సోక్ర‌టీస్ చెప్పిన జీవిత సూత్రాలు

సోక్ర‌టీస్, చిన్న‌ప్ప‌టి నుంచి విన్న పేరు. 2500 ఏళ్ల క్రితం నాలుగు మంచిమాట‌లు చెప్పినందుకు విషం తాగించి చంపేశారు. మంచి చెబితే మ‌ర‌ణాన్ని రిట‌ర్న్ గిప్ట్‌గా ఇవ్వ‌డం మాన‌వజాతి స్వ‌భావం. క్రీస్తు ద‌గ్గ‌ర నుంచి గాంధీ వ‌ర‌కూ ఎవ‌ర్నీ వ‌ద‌ల్లేదు.

సోక్ర‌టీస్ పైన ఆరోప‌ణ‌లు ఏమంటే , బోధ‌న‌ల ద్వారా యువ‌కుల్ని చెడ‌గొడుతున్నాడ‌ని, మ‌తానికి వ్య‌తిరేకంగా మాట్లాడుతున్నాడ‌ని. ప్ర‌జాస్వామ్యంలో, అదీ డిజిట‌ల్ యుగంలో , రెండున్న‌ర వేల త‌ర్వాత కూడా మ‌తం గురించి మాట్లాడితే వెంటప‌డి వేధిస్తుంటే , అప్ప‌టి రాజ‌రికంలో ఏం జ‌రిగివుంటుందో ఊహించుకోవ‌చ్చు.

సోక్ర‌టీస్ నుంచి నేర్చుకోవాల్సిన విష‌యాలు చాలా వున్నాయి. కాలం ఏదైనా మ‌నిషి ఒక‌టే. సైన్స్ ఎదిగింది కానీ, మ‌నిషి ఇంకా ఎద‌గ‌లేదు. ఆయ‌న ప్ర‌తి మాట అద్భుతం. అయితే ఆచ‌రించ‌డం సాధ్య‌మా? ఇది ఎవ‌రికి వాళ్లు వేసుకోవాల్సిన ప్ర‌శ్న‌.

Also Read:లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌

విషం పాత్ర తాగ‌డానికి రెండుగంట‌ల ముందు కూడా సోక్ర‌టీస్ సంగీతం నేర్చుకున్నాడు. చివ‌రిక్ష‌ణం వ‌ర‌కు మ‌నిషి నేర్చుకుంటూ వుండాల్సిందే అంటాడు. మ‌నం కూడా నిరంత‌రం నేర్చుకోవాలి. పాఠం నేర్చుకోక‌పోతే గుణ‌పాఠాలు మిగులుతాయి.

సోక్ర‌టీస్ చెప్పిన జీవిత సూత్రాలు

1.మాన‌సికంగా బ‌ల‌వంతులు, ఆలోచ‌న‌ల గురించి చర్చిస్తారు.
సాధార‌ణ వ్య‌క్తులు సంఘ‌ట‌న‌ల గురించి చ‌ర్చిస్తారు.
బ‌ల‌హీనులు ఇత‌రుల గురించి మాట్లాడ్తారు.
మ‌నం ఏ కోవ‌కు చెందుతామో మ‌న‌కే తెలుసు.

2.ద‌య‌తో ఉండండి
మీరు క‌లుసుకుంటున్న ప్ర‌తి వ్య‌క్తి జీవితంతో పోరాడుతున్న వాడే.

కూర‌గాయ‌ల వాళ్లు, ఆటో డ్రైవ‌ర్ల ద‌గ్గ‌ర బేరం ఆడుతున్న‌ప్పుడు రెస్టారెంట్లో 2 వేలు బిల్లు చేసి , 10 రూపాయ‌ల టిప్ ద‌గ్గ‌ర వెనుకాడుతున్న‌ప్పుడు ఈ మాట‌లు గుర్తు చేసుకోండి.

3.నిజ‌మైన జ్ఞానం ఏమంటే
మ‌న‌కి ఏమీ తెలియ‌ద‌ని తెలుసుకోవ‌డ‌మే.
ఎక్కువ తెలుసుకునే కొద్దీ మ‌న‌కు తెలిసింది శూన్యం అని గుర్తిస్తాం.

జీవితంలో దీనంత క‌ష్టం ఇంకొక‌టి లేదు. ప్ర‌తివాడూ చాలా తెలుసున‌ని న‌మ్ముతాడు. మిడిమిడి జ్ఞానం రంగం మీద ఉన్న‌ప్పుడు జ్ఞానం తెర‌చాటుకు వెళ్లిపోవాల్సిందే. తెలియ‌ద‌ని మ‌నం ఒప్పుకోవ‌డం , ఎదుటి వాన్ని ఒప్పించ‌డం రెండూ జ‌ర‌గ‌ని ప‌నులు.

ర‌చ‌యిత‌లు, క‌ళాకారులు, విద్వాంసులు, పండితులు, స్వాములు, యోగులు, గురువులు అంద‌రూ త‌మ‌కు చాలా తెలుసు అనుకుంటూ వుంటే , ఏమీ తెలియ‌ద‌ని తెలుసుకోవ‌డ‌మే జ్ఞాన‌మ‌ని సోక్ర‌టీస్ చెబితే అప్పుడు విషం తాగించారు. ఇప్పుడైతే ఎన్‌కౌంట‌ర్ చేస్తారు.

4.ప‌రీక్ష‌కి నిల‌బ‌డ‌ని జీవితం విలువైంది కాదు.

