Idream media
Idream media
తెలంగాణ బీజేపీ మంచి ఊపుమీదుంది. పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి. తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు సీహెచ్ విఠల్ సోమవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ సమక్షంలో బీజేపీలో చేరారు.బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ ఛుగ్, బండి సంజయ్ విఠల్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన తెలంగాణ జేఏసీ ప్రధాన కార్యదర్శిగా, కో- ఛైర్మన్‌గా ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఎస్‌పీఎస్సీ సభ్యుడిగా నియమితులైన విఠల్ పదవీ కాలం ఏడాది క్రితం ముగిసింది. ఆదివారమే ఢిల్లీకి చేరుకున్న విఠల్ జాతీయ నేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
టీఎస్‌పీఎస్సీ సభ్యుడిగా పదవీ కాలం ముగిసిన తర్వాత విఠల్‌కు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ లేదా ఏదైనా కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తారని తెలంగాణ రాజకీయాల్లో ప్రచారం కూడా జరిగింది. అయినా అది సాధ్యం కాలేదు. మరోవైపు రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాల పట్ల కేసీఆర్ సర్కారు తీరును ఆయన ముందునుంచి తప్పుపడుతున్నారు. కాగా, మరోవైపు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న మంగళవారం కాషాయ కండువా కప్పుకోనున్నట్లు ప్రకటించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో సాగుతున్న బీజేపీ మరింత బలోపేతం కానుంది.
తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు విఠల్.. తెలంగాణ ఐకాస ప్రధాన కార్యదర్శిగా కో-ఛైర్మన్‌గా ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఉద్యోగాల నియామకం పట్ల ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్ మార్చడాన్ని తప్పుపట్టారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేసే విషయంపై చర్చించేందుకు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారని తెలిసింది. ఆ సమయంలోనే బీజేపీ నేతలు ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించడంతో విఠల్ కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.
1996 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ప్రతి ఉద్యమంలోనూ తనదైన పాత్ర పోషించిన విఠల్ను చేర్చుకోవడం బీజేపీకి లాభం చేకూర్చేదే. ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ కోదండరాం తదితరులతో కలిసి పనిచేసిన విఠల్‌కు రాష్ట్రంలోని పరిస్థితులు రాజకీయాలపై గొప్ప అవగాహన ఉంది. ఉద్యోగుల హక్కుల కోసం కూడా ఆయన పోరాడారు. అయితే ఆయనకు రావాల్సిన పెన్షన్‌ను ప్రభుత్వం నిలిపివేసినట్లు సమాచారం. ఇప్పుడు బీజేపీలో చేరి కేసీఆర్‌పై పోరాటం చేసేందుకు విఠల్ సిద్ధమయ్యారు. మరోవైపు కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా పెట్టుకున్న ప్రముఖ జర్నలిస్ట్ మల్లన్న జైలుకు కూడా వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. తన మాటలతో కేసీఆర్ పనితీరు ఎండగడుతున్న మల్లన్నకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు ఓటమి ఎదురైనప్పటికీ అంచనాలకు మించి ఓట్లు వచ్చాయి. రాష్ట్రంలో కేసీఆర్‌ను గద్దె దించేందుకు ముందుకు సాగుతున్న బీజేపీ.. ఇప్పుడు ఈ నాయకుల చేరికతో మరింత ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఉంది. ప్రజల్లో పేరున్న.. అభిమానం ఉన్న నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా వచ్చే ఎన్నికలకు మెరుగ్గా సన్నద్ధమవాలని చూస్తోంది. ఈ క్రమంలో అధికార పార్టీ టీఆర్‌ఎస్ అలర్ట్ అయింది. జిల్లాల్లోని ముఖ్యులపై అధిష్ఠానం దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరెవరు బీజేపీతో టచ్ లో ఉంటున్నారనేది గమనిస్తోంది. అలాగే బీజేపీని దెబ్బకొట్టేలా పలువురిని నేతలను ఆకర్షించే పనిలో ఉంది.ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ మొత్తంగా తెలంగాణ రాజకీయాలు ఇప్పటి నుంచే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Also Read : TRS – నమస్తే తెలంగాణ ఎండీకి రాజ్యసభ సీటు?