Idream media
Idream media
ఏపీ బీజేపీ చీఫ్ అయిన తొలినాళ్లలో ఉన్న ఉత్సాహం సోము వీర్రాజులో ఇప్పుడు కనిపించడం లేదు. పైగా వైరాగ్యం కనిపిస్తోంది. ఎంతలా అంటే.. ఇక రాజకీయాలు చాలు అన్నంతగా. 2024 తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటానని తాజాగా ప్రకటించారు. దీని వెనుక బలమైన కారణాలే ఉన్నాయని చర్చ జరుగుతోంది. సాధారణంగా రాజకీయాల్లో నుంచి తప్పుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. రాజకీయ మాయ అలాంటిది. అలాంటిది ఆయన ఎందుకలా అన్నారనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సోము వీర్రాజు అంటే గోదావరి జిల్లాల ప్రజలకు తెలుసు. ఆయన ఆరెస్సెస్ నుంచి తన ప్రజా జీవితాన్ని ప్రారంభించారు.
బీజేపీలో సోము కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నారు. ఆయన ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు మెచ్చి ఏపీ బీజేపీ కిరీటాన్ని అప్పగించారు. అయితే ఆయన అధ్యక్షతన బీజేపీ ఏమీ సాధించలేదన్నది కమలనాధుల కలవరంగా ఉంది. మరో వైపు సోము కూడా ఎందుకో దూకుడు చూపించలేకపోతున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. దాంతో పాటు సొంత పార్టీలోనే ఆయనకు ప్రత్యర్థులు తయారయ్యారు అన్న మాట కూడా ఉంది. మరి ఇంతకాలం ఆయనకు హై కమాండ్ దన్ను ఉండేది. ఎపుడైతే ఆయన నాయకత్వాన బీజేపీ వరసగా విఫలమవుతూ వస్తోందో పార్టీ పెద్దలు కూడా పునరాలోచనలో పడ్డారని టాక్.
ఈ మొత్తం పరిణామాలను సమీక్షించుకున్నారో లేక ఇక్కడితో చాలు అనుకున్నారో తెలియదు కానీ సోము వీర్రాజు తాజాగా సంచలన ప్రకటన చేశారు. ఇక్కడితో సరి నా రాజకీయ జీవితానికి స్వస్తి అంటూ ఆయన హాట్ హాట్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. అయితే సోము వీర్రాజు కేవలం ఎమ్మెల్సీగా మాత్రమే అధికార పదవి అనుభవించారు. అంతకు మించి ఆయనకు దక్కింది ఏమీ లేదు. ఏపీలో బీజేపీ సీన్ బాగుంటే ఆయనకు ఏమైనా వరించి వచ్చేవి. ప్రస్తుతం చూస్తే అలాంటి వాతావరణం ఏ కోశానా కనిపించడంలేదు. ఇక బీజేపీకి టీడీపీతో పొత్తు ఉంది 2024 ఎన్నికల్లో ఈ కూటమి గెలిచినా సోము వీర్రాజుకు ఏ పదవి ఇచ్చేందుకు టీడీపీ పెద్దలు ఇష్టపడకపోవచ్చు అన్న మాట కూడా ఉంది. ఎందుకంటే సోము ఒంటి కాలి మీద ఎపుడూ లేచేది టీడీపీ వారి మీదనే.
దాంతో సోము వీర్రాజు ఒక విధంగా రాజకీయ వైరాగ్యం ఆవహించింది అంటున్నారు. అందుకే ఆయన సడెన్ గా రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని చెబుతున్నారని తెలుస్తోంది.
ఇక బీజేపీ లో తప్పుకోవడాలు అయితే ఉండవు రాజకీయంగా చురుకుగా లేని వారు సైతం ఏదో ఒక పార్టీ బాధ్యతతో కనిపిస్తూనే ఉంటారు. అలాంటిది సోము ఎందుకు అలా స్టేట్మెంట్ ఇచ్చారా అన్న చర్చ అయితే పార్టీ వర్గాల్లో సాగుతోంది. ఏది ఏమైనా సోముకు ఏపీ బీజేపీ ప్రెసిడెంటే పెద్ద పదవిలా ఉంది అని అంటున్నారు. దాంతో ఇక చేసింది చాలు మనకు దక్కింది కూడా చాలు అని ఆత్మ సంతృప్తితో అలా రిటైర్మెంట్ ప్రకటించారా అన్న చర్చ కూడా ఉంది. దీంతో పాటు ఎలాగూ ఇప్పట్లో ఏపీలో అధికారం మారే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ప్రశాంతంగా గడపడమే మేలన్న నిర్ణయానికి వచ్చారన్న టాక్ నడుస్తోంది.
Also Read : Bjp ,Corporate Funds – బీజేపీ కి కార్పోరేట్ కనకాభిషేకం