీసుకోవడానికి థర్డ్ అంపైర్లని, ఎల్బీడబ్ల్యూ, క్యాచ్ లలో అంపైర్ నిర్ణయాన్ని సమీక్షించడానికి డెసిషన్ రివ్యూ సిస్టమ్ ని 2008లో ప్రవేశపెట్టింది.
పరాయిగడ్డ మీద గెలిస్తేనే మొనగాళ్లు
స్వంత పిచ్ ల మీద కన్నా విదేశీ పర్యటనలో గెలవడం కష్టం కాబట్టి 1948లో ఇంగ్లాండులో పర్యటించిన బ్రాడ్ మన్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టుకి Bradman’s Invincibles (అజేయులు) అన్న పేరు వచ్చింది. ఆ పర్యటనలో నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ 4-0 తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా జట్టు, 34 టూర్ మ్యాచ్ లలో 25 గెలిచి, తొమ్మిది డ్రా చేసుకుని ఒక్క ఓటమి కూడా లేకుండా ఆ టూర్ ముగించింది.
భారత జట్టు మొదటి విజయాలు
1932 లో ఇంగ్లాండులో భారత జట్టు తన మొదటి మ్యాచ్ ఆడింది. ఆ సిరీస్ లోని ఏకైక టెస్టు మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. తన మొదటి టెస్టు విజయం కోసం భారత జట్టు రెండు దశాబ్దాలు నిరీక్షించి, 1952లో విజయ్ హజారే నాయకత్వంలోని భారత జట్టు మద్రాసు (నేటి చెన్నై) లో ఇంగ్లాండ్ మీద సాధించింది. ఆ సిరీస్ లో మొదటి మ్యాచ్ ఇంగ్లాండు గెలవగా, అయిదవ మ్యాచ్ భారత జట్టు గెలిచింది. మధ్యలో మూడు మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి. అదే సంవత్సరం భారత పర్యటనకు వచ్చిన పాకిస్తాన్ జట్టు మీద 2-1 తేడాతో లాలా అమర్నాధ్ నాయకత్వంలోని భారత జట్టు తన మొదటి సిరీస్ విజయం సాధించింది.
1968లో M. A. K. పటౌడి నాయకత్వంలో న్యూజిలాండ్ లో పర్యటించిన భారత జట్టు డునెడిన్ లో ఫిబ్రవరి 15 న మొదలైన మొదటి టెస్టు మ్యాచ్ గెలవడం ద్వారా విదేశీ గడ్డ మీద తొలి టెస్టు మ్యాచ్ విజయం నమోదు చేసిన భారతజట్టు ఆ సిరీస్ 3-1 తేడాతో నెగ్గి విదేశీ గడ్డ మీద తొలి సిరీస్ విజయం కూడా సాధించింది.
1971లో అజిత్ వాడేకర్ నాయకత్వం లో వెెస్టిండీస్ లో పర్యటించిన భారత జట్టు అరివీర భయంకరులైన ఫాస్ట్ బౌలర్లు, అంతకుమించిన బ్యాట్స్ మెన్ ఉన్న ఆ జట్టుని 1-0 తేడాతో ఓడించింది. ఆ సిరీస్ లో ఆరంగేట్రం చేసిన సునీల్ గవాస్కర్ 774 పరుగులు సాధించి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. అదే సంవత్సరం వాడేకర్ నాయకత్వంలో ఇంగ్లాండు పర్యటనకు వెళ్లిన భారత జట్టు అక్కడ కూడా 1-0 తేడాతో ఇంగ్లాండు గడ్డ మీద తన మొదటి సిరీస్ విజయం నమోదు చేసింది.
శ్రీలంకలో 1993లో మహమ్మద్ అజారుద్దీన్ నాయకత్వంలో 1-0 తేడాతో, 2000 సంవత్సరంలో కొత్తగా టెస్టు హోదా పొందిన బంగ్లాదేశ్ లో సౌరవ్ గంగూలీ నాయకత్వంలో ఆడిన ఏకైక టెస్టు గెలిచి,1-0 తేడాతో ఆ జట్ల మీద వారి గడ్డ మీద సిరీస్ గెలిచింది భారత జట్టు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టు మీద ఆ దేశంలో టెస్టు సిరీస్ 2004లో గంగూలీ నాయకత్వంలో 1-0 తేడాతో గెలిచింది. ఈ సిరీస్ లోనే భారత ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ తన మొదటి ట్రిపుల్ సెంచరీ సాధించాడు. 2005లో గంగూలీ నాయకత్వంలోనే జింబాబ్వేలో ఆ జట్టు మీద సిరీస్ గెలిచింది భారత జట్టు.
ఎన్నిసార్లు పర్యటించినా ఆస్ట్రేలియా గడ్డమీద సిరీస్ విజయం సాధించలేకపోయిన భారత జట్టు 2019లో కోహ్లీ నాయకత్వంలో 2-1 తేడాతో ఆ దేశంలో సిరీస్ విజయం నమోదు చేసింది.
కొరకరాని కొయ్యగా మిగిలిన దక్షిణాఫ్రికా
అపార్థీడ్ పేరిట వర్ణవివక్ష అనుసరించిన దక్షిణాఫ్రికా దేశాన్ని అన్నిరకాల క్రీడలతో పాటు క్రికెట్ రంగం కూడా దాదాపు రెండు దశాబ్దాలు వెలివేసింది. అక్కడ పరిస్థితులు చక్కబడి, నెల్సన్ మండేలా అధికారంలోకి వచ్చాక క్రికెట్ ప్రపంచం దక్షిణాఫ్రికా జట్టుని ఆహ్వానించింది. ఆ జట్టు తమ మొదటి పర్యటన భారత దేశంలో చేసింది. భారత జట్టు మొదటిసారిగా 1992లో దక్షిణాఫ్రికాలో పర్యటించింది. నాలుగు టెస్టుల ఆ సిరీస్ 1-0 తేడాతో దక్షిణాఫ్రికా గెలుచుకుంది. ఆ తర్వాత ఎనిమిది సార్లు భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించినా సిరీస్ విజయం మాత్రం దక్కించుకోలేక పోయింది. 2010-11 లో ఆడిన మూడు మూడు మ్యాచ్ ల సిరీస్ ని 1-1 తో డ్రాగా ముగించడమే ఇప్పటివరకూ అక్కడ భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శన.
ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలించే దక్షిణాఫ్రికా పిచ్ ల మీద స్పిన్ బౌలింగ్ ని ప్రధాన ఆయుధంగా నమ్ముతూ వచ్చిన భారత జట్టు ఇంతకాలం సరిగా రాణించలేకపోయింది. అయితే ఇప్పుడు బుమ్రా, షమీ, సిరాజ్ లాంటి ఫాస్ట్ బౌలర్లు ఉన్న భారత జట్టు ఈసారి సిరీస్ విజయం సాధించగలదు అని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగినట్టుగా మొదటి మ్యాచ్ లో భారత జట్టు గెలవడం కూడా భారత జట్టు విజయం మీద ఆశలు పెంచింది. అయితే రెండో, మూడో మ్యాచ్ ల్లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో రాణించి 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.
దక్షిణాఫ్రికాలో తన మొదటి టెస్టు సిరీస్ విజయం సాధించడానికి భారత జట్టు మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.