Punjab elections – పంజాబ్ కింగ్ ఎవరో..?

పంజాబ్‌..పేరుకు తగ్గట్లే ఈసారి అక్కడ ఎన్నికలు ‘పంచ్’ముఖ పోటీగా మారాయి.ఆప్ రూపంలో అధికార కాంగ్రెస్‌ గండాన్ని ఎదుర్కొంటోంది.ఇంకోవైపు తన పాత పార్టీని దెబ్బకొట్టేందుకు కెప్టెన్ కాసుకు కూర్చున్నాడు. ప్రస్తుత పరిస్థితులు ఎవరికి అనుకూలం, ఎవరిని దెబ్బ తీస్తాయని ప్రధాన రాజకీయ పక్షాలు అంకగణితంతో కుస్తీ పడుతున్నాయి.

ఇక కాంగ్రెస్‌కి కొరకరాని కొయ్యగా తయారైన సిద్ధూతో హస్తం పార్టీ తంటాలు పడుతోంది. బీఎస్పీతో కలిసి అకాలీదళ్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.సాగు చట్టాల రద్దుతో కొత్తగా కలిసొచ్చిన మిత్రుడు అమరీందర్‌తో తన ఉనికి చాటాలని బీజేపీ తాపత్రయపడుతోంది.

కాంగ్రెస్‌ ఆశలన్నీ దళిత ఓట్లపైనే

పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు పాలక కాంగ్రెస్‌కి జీవన్మరణ సమస్యగా తయారయ్యాయి.మూడు ముక్కలాట లాగా తయారైన కాంగ్రెస్ నుండి కెప్టెన్ అమరీందర్ నిష్క్రమణ తర్వాత తమ ఆశలన్నీ పంజాబ్‌ జనాభాలో 32శాతం ఉన్న దళితులపైనే పెట్టుకుంది.అసెంబ్లీ ఎన్నికలను పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్‌ కెప్టెన్ స్థానంలో మరో జాట్‌ సిక్కు నేత, పీసీసీ చీఫ్ సిద్దూకి అవకాశం ఇవ్వలేదు.దళిత నాయకుడైన చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చో పెట్టింది.ఇప్పటికే రాష్ట్ర జనాభాలో 20 శాతమే ఉన్న జాట్‌ సిక్కుల నుంచి 13 మంది సీఎం పగ్గాలు చేపట్టారు. తొలిసారి ఓ దళితుడిని సీఎంగా చేసి కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే పావులు కదిపింది.

మరోవైపు ఎన్నికలు సమీపించే లోపు పాలనలో తమదైన మార్కు సాధించి ఎన్నికల్లో గట్టెక్కాలని హస్తం పార్టీ భావిస్తోంది.ప్రత్యర్థి పార్టీలు చన్నీ తాత్కాలిక ముఖ్యమంత్రి అని చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు తమ సీఎం క్యాండెట్‌గా చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీయే అని ప్రకటించడానికి కాంగ్రెస్ సిద్ధపడుతోంది.ఇదే ఇప్పుడు పంజాబ్‌ కాంగ్రెస్‌లో సిద్ధూ రూపంలో మరోసారి అసమ్మతి కుంపటిని రాజేస్తోంది.సిద్ధాంతాలు,పార్టీ ప్రయోజనం కంటే తాను సీఎం కావడమే ఏకైక లక్ష్యం అన్నట్లు సిద్దూ వ్యవహార శైలి చెప్పకనే చెబుతుంది. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉండి కూడా సొంత పార్టీ సీఎంపై విమర్శల బాణాలు సంధిస్తున్నాడు.సిద్దూ వ్యవహారం కెప్టెన్‌ని కాదని భుజాలకు ఎత్తుకున్న కాంగ్రెస్ అధినాయకత్వానికి శిరోభారంగా తయారైంది.ఎన్నికల్లో పీసీసీ చీఫ్ సిద్దూ, సీఎం చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీకి ఏమి సహకరిస్తాడు అన్నదే హస్తం శ్రేణులను ప్రస్తుతం కలవరపెడుతోంది.

Also Read : Bjp, Yogi – యోగి ఓకే.. బీజేపీ నాట్ ఓకే! -యూపీ ఓటర్ల తాజా మనోగతం

సై అంటున్న కేజ్రీవాల్

ఆమ్‌ఆద్మీ పార్టీకి ఢిల్లీ తర్వాత చట్ట సభల ప్రాతినిధ్యం లభించింది ఒక్క పంజాబ్‌లో మాత్రమే.ఎలాగైనా పంజాబ్‌లో పట్టు సాధించాలని ఆప్ ఉవ్విళ్లూరుతోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాలలో నాలుగు ఎంపీ స్థానాలు గెలిచి ఆప్ సంచలనం సృష్టించింది. కానీ 2017 అసెంబ్లీ ఎన్నికలలో సత్తా చాటుతుందనుకున్న ఆమ్‌ఆద్మీ పార్టీ 20 స్థానాలకే పరిమితమైంది.అయితే స్థానిక ప్రాంతీయ పార్టీ అయిన అకాలీదళ్‌ని వెనక్కినెట్టి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది.కాగా అందులో 18 స్థానాలు మాల్వా ప్రాంతంలోనే దక్కించుకుంది.ఇక 2019 సాధారణ ఎన్నికలలో కేవలం ఒక ఎంపీ స్థానానికి మాత్రమే ఆప్ పరిమితమైంది.

