Idream media
Idream media
ప్రశాంతంగా ఉన్న పల్నాడులో మళ్లీ అలజడి రేగింది. గుంటూరు జిల్లా పల్నాడులో విజయమే లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ అధినేత గ్రామ కక్షలను మళ్లీ పెంచుతున్నారు. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎదుర్కొనేందుకు.. సరైన అభ్యర్థి కోసం దాదాపు మూడేళ్లు అన్వేషించిన చంద్రబాబు.. చివరికి గతంలో రెండు సార్లు పోటీ చేసి పిన్నెల్లి పై ఓడిపోయి, రాజకీయంగా ఉనికిలో లేని జూలకంటి బ్రహ్మారెడ్డిని ఇంఛార్జిగా నియమించారు. 2001లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాచర్ల ఏడు హత్యల కేసులో ప్రధాన నిందితుడుగా బ్రహ్మారెడ్డి ఉన్నారు.
ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న బ్రహ్మారెడ్డి మళ్లీ టీడీపీ నియోజకవర్గ పగ్గాలు చేపట్టడంతో.. మాచర్ల నియోకవర్గంలోని గ్రామాల్లో రాజకీయ కక్షలు మళ్లీ పురుడుపోసుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మాచర్ల నియోజకవర్గం, బ్రహ్మారెడ్డి సొంత మండలం వెల్దుర్తిలోని గుండ్లపాలెంలో టీడీపీ గ్రామ నేత చంద్రయ్య హత్య జరిగింది. గ్రామ కక్షల నేపథ్యంలో ప్రత్యర్థుల చేతిలో చంద్రయ్య హత్యకు గురయ్యారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. మూడేళ్లుగా పల్నాడులో ప్రశాంతమైన వాతావరణం ఉంది. అయితే మాచర్ల టీడీపీ ఇంఛార్జిగా జూలకంటి బ్రహ్మారెడ్డి వచ్చిన తర్వాత.. గ్రామాల్లో కవ్వింపు చర్యలు మొదలయ్యాయి. టీడీపీ నేతలు, వైసీపీ నేతలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, వైసీపీ ప్రభుత్వ పాలనపై విమర్శలు చేయడం ఇటీవల నిత్యకృత్యమైంది. ‘‘బ్రహ్మారెడ్డి వచ్చాడు రా.. ఇక రండి రా చూసుకుందాం ’’ అనే రెచ్చగొట్టే వ్యాఖ్య నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో టీడీపీ నేతల నోటి వెంట వచ్చిందంటే.. మాచర్లలో బ్రహ్మారెడ్డి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితి తలెత్తిందో అర్థం చేసుకోవచ్చు.
రాజకీయంగా అశాంతిని సృష్టించడం, కక్షలు పెంచి పోషించడం ద్వారానే.. పల్నాడులో ఉనికిని కాపాడుకోవాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నాడనేందుకు తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయమే నిదర్శనం. చంద్రయ్య హత్యను రాజకీయం కోసం ఉపయోగించుకోవాలని, పిన్నెల్లి, సీఎం వైఎస్ జగన్, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయాలనే లక్ష్యాన్ని చంద్రబాబు పెట్టుకున్నట్లుగా ఉన్నారు. అందుకే గుండ్లపాలెం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చంద్రయ్య హత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తారు. నిజానిజాలు ఏమిటో, దోషులు ఎవరో విచారణలో తేలుతుంది. అయితే ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే అక్కడకు చంద్రబాబు వెళ్లాలనుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటో సులువుగానే అవగతమవుతోంది.
Also Read : మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా జూలకంటి బ్రహ్మారెడ్డి