Idream media
Idream media
రాజకీయంగా అత్యంత క్లిష్టమైన దశలో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు 2024 సాధారణ ఎన్నికలే చివరివన్న భావన టీడీపీ శ్రేణుల్లోనూ నెలకొంది. రాజకీయ జీవితం చరమాంకంలో ఉన్న చంద్రబాబు.. రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అనేక వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఎత్తులతోపాటు పొత్తుల రాజకీయానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన జనసేనను, ఆ పార్టీ ద్వారా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే ఆశతో ఉన్నట్లు బాబు ప్రయత్నాల ద్వారా అర్థమవుతోంది. ముఖ్యంగా దూరమైన కాపులను దగ్గరకు చేర్చుకోవాలనే లక్ష్యంతో చంద్రబాబు ఉన్నారు. పవన్ కల్యాణ్ ఇటీవలి రాజకీయం, వ్యాఖ్యలు కూడా టీడీపీకి దగ్గరవుతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి.
2014 ఎన్నికల్లో అలవిగాని హామీలతోపాటు కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ హామీ వల్ల టీడీపీ అధికారంలోకి వచ్చిందనేది విశ్లేషకుల అంచనా. జనసేన అధినేత పవన్ టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వడంతో మెజారిటీ కాపు సామాజికవర్గం టీడీపీకి మద్దతుగా ఉన్నట్లు అప్పట్లో విశ్లేషణలు సాగాయి. అవి కొంత వరకు నిజం కూడా. అయితే కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ హామీ అమలు చేయకపోవడం, హామీ అమలు చేయాలని ఉద్యమం చేసిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని వేధించడం, అవమానించడం వంటి చర్యలతోపాటు కాపుల సంక్షేమం కోసం వైఎస్ జగన్ స్పష్టమైన వైఖరితో ఉండడంతో.. వారందరూ 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ఉన్నారు. ఒంటరిగా పోటీ చేసిన టీడీపీ ఘోరంగా ఓడిపోయింది.
Also Read : Mudragada Chandrababu Letter – మీ పతనం చూసేందుకే బ్రతికి ఉన్నా.. చంద్రబాబుకు ముద్రగడ సంచలన లేఖ
గత అనుభవాల దృష్ట్యా మళ్లీ జనసేనను, బీజేపీని కలుపుకుని 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని చంద్రబాబు పొత్తుల వ్యూహాలు రచిస్తున్నారు. అవి ఎంత మేరకు సఫలమవుతాయో ఇప్పుడే చెప్పలేం. ఎన్నికలకు ముందు మాత్రమే పోటీ, పొత్తులపై స్పష్టత వస్తుంది. అయితే జనసేన ద్వారా కాపుల మద్దతు పొందాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలకు కాపు ఉద్యమ మాజీ నేత ముద్రగడ పద్మనాభం ద్వారా గండిపడే అవకాశాలు ఉన్నట్లు తాజాగా ఆయన రాసిన లేఖ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.
మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి అడుగుపెడతానని చంద్రబాబు శపథం చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. అలాంటి శపథాలు చేయొద్దని ముద్రగడ సూచించారు. ‘‘అవి సాధించే వారు ఇందిరా గాంధీ, ఎన్‌టీ రామారావు, జయలలిత, మమతాబెనర్జీ మాత్రమే. తమరికి (చంద్రబాబు), నాకు అవి ” నీటి మీద రాతలే ’’ నంటూ ముద్రగడ లేఖలో పేర్కొనడం రాజకీయంగా చర్చకు దారితీసింది. ముద్రగడ చేసిన వ్యాఖ్యలు భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సూచికగా చెప్పవచ్చు. తనకు, తన కుటుంబానికి జరిగిన అవమానాన్ని ఈ లేఖలో గుర్తు చేసిన ముద్రగడ.. రాబోయే రోజుల్లోనూ సందర్భానుసారం ఈ అంశాలు ప్రస్తావించే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే.. 2024 ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుని కాపుల మద్దతు పొందాలనుకుంటున్న చంద్రబాబు ఆశలకు గండిపడే ప్రమాదం లేకపోలేదు.
Also Read : TDP, Mudragada, Chinarajappa – ముద్రగడ లేఖ.. టీడీపీలో ఉలుకెందుకు..?