Telangana Politics, KCR – టీఆర్‌ఎస్‌ Vs బీజేపీ.. కేసీఆర్‌ తేల్చేశారా..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం అనగానే ఆయన ప్రస్తావించిన అంశాలకు సంబంధించిన ఆసక్తికర చర్చలు జరుగుతుంటాయి. అలాగే ప్రతిపక్షాలపై చేసిన విమర్శలపై కూడా మీడియాలో చర్చ జరుగుతూ ఉంటుంది. నేడు సీఎం కేసీఆర్ వ్యవసాయ, ఆర్థిక శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ మీడియా సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లక్ష్యంగా ఆయన చేసిన విమర్శలు కాస్త మీడియాలో హైలెట్ అయ్యాయి.

తనపై వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని సీఎం కేసీఆర్ సీరియస్ గా తీసుకుని బండి సంజయ్ కు కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా సరే ఇన్ని రోజులు క్షమించి వదిలేసామని కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి ఉండదని కచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ బండి సంజయ్ ను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో రేపట్నుంచి పరిస్థితులు మారుతాయని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉంటుందని… సోషల్ మీడియాలో కూడా వార్తలు చవాకులు పేలితే మాత్రం పరిస్థితులు దారుణంగా ఉంటాయని బండి సంజయ్ ను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు.

దమ్ముంటే బీజేపీ తనను జైల్లో పెట్టాలని కూడా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బాగా హైలైట్ అయ్యాయి. తాను ప్రాజెక్టులలో అవినీతి చేస్తే ఖచ్చితంగా బండి సంజయ్ కేసు పెట్టుకోవచ్చు అని కూడా ఆయన సవాల్ విసిరారు. అయితే కేసీఆర్ ప్రెస్ మీట్ మొత్తం కూడా వ్యవసాయ శాఖ విషయంలో గానీ రాజకీయ విమర్శల విషయంలో గానీ బిజెపి గురించి మాత్రమే ప్రస్తావించారు. సీఎం కేసీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై మాత్రం కేసీఆర్ స్పందించలేదు.

వాస్తవానికి బండి సంజయ్ తో పోలిస్తే రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో కెసిఆర్ పై విమర్శలు చేస్తూ ఉంటారు. అయినా సరే కేసీఆర్ మాత్రం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి గానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి గాని ఒక్క మాట మాట్లాడలేదు. అయితే సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ద్వారా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారనే విషయం చెప్పవచ్చు. తెలంగాణలో ఇక నుంచి తన ప్రధాన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ మాత్రమే అనే విషయాన్ని కేసీఆర్ డౌట్ లేకుండా క్లారిటీ ఇచ్చేశారు. అలాగే వ్యవసాయ చట్టాల విషయంలో కూడా తాను పోరాటం చేస్తానని, రైతులు ధాన్యం కొనాలని ఢిల్లీలో నిరసనకు దిగుతామని సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన లేకపోవడంతో… ఇక రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్ పార్టీగా రాజకీయం నడిచే అవకాశం ఉందని స్పష్టత వచ్చేసింది. టిఆర్ఎస్ పార్టీ నాయకులు బండి సంజయ్ చేసే విమర్శలకు ఇకనుంచి ఘాటుగా సమాధానం ఇస్తారు అనే అంశాన్ని కూడా సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పటం తో… రేపట్నుంచి రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక క్లారిటీ వచ్చింది. మరి బండి సంజయ్ సీఎం కేసీఆర్ చేసిన విమర్శలపై ఏవిధంగా స్పందిస్తారు ఏంటనేది చూడాలి. అయితే బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నా సరే సీఎం కేసీఆర్ కేవలం బండి సంజయ్ పేరు మాత్రమే ప్రస్తావించడం గమనార్హం.

Also Read : KCR Press Meet – ధాన్యం కొనుగోలు, పెట్రోల్‌ ధరలు.. కేంద్రాన్ని ఉతికి ఆరేసిన కేసీఆర్

Show comments