Technical Committee – పెగాసస్‌ దుమారం : తేల్చేందుకు సిద్ధమైన సుప్రీం కోర్టు

ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్‌ స్పైవేర్‌ తో దేశంలోని రాజకీయ నేతలు, న్యాయవాదులు, జర్నలిస్టులు, వ్యాపార, పౌర ప్రముఖలపై కేంద్ర ప్రభుత్వం నిఘాపెట్టిందనే ఆరోపణలపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు దేశ సర్వోత్తమ న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీచేసింది. నిఘా వ్యవహారంపై వచ్చిన ఆరోపణలను పరిశీలించి, నిజాలు వెల్లడించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.వి.రవీంద్రన్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం ప్రకటించింది. ఈ కమిటీలో రవీంద్రన్‌తోపాటు అలోక్‌జోషి, సందీప్‌ ఒబెరాయ్‌లు సభ్యులుగా ఉంటారని తెలిపింది. కమిటీ ఏర్పాటు సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. పౌరుల గోప్యతను కాపాడుకోవడం ముఖ్యమని సుప్రీం వ్యాఖ్యానించింది. పౌరులపై నిఘాలో విదేశీ ఏజెన్సీల ప్రమేయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోందని సుప్రీం పేర్కొంది. పెగాసస్‌ పై వచ్చిన ఆరోపణలను నిపుణుల కమిటీ క్షుణ్నంగా పరిశీలించి, నిజానిజాలతో నివేదిక ఇస్తుందని పేర్కొంది. కమిటీ పనితీరును తాము పర్యవేక్షిస్తామని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.

పెగాసస్‌ నిఘా వ్యవహారంపై నిజాలు నిగ్గుతేల్చాలని, ఈ అంశంపై దర్యాప్తు చేయించాలంటూ పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ అంశంపై అటు పార్లమెంట్‌లోనూ, ఇటు బయట ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాలు స్పందించేందుకు ఇష్టపడలేదు. పార్లమెంట్‌ సమావేశాలను ప్రతిపక్షపార్టీలు స్తంభింపజేసినా కేంద్ర నుంచి కనీస ప్రకటనకూడా కరువైంది. చివరికి నిఘా అంశంపై పూర్వాపరాలను సుప్రీం కోర్టుకు తెలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఇష్టపడలేదు. అది దేశ భద్రతకు సంబంధించిన అంశమంటూ తప్పించుకుంది. ఈ నేపథ్యంలోనే నిపుణుల కమిటీ ఏర్పాటుకు సుప్రీం కోర్టు గత నెల 13వ తేదీన నిర్ణయం తీసుకుంది. కమిటీ ఏర్పాటుపై తదుపరి విచారణలో ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది. అందుకు అనుగుణంగా ఈ రోజు పెగాసస్‌ నిఘా వ్యవహారంపై నిజాలను నిగ్గుతేల్చేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read : PK Prasanth Kishore – రాజకీయాలకు పనికిరానంటున్న పీకే

Show comments