Chandrababu Kuppam Tour – సర్వశక్తులు ఒడ్డుతున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ కారణాలతో ఎన్నికలు ఆగిపోయిన మున్సిపాలిటీలు దాదాపు 30 వరకు ఉన్నాయి. ఇందులో 12 మున్సిపాలిటీలకు సంబంధించిన సమస్యలు, కోర్టు వివాదాలు సమసిపోయాయి. వీటికి ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కసరత్తులు మొదలుపెట్టింది. 12 మున్సిపాలిటీల్లో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని కుప్పుం మున్సిపాలిటీ కూడా ఉంది. ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్‌ బూత్‌ల ఎంపిక, ఆర్‌వో, ఏఆర్‌వోల నియామకం పూర్తయింది. ఇక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడమే తరువాయి.. ఏపీలో మినీ మున్సిపోల్‌కు నగారా మోగినట్లే.

ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత.. పరిషత్‌ ఎన్నికల్లో నామినేషన్లు వేసినా.. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసినా.. ఫలితం మారలేదు. మునుపటి కన్నా పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న బద్వేలు ఉప ఎన్నికల్లో అభ్యర్థిని ప్రకటించినా.. నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత పోటీ నుంచి తప్పుకుంటున్నామని చంద్రబాబు ప్రకటించారు. ఈ క్రమంలో త్వరలో జరగబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో చంద్రబాబు పార్టీ పోటీ చేస్తుందా..? లేదా..? అనే సందేహలు నెలకొన్నాయి. వీటికి తెరదించేలా చంద్రబాబు ఈ రోజు, రేపు (29, 30 తేదీలు) కుప్పుంలో పర్యటిస్తున్నారు. ఎన్నికలకు క్యాడర్‌ను సిద్ధం చేస్తున్నారు.

Also Read : Lokesh In The View Of ABN RK – పాపం లోకేష్… రాధాక్రిష్ణ కూడా తీసిపారేశాడుగా!

చంద్రబాబు కుప్పుం పర్యటనలో కేవలం కుప్పం మున్సిపాలిటీ వరకే పరిమితం కాబోతోంది. కేవలం మున్సిపల్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు పర్యటన సాగుతోంది. కుప్పం పట్టణంలో రోడ్‌షో తర్వాత ఈ రోజు సాయంత్రం ఆయన పట్టణంలో వివిధ ప్రాంతాలలో ఉన్న టీడీపీ కార్యకర్తల ఇళ్లకు నేరుగా వెళ్లి వారిని కలవబోతున్నారు. వీలైనంత ఎక్కువ మందిని కలవాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. రేపు కూడా పట్టణంలో వివిధ ప్రాంతాలలో రోడ్‌షోలు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.

పంచాయతీ, పరిషత్‌ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా చంద్రబాబు మున్సిపల్‌ ఎన్నికలకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో 89 స్థానాలకు గాను వైసీపీ 75 స్థానాలను గెలుచుకుంది. ఇక ఎంపీటీసీ ఎన్నికల్లో కుప్పం మండలంలో టీడీపీ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. 1989 నుంచి 2019 వరకు 7 వరుస ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు, కుప్పంను తనకు కంచుకోటగా మార్చుకున్నారు. అయితే ఈ ఏడాది వచ్చిన స్థానిక ఎన్నికల ఫలితాలతో ఆ కంచుకోటకు బీటలు వారే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికల్లోనూ పంచాయతీ, పరిషత్‌ ఎన్నికల ఫలితాలే వస్తే.. 2024 అసెంబ్లీ ఎన్నికలకు బాబు పరిస్థితి మరింతగా దిగజారే అవకాశం ఉంది. అందుకే మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచి.. నియోజకవర్గంలో పట్టును కోల్పోకుండా ఉండేందుకు చంద్రబాబు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మరి ఆయన ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

Also Read : TDP CBN Lokesh-లోకేష్‌తో న‌ష్ట‌మేన‌ని బాబు కూడా భావిస్తున్నారా?

Show comments