Idream media
Idream media
టికెట్ ఇస్తారా..? ఇవ్వరా..? ఇవ్వకపోతే ఏం చేయాలి..? ఎటు పోవాలి.. జీహెచ్ ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ లోని కొన్ని పార్టీ నేతల అంతర్మథనం ఇది. గ్రేటర్ పోరులో కీలకమైన నామినేషన్ల దాఖలుకు నేడు ఆఖరు కావడంతో ఆశావహుల్లో టెన్షన్ తీవ్రమవుతోంది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ 125 మందితోను, బీజేపీ 73, కాంగ్రెస్ 45, టీడీపీ 90 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. నేడు నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. ఈ నేపథ్యంలో తుది జాబితాల కోసం ఆయా పార్టీల ఆశావహులు ఎదురుచూస్తున్నారు. కొందరైతే ముందు నామినేషన్ వేసేద్దాం.. టికెట్ వస్తదా.. రాదా అన్నది తర్వాత చూద్దామనే ధోరణిలో ఉన్నారు. బి ఫామ్ లు అందితే ఆశించిన పార్టీ నుంచి లేదా ఇతర పార్టీ, స్వతంత్రంగా అయినా రంగంలోకి దిగాలని కొందరు నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్నారు.
ఆసక్తికర పరిణామాలు..
ఈసారి గ్రేటర్ పోరులో ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. 2016లో ఇతర పార్టీల నుంచి మాజీ కార్పొరేటర్లు కారెక్కగా.. ఇప్పుడు అవకాశం రాలేదని కొందరు, వస్తారో రాదోనన్న అనుమానంతో ఇంకొందరు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇద్దరు సిట్టింగ్ లు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ 125 స్థానాలను ప్రకటించగా.. వారిలో 10 మంది వరకూ సిట్టింగ్ లకు టికెట్ దొరకలేదు. దీంతో కొంత మంది వేరే పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ డివిజన్ అభ్యర్థి ఖరారు కాకున్నా సిటింగ్ కార్పొరేటర్ కిలారి మనోహర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. అలాగే రామచంద్రపురం డివిజన్ అభ్యర్థి కూడా బీజేపీలో చేరారు. వీరితో పాటు శేరిలింగం పల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, ఆయన తనయుడు రవి కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. మరోవైపు ఇతర పార్టీలలోని కొందరు నాయకులు టీఆర్ఎస్ లో చేరుతున్నారు.