Vijayanand Movie విజయానంద్ రిపోర్ట్

బయోపిక్కుల ట్రెండ్ లో ఇవాళ మరో రియల్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కెజిఎఫ్ నుంచి శాండల్ వుడ్ స్టాండర్డ్ అమాంతంగా పెరిగిపోవడంతో అక్కడి నిర్మాతలు బడ్జెట్ తో సంబంధం లేకుండా క్వాలిటీ కథలను తెరకెక్కిచ్చేందుకు పోటీ పడుతున్నారు. ఇటీవలే కాంతార ఇచ్చిన బ్లాక్ బస్టర్ కిక్ మాములుగా లేకపోవడంతో ప్రొడక్షన్ వాల్యూస్ ని ఘనంగా పాటిస్తున్నారు. అందులో భాగంగా వచ్చిందే విజయానంద్. కర్ణాటకలో విఆర్ఎల్ గా ప్రసిద్ధి చెందిన ట్రాన్స్ పోర్ట్ కంపెనీ విజయానంద్ జీవిత కథ ఇది. ప్రమోషన్ల విషయంలో పెద్దగా శ్రద్ధ తీసుకోకపోవడంతో ఇదొచ్చిందన్న విషయం పెద్దగా తెలియకుండా పోయింది. సినిమా ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం

విజయ్ సంకేశ్వర్(నిహాల్)ఉన్నత లక్ష్యాలు కలిగిన యువకుడు. తండ్రి(అనంత్ నాగ్)నడిపే ప్రింటింగ్ ప్రెస్ లో పని చేస్తున్నా మనసు మాత్రం ఏదో గొప్పగా సాధించాలని తాపత్రయపడుతూ ఉంటుంది. ఇతని సలహాల వల్లే బిజినెస్ లో పెరుగుదల వచ్చి అమాంతం లాభాలు పెరుగుతాయి. పెళ్లి చేసుకున్నాక విజయ్ కు రవాణా రంగంలో అడుగుపెట్టాలన్న సంకల్పం మొదలువుతుంది. నాన్న వ్యతిరేకించినా ఒక లారీ కొనుక్కుని తన ప్రయాణం మొదలుపెడతాడు. ఎన్నో అవాంతరాలు వస్తాయి. 5 వేల ట్రక్కులకు ఓనరవుతాడు. పత్రిక మొదలుపెట్టి అందులోనూ నెంబర్ వన్ అవుతాడు. అడ్డంకులు వచ్చినప్పుడు కొడుకు ఆనంద్ సంకేశ్వర్(భరత్) అండగా నిలబడి తమ సామ్రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడనేదే స్టోరీ

మనకు బొత్తిగా పరిచయం లేని వ్యక్తి కావడంతో తెరమీద జరుగుతున్న విజయానంద్ జీవితం ఒక సినిమాలాగే నడిచిపోతుంది. పలు ఆసక్తికరమైన సంఘటనలు మలుపులు ఉన్నా నెరేషన్ మరీ నెమ్మదిగా ఉండటంతో సెకండ్ హాఫ్ ని ఓపిగ్గా చూడాల్సి వస్తుంది. డ్రామా కమర్షియల్ ఫార్మాట్ లో లేకపోవడం మరో మైనస్. డైలాగులు బాగా కుదిరినప్పటికీ తగిన మోతాదులో నాటకీయతను పండించడంతో దర్శకురాలు రిషికా శర్మ కొంత తడబడ్డారు. పైగా కథనం సీరియస్ గా రాసుకోవడంతో ఎంటర్ టైన్మెంట్ జీరో అయ్యింది. పూర్తి వాస్తవాలను ప్రెజెంట్ చేయలేకపోయారు. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ బాగా కుదిరింది. బయోపిక్స్ మీద విపరీతమైన ఆసక్తి ఉంటే తప్ప ఈ విజయానంద్ ఎక్కువ అంచనాలు పెట్టుకుంటే యావరేజే అనిపిస్తాడు

Show comments