Chandrababu- చివరి అస్త్రాన్ని ప్రయోగించడం మొదలు పెట్టిన చంద్రబాబు

విప్లవాత్మక సంస్కరణలతో గ్రామాలకు పాలనను తీసుకురావడం, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వైసీపీ సర్కార్‌ను ఎదుర్కొనేందుకు రెండున్నరేళ్లలో టీడీపీ అపసోపాలు పడింది. అయినా ఫలితం లేదని స్థానిక సంస్థల ఫలితాలతో తేలిపోయింది. దీంతో చంద్రబాబు రూటు మార్చారు. తన భార్యను తిట్టారంటూ ఇటీవల ఏడ్చిన చంద్రబాబు.. మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వెళతాననే శపథాలు చేశారు. తాము ఏమీ అనలేదని, ఆమె పేరు కూడా ఉచ్ఛరించలేదని, తాను అవమానకరంగా మాట్లాడినట్లు నిరూపిస్తే కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెబుతానని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చెప్పినా.. అవేమీ పట్టించుకోని టీడీపీ.. నందమూరి కుటుంబ సభ్యులతో మీడియా సమావేశం పెట్టించి మాట్లాడించింది.

తన భార్యను తిట్టారంటూ చంద్రబాబు సానుభూతి కోసం రాజకీయాలు చేస్తున్నారని, రాబోయే రోజుల్లోనూ ఇదే విషయం చెప్పి ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు యత్నిస్తారనే అనుమానాలను వ్యక్తం వైసీపీ వ్యక్తం చేసింది. వైసీపీ ఊహించిన విధంగానే… చంద్రబాబు సానుభూతి రాజకీయానికి ఎవరూ ఊహించని విధంగా వేగంగా తెరలేపారు. వరద జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు.. నిన్న వైఎస్సార్‌ కడప జిల్లాలో పర్యటించారు. ఈ రోజు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న చంద్రబాబు.. తన భార్యను తిట్టారంటూ చెబుతూ.. అదే మిమ్మల్ని తిడితే బాధపడరా..? అంటూ మహిళలను రెచ్చగొడుతున్నారు.

Also Read : Nani ,Vamsi -కొడాలి నాని ,వంశీ మరికొందరు ఎమ్మెల్యే లకు భద్రత పెంపు

’’ నేను అసెంబ్లీకి పోతే ఎగతాళి చేస్తున్నారు. తిట్టినా మీ కోసం భరించాను. అసెంబ్లీలో నాపై వ్యక్తిగతంగా దాడి చేశారు. ఎన్టీఆర్, నేను 22 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాం. నా భార్య ఎప్పుడైనా బయటకు వచ్చారా..? ఆవిడ వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారు. అలిపిరిలో 22 బాంబులు వేశారు. అప్పుడు భయపడలేదు. నేను మనిషినే. ఒక భార్యకు భర్తను. అలాంటి త్యాగాలు చేసిన వ్యక్తికి అవమానం జరిగితే.. స్పందించాను. మీ భార్యకు, మీ చెల్లికి జరిగితే మీరు బాధ పడరా..? మీరు ఓట్లేసి, ప్రతిపక్షంలో పెట్టింది వారు తిడితే పడమనా..? సభలో నాకు మైక్‌ ఇవ్వలేదు. కౌరవ సభ ఇది. గౌరవ సభ కాదు. గౌరవ సభ ఏర్పాటు చేసిన తర్వాత వస్తానని చెప్పాను. ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటానని వచ్చాను. అందుకే మీ వద్దకు వచ్చాను. 40 ఏళ్లుగా సంక్షోభాలను ఎదుర్కొన్నాను. నేను బాధ పడితే ప్రజలకు నష్టం జరుగుతుందని, ముందుకు పోవాలని వచ్చాను. ప్రతి ఒక్క ఆడబిడ్డ ఆలోచించాలి. మిమ్మల్ని అవమానంగా మాట్లాడితే ఎలా ఉంటుంది. రాజకీయాలు అసహ్యంగా తయారయ్యాయి’’ అంటూ చంద్రబాబు వరద ప్రాంతాలలో ప్రసంగిస్తున్నారు.

భవిష్యత్‌ కాపాడే బాధ్యత ప్రజలదట..

2019 ఎన్నికల్లో ‘మీ భవిష్యత్‌.. నా బాధ్యత’ ప్రచారం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు రూటు మార్చారు. టీడీపీ భవిష్యత్‌ను కాపాడే బాధ్యత ప్రజలదని అంటున్నారు. ‘‘ కుప్పం ఒక చిన్న మున్సిపాలిటీ. నేను ఓడిపోయానంట. పెద్ద మగాళ్లు, పుడింగులు వీళ్లు. దొంగ ఓట్లు వేశారు. దౌర్జన్యం, రౌడీయిజం చేశారు. ఐదు కోట్ల తెలుగు ప్రజలు ఆలోచించాలి. ఒక మహనీయుడు పెట్టిన పార్టీ టీడీపీ. నేను ఇక్కడకు రాకపోతే వీళ్లు (అధికార పార్టీ నేతలు) కూడా రారు. భవిష్యత్‌ను కాపాడే బాధ్యతను ప్రజల భుజస్కంధాలపై పెడుతున్నాను. కౌరవ సభను, గౌరవ సభగా మార్చేందుకు మీ వద్దకు వచ్చాను’’ అంటూ చంద్రబాబు 2024 ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటి నుంచే చేయడం మొదలు పెట్టారు. బాబు తీరు చూస్తుంటే.. ఇక ప్రతి సందర్భంలోనూ తన భార్యను అవమానించారంటూ తయారు చేసిన ఎపిసోడ్‌ను వినిపించబోతున్నారని తెలుస్తోంది.

Also Read : AP Floods, CM Jagan Letter – వరద ముంచెత్తింది.. ఆదుకోండి.. ప్రధానికి సీఎం లేఖ

Show comments