Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ లోని బద్వేల్ ఉప ఎన్నిక నుంచి ఇప్పటికే టీడీపీ, జనసేన తప్పుకున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ మాత్రం పోటీకి సిద్ధమంటున్నాయి. కాంగ్రెస్ అయితే.. మాజీ ఎమ్మెల్యే కమలమ్మ ను నిలబెట్టడానికి సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కూడా పోటీ నుంచి తప్పుకోవడంతో మిగిలిన పార్టీలు కూడా బరిలో లేకపోతేనే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక వేళ.. అదే జరిగితే వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ అరుదైన రికార్డును సొంతం చేసుకుంటారు.
కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అని తెలిసినప్పటి నుంచీ.. అది మళ్లీ వైసీపీ సొంతమే అవుతుందని మెజార్టీ వర్గాలు నిర్ణయానికి వచ్చాయి. అయితే.. ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత పోటీకి సై అంటూ అన్ని పార్టీలూ ప్రకటనలు చేశాయి. అనూహ్యంగా జనసేనాని తాము పోటీ చేయట్లేదని ప్రకటించడం, ఆ వెంటనే అప్పటికే అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ కూడా.. వెనుకడుగు వేయడం తెలిసిందే. దీంతో అందరి దృష్టి ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పై పడింది.
ఒక్కసారి బద్వేల్ చరిత్ర పరిశీలిస్తే 1955లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. 2009లో ఇది ఎస్సీలకు రిజర్వ్ అయ్యింది. ఇప్పటి వరకు 15 సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ టీడీపీ ఎక్కువ సార్లు గెలిచాయి. వైసీపీ ఆవిర్భవించాక జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఆ పార్టీయే విజయం సాధించింది. దివంగత మాజీ ఎమ్మెల్యే బిజివేముల వీరారెడ్డి ఉండగా.. బద్వేల్ టీడీపీకి కంచుకోటగా ఉండేది. ఆయన ఏడు సార్లు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మరణాంతరం జరిగిన ఉప ఎన్నికలలో ఆయన కుమార్తె కునిరెడ్డి విజయమ్మ గెలిచారు. 2004లో ఆమె గోవింద్రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2001 ఉప ఎన్నిక తర్వాత ఇక్కడ టీడీపీ గెలవలేదు. ఇప్పుడు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. అంటే 2001లో జరిగిన ఉప ఎన్నిక తర్వాత మరో 20 ఏళ్లకు బద్వేల్లో ఉప ఎన్నిక జరుగుతుంది.
ఇప్పటికే వైసీపీ నుంచి మృతి చెందిన డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి సుధను జగన్ తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక జనసేన టీడీపీ ఇప్పటికే సాంప్రదాయాన్ని అనుసరించి తాము పోటీకి పెట్టడం లేదని ప్రకటించాయి. ఇక బీజేపీ కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థులను పోటీలో పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పేరు వినిపిస్తోంది. ప్రధాన పార్టీగా ఉన్న టీడీపీతో పాటు జనసేన పోటీ నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు వైసీపీ బీజేపీ కాంగ్రెస్లను సైతం ఇక్కడ పోటీ పెట్టకుండా ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. బద్వేలుకు చెందిన మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మైదుకూరు ఎమ్మెల్యే రాఘురామిరెడ్డి జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. ఒక వేళ బద్వేలు ఏకగ్రీవం అయితే రాష్ట్ర విభజన జరిగాక ఆళ్లగడ్డలో మాజీ మంత్రి అఖిలప్రియ తొలి ఏకగ్రీవ ఎమ్మల్యే కాగా.. రెండో ఎమ్మెల్యేగా సుధ రికార్డులకు ఎక్కుతారు.