Idream media
Idream media
ఏడేళ్లుగా తెలంగాణలో చక్రం తిప్పుతున్న టీఆర్ఎస్.. కొద్ది నెలలుగా ఒడిదుడుకులు తప్పడం లేదు. ఎన్నికలు ఏవైనా.. వార్ వన్ సైడే అన్నట్లు ఉండే పరిస్థితి నుంచి గెలవాలంటే కష్టపడక తప్పదన్న స్థితికి వచ్చింది. చివరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అపసోపాలు పడాల్సి వస్తోంది. సగం స్థానాలను కైవసం చేసుకున్నా.. మిగిలిన స్థానాల్లో పోటీ తప్పడం లేదు. దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్నింటినీ (పన్నెండు స్థానాలు) తన ఖాతాలో వేసుకోవాలని పక్కా ప్రణాళికలతో ప్రయత్నాలు చేస్తోంది. విపక్షాల వ్యూహాలను నిశితంగా గమనిస్తూ.. ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ఆరు స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలవారీగా ఎన్నిక జరుగుతుండటంతో ఆయా జిల్లాల మంత్రులకు సమన్వయ బాధ్యతలు, ప్రణాళికను అమలు చేసే పనిని పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు అప్పగించారు.
సంఖ్యాపరంగా ఆధిక్యతలో ఉన్నా..
మెదక్, ఖమ్మం మినహా మిగిలిన నాలుగింటిలోని స్వతంత్ర అభ్యర్థుల వెనుక బీజేపీ, కాంగ్రెస్ నేతల హస్తం ఉందని టీఆర్‌ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఆయా పార్టీలకున్న బలాబలాలను అంచనా వేస్తోంది. ఎన్నికలు జరిగే ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలతో జిల్లా మంత్రులు భేటీ అయి ఎన్నికల వ్యూహాన్ని వివరించారు. ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాలలోని పార్టీకి చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ సందర్భాల్లో ఇతర పార్టీల నుంచి గులాబీ గూటికి చేరినవారిని కూడా కలుపుకుంటే సంఖ్యాపరంగా అన్ని జిల్లాల్లోనూ టీఆర్‌ఎస్‌దే ఆధిపత్యం.
గ్రూపు రాజకీయాలతో ఆందోళన
నల్గొండ జిల్లాకు సంబంధించి మంత్రి జగదీశ్‌రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుడితో సమావేశం జరిగింది. ఆ జిల్లాలో ఆరుగురు స్వతంత్రులు బరిలో ఉండడంతో వారి బలాబలాలు, పోటీలోకి దిగేందుకు కారణాలపై చర్చించారు. వారిలో పోటీ ఇచ్చేవారు ఉన్నారా అనేది ఆరా తీశారు. దీంతో అధికార పార్టీకి ఎక్కడో అనుమానాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. అలాగే ఖమ్మం బరిలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను మంత్రి పువ్వాడ ఒక్కరే టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మధిర, భద్రాచలం ఎమ్మెల్యేలు మినహా మరో ఏడుగురు తర్వాత అధికార పార్టీలో చేరారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌కు ఎనిమిది మంది ఎమ్మెల్యేల బలమున్నా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు అధిష్టానానికి ఆందోళన కలిగిస్తున్నాయి.
క్యాంపు రాజకీయాలు తప్పవా?
కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల కోటాలోని రెండు స్థానాల్లో ప్రధాన పార్టీలతో కలుపుకొని మొత్తం పది మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో టీఆర్‌ఎస్ అధిష్టానం అప్రమత్తమైంది. ఇప్పటికే పార్టీకి చెందిన ఎంపీటీసీలు హైదరాబాద్ శివారులోని క్యాంపులకు తరలిపోగా, డిసెంబర్ మొదటివారంలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా బెంగళూరు టూర్‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మెదక్‌లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు బీజేపీలో చేరిన ఓ కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మంత్రి హరీశ్‌రావు ఇప్పటికే నియోజకవర్గాలవారీగా ఓటర్లతో భేటీ అవుతున్నారు. ఐదో తేదీ తర్వాత ఇక్కడి నుంచి క్యాంపులకు తరలేందుకు సన్నాహాలు సాగుతున్నాయి.
టీఆర్ఎస్ ఓటమికి యత్నాలు
కరీంనగర్‌లో ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తమకు అనుకూలంగా ఉండే స్వతంత్రులను బరిలోకి దించి టీఆర్‌ఎస్ ఓటమికి పథక రచన చేస్తున్నారు. మెదక్‌లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దుబ్బాక మున్సిపల్ కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు మద్దతు పలుకుతున్నారు. పుష్పరాణికి ఎంపీ సోయం బాపూరావుతోపాటు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దన్నుగా ఉన్నట్లు సమాచారం. నల్లగొండలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సోదరుల అండతో ఒకరిద్దరు ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. ఖమ్మంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే పోడెం వీరయ్య కాంగ్రెస్ అభ్యర్థికి ఓటర్ల మద్దతును కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇలా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా రసవత్తరంగా మారాయి.