రాహుల్ బ్యాటింగ్ నువ్వే , కీపింగ్ నువ్వే, ఇంక బౌలింగ్ కూడా నువ్వే చేసుకో

బ్యాటింగ్ నువ్వే, కీపింగ్ నువ్వే, బౌలింగ్ కూడా నువ్వే చేసుకో అన్నా… అన్నా టార్గెట్ లో 80 శాతం కొట్టేసి వెళ్ళిపో అన్నా… మాకు నమ్మకం లేదు, ఆ బ్యాచ్ ని ఎక్కడ ఏరుకోచ్చావమ్మా సొట్ట బుగ్గల సుందరీ… పంజాబ్ టీం కెప్టెన్ కన్నూర్ లోకేష్ రాహుల్ గురించి సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ఇవి. ఏ మ్యాచ్ అయినా సరే… రాహుల్ ఆడితే టీం గెలిచినట్టు. లేదంటే టీం చాప చుట్టేసినట్టే. టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్ ఆడుతుంది లేదా లోయర్ ఆర్డర్ ఆడుతుంది అనుకునే అంత సీన్ ఆ టీంకి లేదు.

ఉండటానికి మంచి హిట్టర్ లే ఉన్నా… రాహుల్ చేసుకున్న దురద్రుష్టమో… లేక నిలకడ లేని ఆటగాళ్లను కొన్న టీం పాపమో గాని ఒక్కడు అంటే ఒక్కడు కూడా జట్టుకి అవసరమైన సమయంలో మేము ఉన్నాం రా బాబు అని ముందుకు వచ్చే పరిస్థితి లేకపోయింది. ఒక్కసారి పంజాబ్ ఈ సీజన్ లో ఆడిన గత మ్యాచ్ లు చూస్తే ఒకటి రెండు మ్యాచ్ లు మినహా రాహుల్ లేకపోతే టీం 50 పరుగులు కూడా చేయడం కష్టమే అనే అనుమానం కలగడం ఖాయం. ఒక్క మయాంక్ అగర్వాల్ మినహా ఏ ఒక్కడి నుంచి రాహుల్ కి సహకారం లేదు.

ఈ రోజు చెన్నై తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ బౌలర్లు చెన్నైని 134 పరుగులకు కట్టడి చేసారు. ఆ తర్వాత స్వల్ప లక్ష్య చేదనతో బరిలోకి దిగిన పంజాబ్ కు ఆదిలోనే మయాంక్ అగర్వాల్ వికెట్ తో దెబ్బ పడింది. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన షారుఖ్ ఖాన్ గాని, సర్ఫరాజ్ ఖాన్ గాని ఆదుకోలేదు. పంజాబ్ జట్టులో నాలుగు వికెట్ లు పడితే అందులో ఒక్కరు కూడా కనీసం 15 పరుగులు చేయలేదు. రాహుల్ కి కనీసం సహకారం అందలేదు. గత మ్యాచ్ ల అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న రాహుల్… తన విశ్వ రూపం చూపించాడు.

చెన్నై బౌలర్లను ఒక్క ఆట ఆడుకున్నాడు. 8 సిక్సులు ఏడు ఫోర్లతో ఉతికి ఆరేసాడు. రాహుల్ దెబ్బకు 13 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది పంజాబ్ జట్టు. ఇక గత మ్యాచ్ చూస్తే… బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు 165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేసిస్తే ఓపెనర్లుగా వచ్చిన అగర్వాల్, రాహుల్ ఇద్దరూ కలిసి 98 పరుగులు చేయగా ఆ తర్వాత వచ్చిన పూరాన్ గాని, మార్కరం గాని, సర్ఫరాజ్, షారుఖ్ గాని, ఏ ఒక్కడు కూడా ఆదుకోలేదు. మయాంక్ అవుట్ అయ్యే ముందు సాధించాల్సిన రన్ రేట్ 9 లోపే ఉన్నా సరే అవసరమైన రీతిలో ఆడలేకపోయింది పంజాబ్ టీం.

అంతకు ముందు కలకత్తాతో జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాగే చేసింది పంజాబ్ టీం. 166 పరుగుల లక్ష్యాన్ని నిర్దేసిస్తే… రాహుల్, అగర్వాల్ కలిసి 107 పరుగులు చేసారు. ఆ తర్వాత వచ్చిన పూరాన్, మార్కరం, హూడా అందరూ కలిపినా 60 పరుగులు చేయలేదు. రాహుల్, అగర్వాల్ సేఫ్ జోన్ లో మ్యాచ్ ను పెట్టడంతో బయటపడింది పంజాబ్ టీం. గత టోర్నీలో అదే తంతు ఈ టోర్నీలో కూడా అదే తంతు. రాహుల్ ని ఒక్కడ్ని అవుట్ చేసినా, మయాంక్ రాహుల్, జోడీని విడగోట్టినా పంజాబ్ ఓడిపోయినట్టే అనే అంచనాకు ప్రత్యర్ధులు వచ్చారు అంటే ఏ రేంజ్ లో రాహుల్ ఆట తీరు ఉందో అర్ధమవుతుంది. ఈ టీం ఇండియా యంగ్ ఓపెనర్… ఫ్యూచర్ లో ఇదే విధంగా రాణించాలని పంజాబ్ అభిమానులు కోరుకుంటున్నారు.

Show comments