పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకునేవి వరద జలాలే – తెలంగాణ ప్రభుత్వ లెక్కలు చెబుతున్న సత్యం

రాయలసీమకు కృష్ణా జలాలు అందాలంటే వరదైరావాల్సిందే . కృష్ణానదీ జలాల సమస్య ఇరురాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొల్పేలా ఉన్న సమయంలో కొన్ని వాస్తవాలను అన్యోపదేశంగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా చెబుతుంది.

కృష్ణానదీ యాజమాన్య బోర్డ్ ఏర్పడినప్పటి నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తీసుకున్న నీటి లెక్కలను తెలంగాణ సాగునీరు , ఆయకట్టు అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ పేర్కొంటూ 2014 -15 సంవత్సరంలో 59.17 టీఎంసీలు వాడుకున్నట్టు ,అలాగే 2015-16 లో 0.95 టీఎంసీలు , 2016-17లో 67.44 టీఎంసీలు,2017-18లో 91.07 టీఎంసీలు , 2018-19లో 115.4 టీఎంసీలు , 2019-20 లో 179.3 టీఎంసీలు 2020-21 సంవత్సరంలో 128.4 టీఎంసీలు వాడుకున్నట్టు చెపుతున్నారు.

పై లెక్కలు వాస్తమే కావచ్చు కానీ ఇందులో దాగివున్న వరద పరిస్థితిని మరచిపోయి మాట్లాడుతున్నారు . కృష్ణానదికి వరదలు లేని సమయంలో పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తీసుకోలేదు . కృష్ణానదికి వరదలు వచ్చి వందల టీఎంసీలు సముద్రంలో కలిసిన సంవత్సరంలొనే పోతిరెడ్డిపాడు నుంచి వరదజలాలను తీసుకున్నారు. ఆవాస్తవాన్ని తెలంగాణ ప్రభుత్వం కృష్ణానది గర్భంలో దాచి పోతిరెడ్డిపాడుపై బురదజల్లే కార్యక్రమం చేస్తుంది .

తెలంగాణ లెక్కల ప్రకారంగానే చూస్తే 2015-16 సంవత్సరంలో 0.95 టీఎంసీల నీళ్లు పోతిరెడ్డిపాడు నుంచి తీసుకున్నట్టు చెపుతున్నారు . కానీ ఆ సంవత్సరంలో కూడా ప్రకాశం బ్యారేజ్ నుంచి 9.259 టీఎంసీలు సముద్రంలో కలిశాయన్న వాస్తవాన్ని మరిచారు .అంటే వరద వచ్చిన సంవత్సరమే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తీసుకోగలరు అని ఈ లెక్క చెబుతుంది.

పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకోలేకపోవడానికి ప్రధాన కారణమైన 69 జీఓ కూడా ఇక్కడ ఒక కారణం. శ్రీశైలం రిజర్వాయర్లో 854 అడుగుల నీటిమట్టం ఉంటే కదా పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకోగలిగేది ! 834 అడుగులకే కనీస నీటిమట్టం కుదిస్తే ఎలా నీళ్లు తీసుకోగలరు. ఇది ఎప్పుడూ ప్రశ్నర్థకమే .

అలాగే ఈమధ్య రెండు సంవత్సరాల కాలాన్ని ప్రస్తావిస్తూ 2019 -20 సంవత్సరంలో179.3 టీఎంసీలు , 2020-21 సంవత్సరంలో 128.4 టీఎంసీల నీళ్లు తీసుకున్నట్టు చెపుతూ అది ఘోరం , నేరం అయినట్టు పోతిరెడ్డిపాడు నుంచి జలాల తరలింపు అక్రమం అని వాదిస్తున్నారు. కానీ 2019-20 సంవత్సరంలో 798 టీఎంసీల నీళ్లు , 2020-21సంవత్సరంలో 1266 టీఎంసీల నీళ్లు సముద్రం కలిసిన వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ఎక్కువ టీఎంసీల నీరు సముద్రంలో కలిసే సంవత్సరంలోనే పోతిరెడ్డిపాడు నుంచి ఎక్కువ నీటిని తీసుకోగలరు. వరదరాని సంవత్సరంలో పట్టు మని పది టీఎంసీల నీటిని కూడా తీసుకోలేకపోతున్నారని తెలంగాణ ప్రభుత్వం చెప్పిన చెప్పిన లెక్కల ప్రకారమే తెలుస్తుంది .

వందల కొద్దీ టీఎంసీ ల నీరు సముద్రంలో కలిసినా సరే కానీ కరువుతో వలసెల్లె సీమకు వరద సమయంలో కూడా నీటిని తీసుకుపోతే అక్రమం అంటూ ఫిర్యాదు చేయటం సహేతుకం కాదు. రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి అన్నివిధాలా సహకరిస్తాం అని చెప్పిన గతంలో కెసిఆర్ చెప్పారు. కానీ ఇప్పుడేమో చుక్కనీరు కూడా ఇవ్వొద్దు అనేటట్టు KRMB కి లేఖలు రాస్తున్నారు .

తెలంగాణ ఈ సంవత్సరం అసలు వరదే లేని సమయంలో దాదాపు 38 టీఎంసీల నీళ్లు జలవిద్యుత్ ఉత్పత్తికి వాడుకుని , కనీస ప్రాథమిక అవసరం అయిన తాగునీటి గురించి ఆలోచించకపోవడం అన్యాయం. నీటి వినియోగంలో నియమాలను విచక్షణతో అమలు చెయ్యాలి.

మరో పక్క శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్ కు 180 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని ఉంటే 280 టీఎంసీలు ఇవ్వాలని KRMB కి రాసిన లెటర్ లో పేర్కొన్నారు. ఇలాంటి వాదన KRMB ముందు నిలవదు. కేవలం సేటిమెంట్ రెచ్చకొట్టటానికే ఉపయోగపడుతుంది.

ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వ లెక్కలు చెప్పకనే చెపుతున్నాయి . కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడే రాయలసీమకు నీళ్ళని . ఈమాట వింటే ఒకటి గుర్తొస్తుంది . జి.వెంకటకృష్ణ తన హంద్రిగానం కవితా సంపుటిలో

పోతిరెడ్డిపాడు నోటికి
అందాలంటే గుక్కెడు నీళ్లు
వరదై రావాలి ఆల్మట్టి ఎత్తును
దాటి కృష్ణానీళ్లు.

అని కవిత్వికరించిన వాక్యాలు అక్షర సత్యం . పోతిరెడ్డిపాడుకు నీరు అందాలంటే కృష్ణమ్మ వరదై రావాల్సిందే . వరదై వచ్చినా శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులకు రాకముందే తెలంగాణ జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తూ , పాలమూరు రంగారెడ్డి , కల్వకుర్తి , డిండి ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని ఎత్తిపోస్తే భవిష్యత్తులో రాయలసీమ గొంతు ఎండిపోవడం ఖాయమే .అప్పుడు సీమ న్యాలను తడపాలంటే కృష్ణానది వరదై కాదు ఉప్పెనై రావాల్సిందే .

Also Read : కృష్ణా జలాల వివాదం.. తెలంగాణ ఏం కోరుకుంటోంది..?

Show comments