Idream media
Idream media
ఏ పార్టీలో ఉన్నా సొంత పార్టీ వారిని కూడా తన మాటలతో చీల్చి చెండాడే రాజకీయ నేతలలో ముందు వరుసలో ఉండే వ్యక్తి ఆయనే. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న ఆయన మోడీ-అమిత్ షాల మీద ఒంటికాలిపై లేస్తున్న ఫైర్ బ్రాండ్,బెంగాల్ సీఎంతో భేటీ కావడమే కాకుండా తనదైన శైలిలో వ్యాఖ్యానించి కమలదళంలో కలకలం రేపాడు.
నిత్యం వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఇవాళ మరో సంచలనానికి తెరదీశారు.బీజేపీ పేరు వినిపిస్తే అగ్గిమీద గుగ్గిలం అయ్యే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఆయన ఢిల్లీలో భేటీ అయ్యారు.పైగా తమ కలయికపై ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో ఆయన తృణమూల్ కాంగ్రెస్ గూటికి చేరుతున్నారన్న ప్రచారం జోరందుకుంది.
బెంగాల్‌లో బిఎస్ఎఫ్ పరిధి పెంపు,రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రధాని మోడీతో చర్చించేందుకు సీఎం మమతా ఢిల్లీ వచ్చారు.ఇవాళ దేశ రాజధానిలో ఉన్న మమతా బెనర్జీని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కలిశారు. ఢిల్లీలోని టీఎంసీ ఎంపీ,దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇంట్లో మమతాతో ఆయన సమావేశమయ్యారు. సీఎం మమతా ప్రధానిని కలవడానికి కొన్ని గంటల ముందు సుబ్రమణ్యస్వామి వచ్చి ఆమెతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది.
ఇక మమతా బెనర్జీతో భేటీపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సుబ్రమణ్యస్వామి తనదైన శైలిలో జవాబిచ్చాడు. తృణమూల్ కాంగ్రెస్‌లో చేరుతున్నారా అని అడగగా,తాను ఇప్పటికే మమతా బెనర్జీతోనే ఉన్నానని వ్యాఖ్యానించారు. కొత్తగా తృణమూల్‌లో చేరాల్సిన అవసరం ఏముందని ఎదురు ప్రశ్నించారు. దీంతో ఆయన టీఎంసీలో చేరబోతున్నారనే ప్రచారం మరింత ఊపందుకుంది.
గత నెలలో నూతనంగా ఏర్పడిన బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి సుబ్రమణ్యస్వామిని తప్పించారు. దీంతో ఆయన పార్టీపై కినక వహించి బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న మమతకు మద్దతుగా పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సుబ్రమణ్యస్వామి మమతాని కలవడంతో ఆయన టీఎంసీలో చేరుతున్నట్లు ఢిల్లీ వీధుల్లో ప్రచారం సాగుతోంది.
తన ఢిల్లీ పర్యటన సందర్భంగా వివిధ పార్టీల అసంతృప్త నేతలకు పార్టీ తీర్థం ఇస్తూ మమతా బెనర్జీ రాజకీయ పక్షాలలో గుబులు లేపుతున్నారు.కాగా మాజీ ఎంపీలు,మాజీ మంత్రుల చేరికతో ఊపుమీదున్న టీఎంసీలో బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి చేరిక లాంఛనమేనా.? అనే ప్రశ్నకు త్వరలో జవాబు దొరికే అవకాశం ఉంది.
Also Read : Central Government- కేంద్రంపై ఎన్నికల ఒత్తిడి -ముడి చమురు అత్యవసర నిల్వల వెలికితీత