Omicron Cases, Karnataka – ఒమైక్రాన్‌ వచ్చేసింది.. కొత్త వేరియంట్‌పై కేంద్రం కీలక ప్రకటన

ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న కరోనా వైరస్‌ నూతన వేరియంట్‌ ఒమైక్రాన్‌ భారత దేశంలోకి వ్యాపించింది. కర్ణాటకలో ఇద్దరికి ఒమైక్రాన్‌ వైరస్‌ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. విదేశాల నుంచి వచ్చిన 66, 46 ఏళ్ల వ్యక్తులు ఇద్దరికి ఒమైక్రాన్‌ వైరస్‌ సోకినట్లుగా నిర్థారించింది. బెంగూళూరు ఎయిర్‌పోర్టులో వీరికి పరీక్షలు నిర్వహించగా.. వైరస్‌ సోకినట్లుగా గుర్తించామని తెలిపింది. వారిలో తీవ్ర లక్షణాలు లేవని, ఐసోలేషన్‌కు పంపామని పేర్కొంది. వీరి ప్రైమరీ కాంటాక్ట్‌ను గుర్తించామని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు.

ఒమైక్రాన్‌ వేరియంట్‌పై లోతైన పరిశోధనలు జరగాల్సి ఉందని అగర్వాల్‌ తెలిపారు. ఈ వేరియంట్‌పై ఆందోళన పడాల్సిన అవసరం లేదని, అవగాహన పెంచుకోవడం ముఖ్యమని చెప్పారు. మీడియా కూడా ఆందోళనలు పెంచేలా కాకుండా.. అవగాహన పెంచేలా పని చేయాలని సూచించారు. కోవిడ్‌ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

వ్యాక్సిన్‌ తప్పనిసరిగా తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వ్యాక్సిన్‌ తీసుకోవడంలో అలసత్వం వద్దని హెచ్చరించింది. రెండు డోసులు సకాలంలో తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే దేశంలో 1.50 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ పంపిణీ చేశామని తెలిపింది. యువజనులలో 84 శాతం మంది సింగిల్‌ డోసు తీసుకున్నారని తెలిపింది. 49 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారని పేర్కొంది.

Also Read : Omicron Virus, Hyderabad – దేశంలో తొలి ఒమైక్రాన్‌ కేసు.. అదీ తెలుగు రాష్ట్రంలో..!

Show comments