Idream media
Idream media
అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఉత్తరాంధ్రవాసులు మరిచిపోలేని రోజు.
“దక్షిణాఫ్రికా మాదిరిగా మనం కూడా మూడు రాజధానులు పెట్టుకోవచ్చు. పాలనా రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు, లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతి ఉండొచ్చు” అని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించింది ఆరోజే. ఆ ప్రకటన కేవలం ఇరవై తొమ్మిది గ్రామాలకు ఇబ్బందికరంగా మారినా రాష్ట్ర మంతా కొత్త ఆశలు చిగురించాయి. ప్రధానంగా దశాబ్దాల తరబడి అభివృద్ధికి నోచుకోని ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఉత్సాహాన్ని ఇచ్చింది. పనుల కోసం ఏళ్ల తరబడి సుదీర్ఘ దూరంలో ఉన్న రాజధానులకు తరలిపోయే ఆ ప్రాంత వాసులు తమ విశాఖకే రాజధాని వస్తుందన్న ఆశతో సంబరాలు చేసుకున్నారు.
జగన్ ప్రకటించినట్లుగానే మూడు రాజధానుల వైపు వడివడిగా అడుగులు వేశారు. 2020, జనవరి 20న శాసనసభలో ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల అభివృద్ధి బిల్లు, ఆమోదముద్ర పడింది. విశాఖ, కర్నూలు, అమరావతి మూడు చోట్ల రాజధానులను వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. 2020, జనవరి 22న అసెంబ్లీ ఆమోదించిన బిల్లును సెలక్ట్ కమిటీకి పంపుతూ శాసనమండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. 2020, జూన్ 16న పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు రెండవసారి శాసనసభలో ఆమోదం పడింది. అలాగే 2020 జూలై 31న పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. దీంతో హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి చెందుతుందని రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
మూడు రాజధానుల ప్రక్రియ సాగుతుండగా.. రాజకీయ దురుద్దేశంతో కొందరు, అవగాహనలోపంతో ఇంకొందరు, నచ్చక మరికొందరు.. ఇలా సుమారు 93 పిటిషన్లు దాఖలు అయ్యాయి. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలు, నోటిఫికేషన్లు చెల్లవంటూ కోర్టులో పిటిషన్లు దాఖలు కాగా.. ప్రభుత్వ నిర్ణయాలు, కమిటీల నివేదికలు రాజ్యాంగ విరుద్దమంటూ హైకోర్టులో రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామారావు బృందం పిటిషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, మన్నవ సుబ్బారావు, లంకా దినకర్, మరికొంతమంది వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ఈ పిటిషన్లు అడ్డుతగులుతూ వచ్చాయి. బిల్లులోని కొన్ని లోపాల కారణంగానే అడ్డంకులు వస్తున్నట్లు భావించిన జగన్ సర్కారు బిల్లులను ఉప సంహరించుకుంది.
Also Read : Three Capitals Bill – మూడు రాజధానులపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం
బిల్లుల ఉపసంహరణతో ఉత్తరాంధ్రలో నిరుత్సాహం ఏర్పడింది. విశాఖ రాజధాని కాకుండా పోతుందా అనే భయంతో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. సాగర నగరం విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించాలంటూ ఈ ప్రాంత ప్రజలు ప్రదర్శనలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. పరిపాలన రాజధానిగా బదలాయించడానికి విశాఖపట్నానికి అన్ని రకాలుగా అర్హతలు ఉన్నాయని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ ప్రాంత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే వాస్తవాలను గమనిస్తే అన్ని ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం కట్టుబడిందని అర్థం చేసుకోవచ్చు. వివిధ కారణాలతో దీన్ని ఉపసంహరించుకుంటున్నామని, మళ్లీ సమగ్రమైన, మరింత మెరుగైన బిల్లును తీసుకుని వస్తామంటూ వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. విస్తృత, విశాల మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధి వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రజాప్రయోజనాల కోసం మరో బిల్లును తీసుకొస్తామని స్పష్టం చేశారు.
దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఉత్తరాంధ్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. త్వరలోనే మరింత మెరుగైన బిల్లు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బిల్లుల ఉపసంహరణ సందర్భంగా జగన్ ప్రసంగాన్ని పరిశీలిస్తే.. అమరావతి, విశాఖపై కూడా సమ ప్రాధాన్యం, సమ లక్ష్యం ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటికే విశాఖను పరిపాలన రాజధానిగా బదలాయించాలనే తమ ఆకాంక్షలను తెలియజేయడానికి ఉత్తరాంధ్ర ప్రజలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖలో భారీ ర్యాలీని నిర్వహించడానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మరి ఏం జరగనుందో మున్ముందు చూడాలి.