Idream media
Idream media
మేం అధికారంలోకి వస్తే.. విద్యుత్ ఫ్రీ.. రేషన్ ఫ్రీ.. అంతేకాదండోయ్.. నెలకు కిలో నెయ్యి కూడా ఇస్తాం.. ఇదీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా అక్కడి ప్రధాన పార్టీలు ఓటర్లకు ఇస్తున్న బంపర్ ఆఫర్లు. భారతీయ జనతా పార్టీ, సమాజ్ వాదీ పార్టీ ప్రచారంలో పోటీ పడుతుండడమే కాదు.. పోటాపోటీగా హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఆయా పార్టీ నేతల తాజా ప్రకటనలు చూస్తే వారెవ్వా.. ఆఫర్లే ఆఫర్లు అనుకోక మానరు.
యూపీ మళ్లీ బీజేపీదే అని సర్వేలన్నీ చెబుతున్నప్పటికీ.. పశ్చిమ బెంగాల్ తరహా తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, ఎస్పీ ఎందులోనూ తగ్గడం లేదు. హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. తాజాగా దిబియాపూర్ లో ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షా రైతులకు హామీల వర్షం కురిపించారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలిచిన వెంటనే రానున్న ఐదేళ్ళపాటు రైతులు విద్యుత్తు బిల్లులను చెల్లించవలసిన అవసరం ఉండదని ప్రకటించారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో సైకిల్ స్పీడ్ పెంచుతోంది. బీజేపీనే లక్ష్యంగా ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ విమర్శలతో విరుచుకుపడుతునే హామీల వాన కురిపిస్తున్నారు. రాయబరేలిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన తాము అధికారంలోకి రాగానే ఐదేళ్ల పాటు నెలనెలా ఉచితంగా రేషన్, కిలో నెయ్యి ఇస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం సొంత ఉచిత రేషన్ స్కీమ్‌కు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధం చేసిందని అఖిలేష్ ఆరోపించారు. ఇక యూపీలో 11 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఆ పోస్టులను అధికారంలోకి రాగానే భర్తీ చేస్తామని అఖిలేష్ చెప్పారు.
ఇలా బీజేపీ, ఎస్పీ ఎందులోనూ తగ్గకుండా ఓటర్లను ఆకట్టుకోవడానికి పోటీ పడుతున్నాయి. మరి ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి.