Idream media
Idream media
అధికార పార్టీ టీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, కాంగ్రెస్.. మూడు కూడా పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం హుజూరాబాద్, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజాక్షేత్రంలో పోరాడుతున్నాయి. ఒకే రోజు బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా సభలు పెడుతుంటే.. పథకాలు, వ్యాఖ్యల ద్వారా కేసీఆర్ తనదైన శైలిలో విజృంభిస్తున్నారు.
ఉదాహరణకు.. సెప్టెంబర్ 17న నిర్మల్‌లో బీజేపీ, గజ్వే ల్‌లో కాంగ్రెస్ సభలు నిర్వహించి కేసీఆర్ టార్గెట్ గా విమర్శలు చేయగా.. హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి కౌంటర్‌గా సెప్టెంబర్ 17పై విపక్షాలు చేస్తున్న రాద్దాంతాన్ని తిప్పికొట్టారు. అధికారంలోకి వస్తే.. ఆ రోజును తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా జరుపుతామని హామీ ఇచ్చిన కేసీఆర్ మాట ఎందుకు తప్పారంటూ బీజేపీ, కాంగ్రెస్ ఆయా సభల వేదికపై నుంచి ప్రశ్నించాయి. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ.. కొత్తగా మతం పుచ్చుకున్నవాడికి నామాలు ఎక్కువ అన్న చందంగా.. కొంతమంది సెప్టెంబర్ 17 రాగానే హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ప్రజలకు అసలైన విముక్తి.. విమోచనం..2014 జూన్ 2 అని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించాలని భావించిన మాట నిజమేనని.. కానీ అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని.. గతాన్ని మళ్లీ తవ్వడమెందుకన్న ఉద్దేశంతో ఆరోజు ఎలాంటి దినోత్సవాన్ని జరపడం లేదని సమాధానం ఇచ్చారు.
Also Read : బండి ప్లాన్ చేంజ్ : హుజూరాబాద్ టు హుస్నాబాద్
తాజాగా శనివారం (అక్టోబర్ 2న) హుస్నాబాద్‌లో బీజేపీ బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభను ఏర్పాటు చేయగా.. విద్యార్థి – నిరుద్యోగ సైరన్ పేరుతో హైదరాబాద్‌లో కాంగ్రెస్ రచ్చ రచ్చ చేసింది. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ ‘దళిత బంధు’ పథకానికి తాజాగా అదనపు విధివిధానాలను జారీ చేసి దీని ద్వారా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కేవలం పథకం, రాష్ట్ర అభివృద్ధిపై మాత్రమే మాట్లాడి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. బీజేపీ అయితే.. హుస్నాబాద్ వేదిక ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ విసిరింది. ఇప్పుడు హుజూరాబాద్‌లోను, ఆ తర్వాత.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీదే గెలుపు అని చెప్పారు. ఇదే సభకు ముఖ్యఅతిథిగా హాజరైన స్మృతి ఇరానీ కూడా కేసీఆర్‌పై విమర్శలు చేశారు. కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందన్నారు. ఎంఐఎంకు టీఆర్‌ఎస్ భయపడుతుందేమో కానీ బీజేపీ భయపడదని ఆమె స్పష్టం చేశారు.
ఇక కాంగ్రెస్ అయితే.. విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో యువతను ఆకట్టుకునేపనిలో నిమగ్నమైంది. దీనిలో భాగంగా దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఎల్బీనగర్ వరకు శనివారం తలపెట్టిన జంగ్ సైరన్ ఉద్రిక్తతలకు దారి తీయడంతో నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు. పోలీసులు రేవంత్ ను గృహ నిర్బంధం చేయడంపై ఆయన తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపైన, పోలీసులు పైన విరుచుకుపడ్డారు. ఇంట్లోనే దీక్ష చేశారు. ఇలా కాంగ్రెస్, బీజేపీ ఆందోళనల ద్వారా ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. టీఆర్ఎస్ అభివృద్ధి ద్వారా ప్రజలు టీఆర్ఎస్కే పట్టం కట్టేలా వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా దళిత బంధు పథకానికి ఎస్సీ అభివృద్ధి, సంక్షేమశాఖ అదనపు విధివిధానాలను జారీ చేసి మరింత లబ్ధి చేకూరేలా మార్పులు చేసింది.
మొత్తం మీద తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. రాజకీయ వేడిని రగిలిస్తున్నాయి. ప్రస్తుతం హుజూరాబాద్ చుట్టూనే మొత్తం సమీకరణాలు తిరుగుతుండగా.. అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో సత్తా చాటేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.
Also Read : వైఎస్సార్ సెట్ చేసిన ట్రెండ్ కొనసాగుతూనే ఉంది..!