బోండా ఉమా ఎందుకిలా మారారు..?

టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ దూకుడు రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన నేతల్లో చింతమనేని ప్రభాకర్, బోండా ఉమామహేశ్వరరావు మొదటి రెండు స్థానాల్లో ఉంటారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే కాదు.. ప్రతిపక్షంలోకి వచ్చిన ప్రారంభంలో కూడా వారిద్దరూ ఏ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా బోండా ఉమామహేశ్వరరావు టీడీపీ రాష్ట్ర స్థాయి నేతగా చెలామణి అయ్యారు. టీడీపీ వ్యవహారాల్లో కృష్ణా జిల్లా ఆవల కూడా జోక్యం చేసుకున్నారు. మున్సిపల్‌ ఎన్నికల సమయలో గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలో హల్‌చల్‌ చేశారు. వైఎస్‌ జగన్‌పైన, వైసీపీ ప్రభుత్వంపైనా అంశాల వారీగా విమర్శలు, ఆరోపణలు చేశారు.

ఇదంతా గతం. ఇప్పుడు బోండా ఉమా పూర్తిగా సైలెంట్‌ అయ్యారు. మొన్నటి వరకు వైఎస్‌ జగన్‌ సర్కార్‌పై ఒంటికాలిపై లేస్తూ.. టీడీపీ ఆఫీసులో ప్రెస్‌మీట్లు పెట్టిన బోండా ఉమా.. ఇప్పుడు కేవలం తన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. నియోజకవర్గ అంశాలపై స్పందిస్తూ.. ఎమ్మెల్యే మల్లాది విష్ణును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. తాజాగా మల్లాదిపై బోండా చేసిన విమర్శలు ఆయన భవిష్యత్‌ రాజకీయాలను తెలియజేస్తున్నాయి. మల్లాది విష్ణు ఒత్తిడితో పోలీసులు కాపు నేతలను వేధిస్తున్నారంటూ ఆరోపించారు. వంగవీటి రంగా పేరుతో కాపు కల్యాణమండపాన్ని టీడీపీ ప్రభుత్వం మంజూరు చేస్తే.. రద్దు చేయించారని, ఆయన డ్రైవర్‌గా వెలుగులోకి వచ్చిన విష్ణు తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నారంటూ వంగవీటి మోహనరంగా అభిమానులను తనవైపు చూసేలా మాట్లాడారు. ఈ తరహా రాజకీయాల ద్వారా నియోజకవర్గంలో పట్టుజారకుండా బోండా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

కాలగమనంలో బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయంటారు. బోండా ఉమాను చూస్తే అది నిజమనిపిస్తోంది. టీడీపీ ప్రభుత్వ హాయంలో ప్రముఖ కాపు నేతల్లో ఒకరుగా ఓ వెలుగు వెలిగారు. కోడాలి నానిపై అసెంబ్లీలో తిట్ల పురాణం అందుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నోళ్లలో నానారు. దూకుడు రాజకీయాలు చేస్తూ కాపు సామాజికవర్గం కోటాలో మంత్రి పదవిని ఆశించారు. మంత్రివర్గ పునర్వవస్థికరణలో బెర్త్‌ ఆశించినా.. దక్కకపోవడంతో కొన్నాళ్లు అలకపాన్పు ఎక్కారు. మళ్లీ కొద్ది కాలానికి యాక్టివ్‌ అయ్యారు. పార్టీ ప్రతిపక్షంలోకి చేరిన సమయంలోనూ దూకుడుగా వ్యవహరించి రాష్ట్ర స్థాయి నేతగా మారాలని యత్నించిన బోండా ఉమాకు ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అవుతున్నట్లుగా ఉంది. పదవి లేకపోతే వచ్చేనష్టం, పోయిన పదవి మళ్లీ దక్కడం అంటే ఎంత కష్టమో బోధపడినట్లుగా ఉంది. అందుకే తన అధినేత చంద్రబాబు చెప్పిన బాటలో కాకుండా.. నియోజకవర్గ బాటను ఎంచుకున్నట్లున్నారు.

Also Read : లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్న వైఎస్‌ జగన్‌

Show comments