గత కొంత కాలంగా ఆప్ పంజాబ్‌లో పుంజుకొని ప్రధాన రాజకీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించి అందరికంటే ముందుగా కేజ్రీవాల్ ఇక్కడ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు మఝా, మాల్వా, దోబాలలో ఆయన పర్యటిస్తూ తన పార్టీని వ్యాపారవేత్తలు మరియు రైతులకు చేరువ చేసేందుకు కృషి చేస్తున్నారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు వెయ్యి రూపాయల ఆర్థిక తోడ్పాటు అందిస్తామనే హామీతో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నాడు.

రైతులు,మధ్యతరగతి ప్రజలను ఆకర్షించేందుకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీతో పాటు అందరికీ ఉచిత వైద్యం వంటి ఆకర్షణీయ వాగ్దానాలు ఎడాపెడా ఢిల్లీ సీఎం కురిపిస్తున్నాడు. అయితే స్థానికంగా బలమైన నాయకత్వం లేకపోవడం ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు పార్టీకి దూరం కావడం ఆప్ ఉత్సాహానికి ప్రధాన అడ్డంకిగా మారింది.

బీఎస్పీతో అకాలీదళ్‌కు ఓట్ల పంట పండేనా

బీజేపీతో ఉన్న చిరకాల మైత్రిని వదులుకొన్న అకాలీదళ్ బీఎస్పీతో పొత్తు రాజకీయం నెరపుతోంది. ఇక్కడ బీఎస్పీకి సంస్థాగతంగా పెద్దగా బలం లేకపోయిన దళితుల్లోని రామ్‌దాసియా వర్గంలో కొంత ఆదరణ ఉంది. మోడీ ప్రభుత్వం తెచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా కమలానికి కటీఫ్ చెప్పినా కూడా రైతుల్లో ఆ పార్టీ పరపతి పెరగలేదు. అధికారంలో ఉన్నప్పుడు వెలుగుచూసిన డ్రగ్స్ సరఫరా కేసులు ఇప్పటికీ అకాలీదళ్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.ఆ పార్టీ పట్ల మధ్యతరగతి ముఖ్యంగా మహిళలలో వ్యతిరేక భావన ఇప్పటికీ తగ్గకపోవడం వలన ఎన్నికలలో అకాలీల ఆకాంక్షలు ఏమేరా నెరవేరుతాయన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే.

Also Read : Bjp.Modi – గెలుపు కోసం ప్రయాస.. మోడీ లక్ష్యం చేరేనా..?

సాధారణంగా పంజాబ్‌లో దళిత సంప్రదాయ ఓటుబ్యాంకు కాంగ్రెస్‌ వెనకే పోలరైజేషన్ అవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాష్ట్రంలోని ఎస్సీ నియోజకవర్గాలు గణనీయ సంఖ్యలో కాంగ్రెస్‌ ఖాతాలో పడ్డాయి.దీంతో రాష్ట్ర జనాభాలో 10శాతానికి ప్రాతినిథ్యం వహిస్తున్న రామ్‌దాసియా వర్గానికి చెందిన చన్నీయే ముఖ్యమంత్రి కావడం అకాలీదళ్‌- బీఎస్పీ కూటమి ఆశలకు గండి పడినట్లే.ఈ నేపథ్యంలో అకాలీదళ్ బీఎస్పీతో కలవడం వలన పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.

2017 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠం కోల్పోయిన అకాలీదళ్ క్రమేణా బలహీన పడుతూ వచ్చింది.కానీ ప్రభుత్వ వ్యతిరేకత,రైతాంగ పోరాటానికి మద్దతు, దళిత ఓట్లపై ఆధారపడి ఎన్నికల బరిలో పోరాడాలని అకాలీదళ్ భావిస్తోంది.

కమలం వైపు కెప్టెన్ అడుగులు

పంజాబ్‌పై పెద్దగా ఆశలు లేని బీజేపీ వైపు మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ చూస్తున్నారు. పైగా తనను అవమానించిందని అమరీందర్ కాంగ్రెస్‌పై కత్తి కట్టారు.ప్రస్తుత పరిస్థితులలో కింగ్ కాలేనని గుర్తించిన అమరీందర్ కింగ్ మేకర్ కావాలని కలలు కంటున్నాడు. బీజేపీతోపాటు అకాలీదళ్‌లోని ధిండ్సా, బ్రహ్మపుర లాంటి చీలికవర్గాలతో కూడా పొత్తులు పెట్టుకునే దిశగా ఆయన సమాలోచనలు చేస్తున్నారు.కెప్టెన్ ఎత్తుగడలు ఎన్నికలలో ఎవరి విజయావకాశాలని దెబ్బ తీస్తాయనే అంశాలపైన ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతుంది.

బరిలో బాప్‌

రైతు సంఘాల మద్దతుతో భారతీయ ఆర్థిక పార్టీ (బాప్‌) బరిలోకి దిగాలని ఉరకలేస్తోంది. ఇప్పటికే బాప్‌ భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) అండదండలు పొందడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఒకవేళ రైతు సంఘాల మద్దతు పొందితే భారతీయ ఆర్థిక పార్టీ కూటమి రైతాంగ రాష్ట్రంలో బలమైన పక్షంగా మారే ఛాన్స్ కొట్టిపారేయలేం.ఓట్ల చీలికలో బాప్‌ తన వంతు పాత్ర పోషించే అవకాశం ఉంది.

కాగా పార్టీల ఎత్తుగడలు,అంచనాలు ఎలా ఉన్న పంజాబ్‌లో ఈసారి హోరాహోరి పోరు తప్పదని సర్వేలు తేల్చేశాయి.

Also Read : AAP, Punjab Elections – ఊడ్చేయనుందా..? నాలుగు రాష్ట్రాల్లో పుంజుకుంటున్న ఆప్‌..!

Show comments