KCR,TRS- కేసీఆర్ సార్ .. వేరే ఛాన్స్ ప్లీజ్ ?

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి కొన‌సాగుతోంది.ఎమ్మెల్యేల కోటాలో ఆరు, స్థానిక సంస్థల కోటాలో ప‌న్నెండు స్థానాలు, గవర్నర్ కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఖాళీ ఏర్పడింది. వారిలో ఇప్ప‌టికే కొంద‌రు ఏక‌గ్రీవ‌మ‌య్యారు. మిగిలిన స్థానాల‌ను కూడా గెలుచుకునేందుకు టీఆర్‌ఎస్ విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ ఎన్నిక‌ల్లో అవ‌కాశం కోల్పోయిన వారి క‌థ వేరేలా ఉంది. ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రుగుతున్న స్థానాల్లో మ‌ళ్లీ ఎంపిక‌పై సిట్టింగ్‌లు ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే వారిలో స‌గం మందికే అవ‌కాశం ద‌క్కింది. దీంతో మిగిలిన వారు ఇప్ప‌టి నుంచే మ‌రో ప‌ద‌వి కోసం ఆర్జీలు పెట్టుకుంటున్నారు. ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇవ్వ‌క‌పోయినా..ఇత‌రత్రా ప‌ద‌వుల్లో అయినా కూర్చోబెట్టాల‌ని కోరుతున్నారు. కొంద‌రికి ఇప్ప‌టికే ఆ దిశ‌గా కేసీఆర్ హామీలు ఇచ్చారు. తెలంగాణలో ఇటీవల 19 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. కొందరి పదవీకాలం జనవరిలో ముగుస్తోంది.

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న న‌లుగురికి ఈ సారి అవ‌కాశం ద‌క్క‌లేదు. తిరిగి పదవి వస్తుందనే గంపెడా‌శ‌తో ఎదురుచూస్తున్న వారిని అధినేత ప‌ట్టించుకోలేదు. పదవీకాలం పూర్తయిన డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఆకుల లలిత, ఫరీదుద్దీన్‌లకు తిరిగి అవకాశం ఇవ్వలేదు. ఆకుల లలిత పేరు ఖ‌రారైన‌ట్లు మొద‌ట్లో వార్త‌లు వ‌చ్చినా చివ‌ర‌లో ఆమె పేరు క‌నిపించలేదు. పార్టీ అవసరాలు సామాజిక సమీకరణాలు.. ఇతర నేతల ఒత్తిడి కారణంగా వీరిని రెన్యువల్ చేయలేదని తెలుస్తోంది. అయితే ఈమెకు అధినేత‌ భవిష్యత్తులో త‌గిన ప్రాధాన్యం ఇస్తామ‌ని హామీ ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక స్థానిక సంస్థల కోటాలో ఐదుగురికి నిరాశే ఎదురయింది. పార్టీ అధినేత తమ పట్ల చల్లని చూపు చూస్తాడనుకుంటే తిరిగి అవకాశం ఇవ్వకుండా శీతకన్ను చూపారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో ఖాళీ ఏర్పడ్డ 12 స్థానాల్లో ఏడుగురు మాత్రమే తిరిగి అవకాశం దక్కించుకున్నారు. మిగతా ఐదు స్థానాల్లో కొత్తవారిని తీసుకున్నారు. నల్లగొండ నుంచి తేరా చిన్నపరెడ్డి, ఖమ్మం నుంచి బాలసాని లక్ష్మీనారాయణ,మెదక్ నుంచి భూపాల్రెడ్డి ,కరీంనగర్ నుంచి నారదాసు,లక్ష్మణ రావులకు, ఆదిలాబాద్ నుంచి పురాణం సతీశ్‌కు నిరాశ తప్పలేదు. గవర్నర్ కోటాలో మాజీ స్పీకర్ మధుసూదనాచారిని ఎంపిక చేశారు.

ఎమ్మెల్సీ అవ‌కాశానికి దూర‌మైన నేత‌లు ఇప్పుడు భ‌విష్య‌త్ పై గంపెడాశ‌లు పెట్టుకున్నారు. అయితే.. వారు అసంతృప్తికి గుర‌వ‌కుండా కేసీఆర్ ఇచ్చిన హామీల‌పై వారి దృష్టంతా ఉంది. ఎటువంటి అవ‌కాశం ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, నిజంగా మ‌రో ప‌ద‌వి కేటాయిస్తారా అనే ఆందోళ‌న వారిలో కొన‌సాగుతోంది. ఈ తొమ్మిది మంది నేతల్లోనూ అదే దిగులు క‌నిపిస్తోంద‌ని అనుచ‌రుల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. కార్పొరేషన్, ఇతర ఛైర్మన్‌ల పదవుల‌పై వారు ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రి వారిలో ఎంత మందికి అవ‌కాశాలు ద‌క్కుతాయి, అధినేత హామీలు ఎంత వ‌ర‌కు నెర‌వేరుతాయి అనేది వేచి చూడాలి.

Show comments