TS Assembly Elections 2023 TDP Janasena Alliance: TDP, జనసేన పొత్తు లెక్కలు ఇవి.. కేవలం 32 సీట్లతో సరిపెట్టుకోనున్న జనసేన?

TDP, జనసేన పొత్తు లెక్కలు ఇవి.. కేవలం 32 సీట్లతో సరిపెట్టుకోనున్న జనసేన?

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి అన్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్కిల్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయ్యి.. జైలులో ఉన్నారు. బెయిల్‌ కూడా లభించలేదు. ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు కోర్టుకు సమర్పించారు. ఇదే కాక అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో కూడా చంద్రబాబు నాయుడు ఏ1 గా ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసులన్ని విచారణలో ఉన్నాయి. చంద్రబాబు వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారనే విషయం సాక్ష్యాధారాలతో కళ్ల ముందు కనిపిస్తున్నా సరే.. ఆ విషయం మాత్రం జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కి అర్థం కావడం లేదని.. ఇది పార్టీపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని.. స్వయంగా ఆ పార్టీ నేతలే అంటున్నా సరే పవన్‌ లెక్క చేయడం లేదని తెలుస్తోంది.

ఎందుకంటే పవన్‌ సిద్ధాంతం, జనసేన పార్టీ సిద్ధాంతం కూడా అవినీతి మీద పోరాటం. మైక్‌ ముందుకు వస్తే చాలు.. అవినీతిని అంతం చేస్తాను అంటూ భారీ డైలాగ్‌లు కొట్టే పవన్‌ కళ్యాణ్‌.. ఇప్పుడు చంద్రబాబు విషయంలో మాత్రం తన సిద్ధాంతాన్ని గాలికి వదిలేశారా అనే విమర్శలు వినిస్తున్నాయి. స్కిల్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయిన చంద్రబాబుకి పవన్‌ అన్ని విధాలుగా మద్దతు తెలపడమే కాక.. జైల్లోనే బాబుతో ములాఖత్‌ అయ్యి.. ఆ వెంటనే మీడియా ముందు పొత్తుల గురించి ప్రకటన చేశాడు. అయితే పవన్‌ తీరు మీద జనాలే కాదు.. సొంత పార్టీ నేతలు, ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు, అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో పవన్‌ కళ్యాణ్‌ పునరాలోచనలో పడ్డారనే టాక్‌ వినిపిస్తోంది.

87  స్థానాల్లో టీడీపీ పోటీ..

ఇదిలా ఉండగానే మరో వైపు పొత్తు, టీడీపీ, జనసేనల మధ్య సీట్ల పంపకం గురించి కూడా అనేక ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. ఇక తాజాగా రెండు పార్టీల మధ్య సీట్ల పంపకానికి సంబంధించిన తుది నిర్ణయం కూడా జరిగినట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ-జనసేన మధ్య ప్రస్తుతం సీట్ల పంపకం జరిగింది తెలంగాణకు సంబంధించి మాత్రమే. వచ్చే నెలలో అనగా నవంబర్‌లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ ఉందో లేదో కూడా డౌటే. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌.. చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. తెలంగాణలో టీడీపీ, జనసేన పొత్తు గురించి ఇంకా ఆలోచన చేయలేదని.. కానీ తాము మాత్రం 87 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు.

32 స్థానాలకే పరిమితమైన జనసేన..

ఇదిలా ఉండగా జనసేన కూడా వచ్చే నెలలో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించింది. ఈ రెండు ప్రకటనలను చూస్తే.. తెలంగాణలో కూడా టీడీపీ, జనసేనల మధ్య పొత్తు కాయమనే విషయం అర్థమవుతోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఈ సీట్ల పంపిణీ చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. అసలు తెలంగాణలో టీడీపీ ఉనికి పూర్తిగా మాయం అయ్యింది. అలాంటిది 87 స్థానాల్లో పోటీ అంటే ఆ పార్టీకి సంబంధించినంత వరకు పెద్ద విషయమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాక.. అసలు టీడీపీ తరఫున పోటీ చేసేందుకు అసలు అభ్యర్థులు ఉన్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ పరిస్థితి ఇలా ఉంటే.. ఇక పార్టీ పెట్టి పది సంవత్సరాలు అవుతుంది.. కానీ నేటికి కూడా పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారని పవన్‌ కళ్యాణ్‌.. జగన్‌ని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న జనసేన పార్టీకి అసలు తెలంగాణలో కనీస గుర్తింపు లేదని.. అలాంటిది.. ఇక్కడ ఏకంగా 32 స్థానాల్లో పోటీ అంటే.. అసలు అభ్యర్థులు ముందుకు వస్తారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విమర్శకులు.

పదేళ్ల నుంచి అడపాదడపా కనిపిస్తున్న ఏపీలోనే జనసేనకు సరైన గుర్తింపు లేదు.. అలాంటిది ఇక తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అంటున్నారు. అంతేకాక అసలు టీడీపీ ఉనికే లేని తెలంగాణలోనే 32 సీట్లు కేటాయిస్తే.. ఇక అంతో ఇంతో బలమున్న ఏపీలో కనీసం పాతిక సీట్లైనా ఇస్తారా అంటూ సైటర్లు వేస్తున్నారు. మరీ 32 సీట్లతోనే జనసేన ఎలా సరిపెట్టుకుంటుంది అంటూ ఎద్దేవా చేస్తున్నారు విమర్శకులు. మరి దీనిపై జనసేన నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Show comments