TDP Ex.Minister – ఆ నేతల బలం అధికారమనే గొడుగు,అది లేకుంటే…

టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో జిల్లా పార్టీలో ఆయన చెప్పిందే శాసనం. సొంత జిల్లాలో ఆయన మాట కాదనే నాయకుడు లేడు. నియోజకవర్గంలో వ్యతిరేకత ఉన్నా సరే ఆయనను కాదని మరొకరికి సీటు ఇచ్చే ధైర్యం కూడా ఆ పార్టీ అధినేత చేయలేని పరిస్థితి. ఆర్థికంగా బలమైన నేత…పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కోరిన మంత్రి పదవి… పార్టీ అధినేతను తిడుతున్నా… కనీసం స్పందించకపోయినా ఆయనను ప్రశ్నించలేని నాయకత్వం.రాజకీయంగా జిల్లాలో పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నా బయటకు రాక పోయినా అసలేం జరుగుతోంది అనేది కూడా కనీసం ఆరా తీసే ప్రయత్నం చేయలేని అధిష్టానం.

గుంటూరు జిల్లా టిడిపి అగ్రనేతగా చెప్పుకునే ప్రత్తిపాటి పుల్లారావు విషయంలో పైన పేర్కొన్న అంశాలు కచ్చితంగా జరిగాయి… జరుగుతున్నాయి.దివంగత మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట నియోజకవర్గంతో పాటుగా సొంత జిల్లాలో కూడా తన మార్కు వేశారు. 2014లో టీడీపీ పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో పార్టీకి ఆర్థికంగా సహకరించారనే కారణమో లేక మరేదైనా కారణం ఉందో తెలియదు కాని ఆయనకు కీలక శాఖను అప్పగించారు చంద్రబాబు నాయుడు.

2017లో మంత్రివర్గంలో కాస్త మార్పులు చేర్పులు జరగడంతో ప్రాధాన్యత లేని శాఖ దక్కినా, మంత్రి వర్గంలో మాత్రం ఆయనకు ఎక్కడా కూడా ఇబ్బంది రాలేదు. సొంత నియోజకవర్గంలో స్థానిక నాయకులను ప్రోత్సహించడం లేదని ఆరోపణలు ఉన్నా, కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా కనీసం స్పందించడం లేదన్న అసంతృప్తి జిల్లా నాయకులలో ఉన్నా సరే కనీసం చంద్రబాబు నాయుడు పిలిచి అడగలేని పరిస్థితి అప్పట్లో ఉండేది.

Also Read : Galla Jayadev – అమరావతి పాదయాత్ర ముగింపు సభలో ఆ ఎంపీ పాల్గొనేనా ?

గుంటూరు జిల్లాలో ఉన్న కీలక నాయకత్వం ఆయన మాట విన్నా సరే ఆయన మాత్రం 2019 నుంచి సైలెంట్‌గానే ఉంటున్నారు.నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు,మాజీ మంత్రి ఆలపాటి రాజా సహా కొంతమంది జిల్లాల్లో వైసీపీ ప్రభుత్వంపై బలంగా గళమెత్తే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే  పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేసే విధంగా అడుగులు వేస్తున్నా,గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అప్పుడప్పుడు మీడియా సమావేశాన్ని పెడుతున్నా… ప్రత్తిపాటి పుల్లారావు మాత్రం బయటకు వచ్చి మాట్లాడక పోవడం పట్ల ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దీనికి ప్రధాన కారణం ఏంటనేది తెలియకపోయినా టీడీపీ నాయకులు ఆ పార్టీ అధిష్టానం కూడా ఆయనను కనీసం పలకరించే ప్రయత్నం చేయటం లేదు. పార్టీ మారతారు అని కొంతమంది ప్రచారం చేసిన ప్రత్తిపాటి పుల్లారావు నుంచి కనీస స్పందన లేదు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే విడుదల రజిని దూకుడుగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నా సరే కనీసం పార్టీ క్యాడర్‌కు ధైర్యం కల్పించే ప్రయత్నం ప్రత్తిపాటి పుల్లారావు చేయలేకపోతున్నారు. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో బలమైన నాయకుడుగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా సరే బయటికి వస్తారు అని భావించారు.

తనమీద అమరావతి భూములకు సంబంధించి సిఐడి కేసులు నమోదు చేసిన సందర్భంలో మాత్రమే బయటకు వచ్చిన ప్రత్తిపాటి పుల్లారావు ఆ తర్వాత ఎక్కడున్నారు ఏంటి అనేది క్లారిటీ లేదు. జిల్లాలో ఉన్న అందరు నాయకులు అమరావతి ఉద్యమం కోసం ముందుకు వస్తే ఆయన మాత్రం సైలెంట్‌గా ఉండటం పట్ల టీడీపీ నాయకులలోనే భిన్నాభిప్రాయాలున్నాయి. దీంతో ప్రత్తిపాటి పుల్లారావు రాజకీయ భవిష్యత్తు ఏమిటనే దానిపై ఆ పార్టీ నాయకులకు కూడా క్లారిటీ రావడం లేదు. ఒకప్పుడు తన వద్ద రాజకీయం నేర్చుకున్నా విడుదల రజిని ఎమ్మెల్యేగా దూకుడుగా ఉంటే ఆమెకు రాజకీయ గురువుగా వ్యవహరించిన ప్రత్తిపాటి పుల్లారావు ఇప్పుడు సైలెంట్‌గా ఉండటం పట్ల జిల్లా టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : TDP, Prathipati Pulla Rao – విమర్శకు ఓ హద్దుంటుంది పుల్లారావు..

Show comments