పొత్తు కుదిరితే.. టీడీపీ మాజీ ఎమ్మెల్యేల‌కు తిప్ప‌లే..!

ద‌శాబ్దకాలం పాటు వైఎస్ జ‌గ‌న్ వేగాన్ని అడ్డుకోవ‌డం క‌ష్ట‌మేన‌ని ప‌లు అంశాలు రుజువు చేస్తున్నాయి. అలాంటిది వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ను ఒంట‌రిగా ఢీ కొట్ట‌డం తెలుగుదేశం పార్టీ వ‌ల్ల కాని ప‌ని. అందువ‌ల్లే ఎప్ప‌టి నుంచో బీజేపీ జ‌త కోసం టీడీపీ తెగ ప్ర‌య‌త్నాలు చేసింది. కానీ అవి ఫ‌లించ‌డం లేదు. ఇంకోవైపు పాత మిత్రుడు పవన్ కళ్యాణ్ కి కూడా గాలం వేస్తూనే ఉంది. అది కూడా ఏం తేల‌డం లేదు. పైగా బీజేపీ – జ‌న‌సేన క‌లిసి పనిచేస్తున్నాయి. బ‌ద్వేలు ఉప ఎన్నిక పుణ్య‌మా అని టీడీపీకి ఓ అవ‌కాశం ద‌క్కింది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పిలుపున‌కు స్పందించి ఎన్నిక నుంచి త‌ప్పుకోవ‌డం ద్వారా రెండు విధాలుగా ఆ పార్టీకి మేలు జ‌రిగింది. ఓట‌మి ఎలాగూ త‌ప్ప‌దు. గ‌తం కంటే ఘోరంగా ఓడిపోతే ఉన్న ప‌రువు కూడా పోతుంది. మ‌రోవైపు ప‌వ‌న్ కు ద‌గ్గ‌ర‌య్యే అవ‌కాశం కూడా దొరికింది. దీంతో టీడీపీ జనసేన పార్టీలో కూటమిగా ఏర్పడుతాయనే ప్రచారం ఊపందుకుంటోంది. ఈ ప్ర‌చారం టీడీపీలోని కొంద‌రికి గుబులు రేపుతోంది.

ఎందుకంటే..

న‌వ్యాంధ్ర ప్ర‌దేశ్ తొలి ఎన్నిక‌ల్లో జనసేన అధినేత ప‌వ‌న్ అధికారికంగా టీడీపీ కి మద్దతు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో పవన్ సాయంతోనే అధికారంలోకి వచ్చామని టీడీపీ నేతలు ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు. వచ్చే ఎన్నికల్లో కూడా అధికారంలోకి రావాలంటే ఒంటరి వెళ్తే ప్రయోజనం ఉండదనే భావనలో టీడీపీ నేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే జనసేన బీజేపీతో కలిసి పనిచేస్తోంది.

Also Read : చంద్ర‌బాబు రెండు స్థానాల్లో పోటీ చేయ‌నున్నారా?

జనసేన టీడీపీ కలిసి కూటమిగా ఏర్పడితే బీజేపీ పరిస్థితి ఏమిటనే అనుమానం రావచ్చు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పట్టుమని పది స్థానాల్లో కూడా ఆ పార్టీ విజయం సాధించలేదు. అందువల్ల ఆ పార్టీతో పొత్తుపెట్టుకుంటే పెద్దగా ప్రయోజనం ఉందనే భావనలో టీడీపీ – జనసేన ఉన్నట్లు తెలుస్తోంది.పైగా మూడు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేస్తే సీట్ల సర్ధుపాటు కూడా సమస్యగా మారే అవకాశం ఉందనే వాదన ఒకటి వినిపిస్తోంది. అందువల్ల వచ్చే ఎన్నికల నాటికి జనసేన టీడీపీ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయనే వార్తలు కొంతకాలం విన్పిస్తున్నాయి.

ఇటీవల పవన్ తన సామాజిక వర్గాన్ని ఏకం చేసేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. ఇక నుంచి తాను రాజ‌కీయాలు మొద‌లుపెడ‌తాన‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్, దానిలో భాగంగా కాపు సామాజిక వర్గానికి దగ్గర అయ్యేందుకు పావులు కదుపుతున్నారు. కాపు సామాజికవర్గంపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలు ఈ వాదనకి బలాన్ని చేకూర్చుతున్నాయి. కాపులను ఆకట్టకునేందుకు.. కాపు రిజర్వేషన్‌పై పవన్ గళమెత్తుతారని జనసేన నేతలు చెబుతున్నారు. జిల్లాల వారిగా కాపులతో సమావేశాలు నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లాలని జనసేన వ్యూహం రచిస్తోందని తెలుస్తోంది.

గత ఎన్నికల్లో కాపు సామాజికవర్గం కూడా వైసీపీ కి మద్దతుగా నిలిచింది. దీంతో ఆ సామాజికవర్గ ఓట్లు టీడీపీ పడలేదని తెలుస్తోంది. మిగిలిన కొందరి ఓట్లు జనసేన ఖాతాలో పడ్డాయి. ఈ వర్గాన్ని సొంతం చేసుకుని పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకునేందుకు జనసేన ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ పరిణామాలను గమనించిన టీడీపీ జనసేనతో జ‌త కోసం ఎదురుచూస్తోంద‌న్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడ టీడీపీకి మరో సమస్య ఎదురవుతోంది. జనసేనతో పొత్తు పెట్టుకుంటే అత్యధిక సీట్లు డిమాండ్ చేసే అవకాశం ఉందనే గుబులు టీడీపీలో మొదలైందనే ప్రచారం జరుగుతోంది. దాని వ‌ల్ల కొందరు మాజీ ఎమ్మెల్యేలు సైతం తమ స్థానాలను కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని మ‌ద‌న‌ప‌డుతుంటే, గెలుపు అవ‌కాశాలు క‌ష్టంగా ఉన్న స‌మ‌యంలో అదే మంచిద‌నే ఆలోచ‌న‌లో మ‌రికొంద‌రు ఉన్నారు. మ‌రి ఏం జ‌ర‌గ‌నుందో వేచి చూడాలి.

Also Read : వర్ల రామయ్య వారసుడికి నియోజకవర్గ బాధ్యతలు

Show comments