Idream media
Idream media
రాజకీయాలకు ఏది అనర్హం కాదని నిరూపించాయి యూపీ రాజకీయ పక్షాలు.ఓ ప్రైవేట్ కార్యక్రమాన్ని సైతం తమ ఓట్ బ్యాంక్ రాజకీయానికి నిస్సిగ్గుగా వాడేశాయి. రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓ ఫోటో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల మధ్య ట్విట్టర్ వార్‌కు దారి తీసింది. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఒకే సోఫాలో కూర్చున్నట్లు కనిపిస్తున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
యూపీలో సమాజ్‌వాదీ పార్టీ వెనక పోలారైజ్ అయిన ముస్లీం ఓట్లను కొల్లగొట్టేందుకు ఆ పార్టీ యొక్క ముస్లీం- యాదవ్ (MY) ఫార్ములాకు ముందుగా గండి కొట్టాల్సి ఉంది. దీంతో పూర్వవైభవం కోసం ఆరాటపడుతున్న యూపీ కాంగ్రెస్, కేంద్రమంత్రి షేర్ చేసిన ప్రైవేటు ఫంక్షన్ ఫోటోను తన రాజకీయ అస్త్రంగా మలుచుకోంది. సోమవారం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి మనవరాలు వివాహ రిసెప్షన్‌లో ఎస్పీ అగ్రనేత ములాయం సింగ్, మోహన్ భగవత్‌లు కలిశారు.ఇరువురికీ సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తాజాగా ట్రెండింగ్ అయింది.
ఇక కేంద్రమంత్రి అర్జున్ మేఘ్వాల్ ట్వీట్ చేసిన ఫోటో ట్రాక్‌ను పొందిన యూపీ కాంగ్రెస్ సమాజ్‌వాదీని ఇరుకున పెట్టే పనిలో పడింది. ట్విట్టర్ వేదికగా ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ “నూతన SP (సపా)లో స అంటే సంఘవాద్‌గా ఉందా?” అనే అర్థంతో హిందీలోని తన పోస్ట్‌లో ప్రశ్నించింది. మధ్యలో నేనున్నానంటూ ఈ వివాదంలో అధికార బీజేపీ తల తలదూర్చి ఎస్పీపై ఓ రాయి విసిరింది.అదే ఫొటోను షేర్ చేసి‘‘ఓ చిత్రం చాలా చెబుతుంది” అని బీజేపీ యూపీ శాఖ పేర్కొంది. దీంతో ముస్లీం ఓటింగ్ నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీకి వైరల్‌గా మారిన ఫోటో ఇబ్బందికరంగా తయారైంది.
తొలుత ఫోటో అంశాన్ని పెద్దగా పట్టించుకోని సమాజ్‌వాదీ పార్టీ జరుగుతున్న నష్టాన్ని గ్రహించి కాంగ్రెస్‌పై ఎదురుదాడి మొదలెట్టింది. వివాహ రిసెప్షన్‌కు సంబంధించి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నేతాజీ (ములాయం సింగ్) పరస్పరం నమస్కరించుకుంటున్నట్లు కనిపిస్తున్న మరో ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. కాంగ్రెస్ పెట్టిన ఫొటో ఏ కార్యక్రమంలో తీశారో, అదే కార్యక్రమంలో కాంగ్రెస్ మిత్రపక్షమైన ఎన్‌సీపీ నేతలు కూడా ములాయం సింగ్ ఆశీర్వాదాలు తీసుకున్నారని పేర్కొంది. దీనికి కాంగ్రెస్ ఏం చెబుతుంది?’’ అంటూ ప్రశ్నించింది.
కాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో చేజారిన తమ ముస్లిం ఓట్ బ్యాంకును సమాజ్‌వాదీ నుండి చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ తంటాలు పడుతోంది.ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్,ములాయం ఫోటోను ఎస్పీని దెబ్బకొట్టేందుకు తన ఎన్నికల ప్రచారాస్త్రంగా కాంగ్రెస్ మార్చుకున్నట్లు కనిపిస్తోంది.