TRS plenary -గులాబీ గుభాళింపులు.. శ్రేణుల సంబ‌రాలు..

తెలంగాణ రాష్ట్ర స‌మితి ద్వి ద‌శాబ్ది ఉత్స‌వాల జోష్ తో టీఆర్ఎస్ శ్రేణులు సంబ‌రాల్లో మునిగితేలారు. పార్టీ 20 ఏళ్ల ప్ర‌స్థానం సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో జ‌రిగిన ప్లీన‌రీ విజ‌య‌వంతం కావ‌డం, గులాబీ బాస్ కేసీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ల‌తో గులాబీ నేత‌లు ఫుల్ ఖుషీగా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ మ‌రోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్లీన‌రీకి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ మంత్రులు, ఎంపీలు, పార్టీ ప్రతినిధులతో పాటు వేలాది మంది కార్య‌క‌ర్త‌లు త‌ర‌లివ‌చ్చారు. దీంతో స‌భా ప్రాంగ‌ణం గులాబీ దండుతో క‌ళ‌క‌ళ‌లాడింది.

14 ఏళ్లు ఉద్య‌మ పార్టీగా…

జ‌ల దృశ్యంలో ఇర‌వై ఏళ్ల కిందట‌ టీఆర్ఎస్ ప్ర‌స్థానం ప్రారంభ‌మైంది. 14 ఏళ్లు ఉద్య‌మ పార్టీగా ప్ర‌జ‌ల్లో అమిత‌మైన ఆద‌ర‌ణ పొందింది. ప్ర‌త్యేక తెలంగాణ ఏర్పాటులో కీల‌క భూమిక పోషించింది. అనంత‌రం దాదాపు ఏళ్లుగా అధికార పార్టీగా కొన‌సాగుతోంది. 2001 ఏప్రిల్‌ 27న కేసీఆర్‌ అధ్యక్షతన 12 మంది ప్రతినిధులతో తెరాస ఆవిర్భవించింది. ఆ తర్వాత జరిగిన పలు ప్లీనరీల్లో ఆయన అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మరోసారి ఆయనే అధ్యక్షుడు అయ్యారు. దేశంలో సుదీర్ఘకాలం పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్న వారిలో కేసీఆర్‌ ఒకరు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా కేసీఆర్‌ ఉపసభాపతి, సిద్దిపేట ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తెరాసను స్థాపించారు. ఆ తర్వాత ఉద్యమ పంథాలోనే పార్టీని నడిపించారు.

సంస్థాగ‌తంగా మ‌రింత బ‌లోపేతం

ద్విదశాబ్ది ఉత్సవాల సందర్భంగా సంస్థాగత పటిష్ఠతపై తెరాస దృష్టి సారిస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆశ‌యాలకు అనుగుణంగా పార్టీ కొత్త రూపు సంత‌రించుకుంటోంది. బస్తీ, గ్రామ, మండల, డివిజన్‌ కమిటీల ఎన్నికలను నిర్వహించింది. జిల్లా, రాష్ట్ర కమిటీలు రానున్నాయి. పార్టీ శ్రేణులకు శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. దీని కోసం అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మించారు. పార్టీయే సర్వస్వంగా పనిచేస్తూ, ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా శ్రేణులు ఉండాలని తెరాస భావిస్తోంది. తమిళనాడులోని డీఎంకే, అన్నాడీఎంకే తరహాలో పార్టీ పటిష్ఠానికి త్వరలో మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పార్టీని క్షేత్ర‌స్థాయిలో మ‌రింత విస్త‌రించి మూడో సారి అధికారంలోకి రావాల‌న్న సంక‌ల్పంతో టీఆర్ఎస్ నేత‌లు ముందుకెళ్తున్నారు.

Also Read : Assembly Seats Hike – 2023 లోపే నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోందా..?