మ‌న గురించి చాలాగొప్ప‌గా అనుకుంటూ వుంటాం. ప‌రీక్షా స‌మ‌యం వ‌స్తే తెలుస్తుంది మ‌నం ఏంటో. వేదిక‌ల మీద మాన‌వ‌త్వం గురించి , మాన‌వ సంబంధాల గురించి ఉప‌న్యాసాలు ఇచ్చే వాళ్లంతా క‌రోనా స‌మ‌యంలో త‌లుపులు మూసుకు కూచుంటే , సాధార‌ణమైన వ్య‌క్తులు ల‌క్ష‌లాది మందిని ఆదుకుని అన్నం పెట్టారు. జీవితంలో స‌క్సెస్ సాధించామ‌ని అనుకున్న వాళ్లంద‌ర్నీ క‌రోనా ఫెయిల్ చేసింది.

5.మంచి భార్య దొరికితే సంతోషంగా జీవిస్తావు 
గ‌య్యాళి దొరికితే వేదాంతిగా మారుతావ్‌

సోక్ర‌టీస్ లాంటి గొప్ప వ్య‌క్తిని ప్ర‌పంచానికి ఇచ్చిన ఆయ‌న భార్య ఇంకా గొప్ప వ్య‌క్తి. ఫెమినిస్టులు లేని కాలంలో ఈ కొటేష‌న్ చెల్లింది కానీ, ఇప్పుడు చెల్ల‌దు. పైసా సంపాదించ‌కుండా, ఇల్లు ప‌ట్టించుకోకుండా తిరిగే మొగున్ని ఆమె మాత్రం ఎలా భ‌రిస్తుంది. ఆయ‌న నెత్తిన నీటికుండ బోర్లించ‌డం వెనుక ఎంత అస‌హ‌నం, ఆగ్ర‌హం వుందో! నాణానికి ఉన్న‌ట్టే ఫిలాస‌ఫీకి రెండో ముఖం వుంటుంది.

6.ప్ర‌పంచాన్ని మార్చాల‌నుకునేవాడు ముందు త‌న‌ను తాను మార్చుకోవాలి.

ఉద్యోగం చేసే భార్య ఏటీఎం కార్డు కూడా త‌మ జేబులో పెట్టుకుని తిరుగుతూ స్త్రీల హ‌క్కుల గురించి మాట్లాడే మేధావులు, మార్క్సిజం గురించి ట‌న్నుల కొద్దీ మాట్లాడుతూ డ్రైవ‌ర్ల‌కి జీతాలు పెంచ‌ని వాళ్లు, కోట్లు వెన‌కేసుకుని స‌మ‌స‌మాజం గురించి మాట్లాడే వాళ్లంద‌రికీ ఇది వ‌ర్తిస్తుంది.

Also Read:నిన్ను నువ్వు తెలుసుకో!

7.మ‌నుషులు రెండు ర‌కాలు
మూర్ఖుల‌మ‌నుకునే తెలివైన వాళ్లు.
తెలివైన వాళ్లం అనుకునే మూర్ఖులు.

నేను రెండో కేట‌గిరీ, సోక్ర‌టీస్ గురించి పూర్తిగా చ‌ద‌వ‌కుండానే ఇది రాస్తున్నా.

8.ప్ర‌శ్న‌ని అర్థం చేసుకుంటే స‌గం స‌మాధానం దొరికిన‌ట్టే.

మ‌న దేశంలో ప్ర‌జాస్వామ్యం ఉందా? లేదా? అర్థం చేసుకోడానికి ప్ర‌య‌త్నించ‌కండి. ముస‌లాళ్లు అయిపోతారు.

9.మాన‌వ జాతి వికాస‌మంతా  ప్ర‌శ్నించ‌డంలోనే ఇమిడి వుంది.

నిజ‌మే కానీ, ప్ర‌శ్నిస్తే బాస్‌ల ద‌గ్గ‌ర ఉద్యోగాలు పోతాయి. మ‌న సినిమాలో క‌థ ఎక్క‌డుంద‌ని అడిగితే డైరెక్ట‌ర్ వేరే ర‌చ‌యిత‌ని పెట్టుకుంటాడు. స్వామీజీలు, నాయ‌కులు , య‌జ‌మానులంద‌రూ ప్ర‌శ్న‌ని చంపాల‌ని చూసిన వాళ్లే. కానీ అది సోక్ర‌టీస్ కాలం నుంచి బ‌తికే వుంది.

10.నేను నీలాగా మాట్లాడుతూ బ‌తక‌డం కంటే నాలాగా మాట్లాడుతూ చ‌చ్చిపోతాను.

ఇది భ‌లే క‌ష్ట‌మ‌బ్బా. సాహిత్యం, క‌ళ‌లు, రాజ‌కీయాలు అన్నీ భ‌జ‌న మీదే బ‌తుకుతున్న‌ప్పుడు, నేను నాలా మాట్లాడితే పీక పిసికి చంపేస్తారు. స‌న్మానాలు జ‌రుగుతాయా? అవార్డులు, ప‌ద‌వులు వ‌స్తాయా? ఈ సోక్ర‌టీస్ ఉత్త అమాయ‌కుడు. బ‌త‌క‌డం తెలియ‌ని వాడు. అందుకే చంపేశారు.

సోక్ర‌టీస్‌ని చంపేసిన రాజుల పేర్లు ఎవ‌రికీ గుర్తు లేవు. రెండున్న‌ర వేల ఏళ్ల త‌ర్వాత కూడా సోక్ర‌టీస్ గుర్తున్నాడు. మ‌నిషి ఉన్నంతకాలం ఉంటాడు. ఎందుకంటే త‌న‌లా జీవించాడు కాబ‌ట్టి. స‌త్యం కోసం మ‌ర‌ణించాడు కాబ‌ట్టి.

Show comments