Idream media
Idream media
ఆర్టీసీ బస్సు ఎక్కితే, రష్‌లో నలిగిపోయి మసాలా దోసె అయిపోతారు కాబట్టి , రాపిడో బైక్ బుక్ చేసుకుని హాయిగా వెళ్లండని అల్లు అర్జున్ చెప్పాడు. దీనికి తెలంగాణ ఆర్టీసీ నోటీసులిచ్చింది. ఎవడో రాసిన స్క్రిప్ట్ చదివిన అల్లు అర్జున్‌కి ఆర్టీసీ గురించి ఏం తెలుసు? ఆయనకి బస్సు అవసరం వచ్చి ఉండదు. సామాన్యులకి, పేదవాళ్లకి ఆర్టీసీ చేసిన సేవ బన్నీకి తెలిసే అవకాశమే లేదు. ఎర్ర బస్సులో ఎక్కే వాళ్లంతా మూర్ఖులని, అమాయకులని, అజ్ఞానులని సినిమా వాళ్ల నమ్మకం. చాలా సినిమాల్లో ఎర్ర బస్సు ఎక్కొచ్చావా? అనే డైలాగ్‌లు కూడా వున్నాయి.
ఆర్టీసీ రాక ముందు అనుభవించిన నరకం, వచ్చిన తర్వాత సౌకర్యం మా జనరేషన్ వాళ్లకే తెలుసు.
నాకు ఊహ వచ్చే నాటికి (1969) అన్నీ ప్రైవేట్ బస్సులే. ప్రతి దీపావళికి నోముల కోసం రాయదుర్గం నుంచి చీమలవాగుపల్లెకి వెళ్లే వాళ్లం. 160 కిలోమీటర్ల దూరాన్ని 9 గంటలు ప్రయాణం చేసేవాళ్లం. తెల్లారుజామున 5 గంటలకు రాయదుర్గంలో బస్సు ఎక్కితే ప్రతి పల్లెలో ఆగుతూ 40 కి.మీ. కళ్యాణదుర్గం చేరడానికి 2 గంటలు. అక్కడ టిఫెన్‌కి అరగంట. అక్కడి నుంచి 50 కిలోమీటర్ల అనంతపురానికి రెండున్నర గంటలు.
ఉదయం 10 గంటలకి అనంతపురం చేరితే అక్కడ తాడిపత్రి బస్సు ఎక్కాలి. బస్టాండ్‌లో బస్సు వుంటుంది. కానీ జనం నిండితేనే కదులుతుంది. 10.30కి కదిలితే 50 కి.మీ. తాడిపత్రికి 2 గంటల జర్నీ. మధ్యలో ముచ్చుకోటలో టీ స్టాఫింగ్. ఒంటిగంటకి తాడిపత్రి చేరితే , అక్కడ అదృష్టం బాగుండి అరగంటలో బస్సు దొరికితే 15 కి.మీ. ప్రయాణానికి దాదాపు గంట. కళ్ల ముందు నరకం కనిపించేది.
1975 తర్వాత ఎర్రబస్సు కనపడింది. అన్నీ మారిపోయాయి. ప్రయాణంలో వేగం పెరిగింది. పల్లెలు అభివృద్ధి చెందడానికి ఆర్టీసీ బస్సులే కారణం. అంతకు ముందు లాభాలు లేని రూట్లలో ప్రైవేట్ బస్సులు సరిగా తిరిగేవి కావు. ఆర్టీసీకి లాభం కంటే సేవే ముఖ్యం. ఎర్ర బస్సు వల్ల పల్లె ప్రజలకి సకాలంలో వైద్యం అందింది. అంతకు ముందు పేద పిల్లలు హైస్కూల్‌తోనే చదువు మానేసేవాళ్లు. ఎందుకంటే కాలేజీ చదవాలంటే తాడిపత్రిలోనో , అనంతపురంలోనో రూం తీసుకుని చదవాలి. ఎప్పుడైతే మారుమూల పల్లెలకి బస్సు వచ్చిందో వాళ్ల చదువు కూడా ముందుకు పోయింది. రెగ్యులర్‌గా అదే రూట్‌లో వచ్చే కండక్టర్ , డ్రైవర్లు ఆ పల్లె ప్రజలకి ఇంటి మనుషులు అయిపోయారు. అత్యవసరమైన మందులు, సరుకులు వాళ్లతో తెప్పించుకునేవాళ్లు. ఆర్టీసీ అంటే పేదలకి సామాన్యులకి అనుబంధం, భారం కాదు.
అల్లు అర్జున్‌లా అందరూ నోట్లో వెండి స్పూన్‌తో పుట్టలేదు. కష్టాలు, కన్నీళ్లు, సంబరాలు, పండగలు, సంతోషాలు, స్నేహాలు, ప్రేమలు, వివాహాలు, పెళ్లిళ్లు, ప్రసవాలు అన్నీ ఎర్ర బస్సుతో ముడిపడి ఉన్నాయి. మా జీవితాల్లోని అనేక చాప్టర్లలో ఎర్ర బస్సే ప్రధాన పాత్రదారి.
Also Read : Sajjanar,Allu Arjun -అల్లు అర్జున్ కు సజ్జనార్ నోటీస్