అపోహలు ప‌టాపంచ‌లు చేసి అగ్ర‌గామిగా

ప్లీన‌రీలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. 20 ఏళ్ల కిందట జలదృశ్యంతో గులాబీ జెండా ఎగిరిందని, ఎన్నో అపనమ్మకాల మధ్య పార్టీ ఏర్పడిందన్నారు. స్పష్టమైన లక్ష్యంతో ముందుకు కదిలామని, సమైక్య పాలకులు ఎన్నో ఇబ్బందులు పెట్టారని పేర్కొన్నారు. ఇప్పుడు దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని, తెలంగాణ 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తోందని చెప్పారు. తలసరి విద్యుత్‌ వినియోగంలో నెంబర్‌ వన్‌గా ఉన్నామని, 11.5 శాతం వృద్ధి రేటుతో నెంబర్‌వన్‌గా ఉన్నామన్నారు. తెలంగాణ వస్తే చీకట్లు అలుముకుంటాయని అపోహాలు సృష్టించారని, అలాంటిది ఇప్పుడు తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. అనేక అటుపోట్లు ఎదురైనా పట్టించుకోకుండా ముందుకు సాగామని అన్నారు.

ప్ర‌పంచ ఉద్య‌మాల‌కు కొత్తసిపాయిల తిరుగుబాటు విఫ‌ల‌మైంది అని అనుకుంటే దేశానికి వ‌చ్చేదా స్వాతంత్ర్యం.. రాజీలేని పోరాట‌మే విజ‌యం సాధిస్తుంది.. ముమ్మాటికీ తెలంగాణ వ‌చ్చి తీరుతుందిని అని నిర్ణయించుకున్నామని కేసీఆర్‌ అన్నారు. అలా అనేక ర‌కాలుగా పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాము. స‌మైక్యవాదులు అనేక అడ్డంకులు సృష్టించినా భయపడకుండా పోరాటం సాగించామన్నారు. రాష్ట్రాన్ని సాధించుకునేందుకు చేయని ప్రయత్నం లేదు.. ఎన్నో నిందలు వేశారు.. పడరాని ఇబ్బందులు పడ్డాము. అయినా వెనుకడుగు వేయకుండా రాష్ట్రాన్ని సాధించుకున్నాము అని అన్నారు. అలుపెరగని పోరాటం చేసి చివ‌రికి రాజ్యస‌భ‌లో బిల్లు పాస్ అయ్యే ముందు కూడా అడ్డంకులు సృష్టించేందుకు ప్రయ‌త్నించారు. అయినా పట్టుదలతో పోరాటం సాగించి రాష్ట్రాన్ని సాధించుకున్నాము అని వివరించారు. తెలంగాణ ఉద్యమం ప్రపంచ ఉద్యమాల‌కు కొత్త బాట‌ను చూపాయి. చ‌రిత్రలో తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమ‌కారుల‌కు శాశ్వతంగా కీర్తి ఉండిపోతుంది అని సీఎం కేసీఆర్ అన్నారు.

ప్లీన‌రీ వేదిక‌గా విపక్షాల‌పై విమ‌ర్శ‌లు

బీజేపీ- కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సిట్ అంటే సిట్- పట్ అంటే పట్ అని సీఎం కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి అధిష్టానం లేదని.. తెలంగాణ ప్రజలే బాస్ లు అని తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. అద్భుతమైన పునాది కలిగివున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అన్నారు. ఆర్థికంగా బలమైన శక్తిగా ఉందని తెలిపారు. విరాళాల రూపంలో 420కి పైగా కోట్ల నిధులు ఉన్నాయని చెప్పారు. దేశంలో టీఆర్ఎస్ కు మంచి భవిష్యత్తు ఉందన్నారు. ఏ పని చేయాలన్నా అద్భుతమైన పార్టీ సైన్యం కావాలని తెలిపారు. కిరికిరి వాళ్ళు, అవగాహన రాహిత్యం ఉన్న వాళ్ళు అక్కడక్కడా అవాక్కులు- చవాక్కులు వాగుతున్నారని మండిపడ్డారు. దళితబంధు దగ్గరే అభివృద్ధి ఆగదన్నారు.

Also Read : KCR ,AP Power -ఏపీలో కరెంటు లేదా, కేసీఆర్ మాటల వెనుక మర్మమదే..

Show comments