iDreamPost
iDreamPost
టాలీవుడ్‌లో సింగర్‌గా మంచి పేరు తెచ్చుకున్న శ్రావణ భార్గవి ఈ మధ్య సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అయ్యారు. యూట్యూబ్ ఛానెల్‌లో వ్లోగ్స్ చేస్తూ నెటిజన్ల ఎట్రాక్ట్ చేస్తోంది. కొత్త తరహాలో ప్రయత్నిస్తోంది. కాని ఒక భక్తిగీతాన్ని పాడుతూ, తన అందాన్ని ప్రదర్శిస్తూ వీడియోను రూపొందించడం చాలామందికి నచ్చలేదు. కొద్దిమందైతే ఆమె మీద విరుచుకుపడ్డారు. ఆమె చిత్రీకరించిన ‘ఒకపరి కొకపరి వయ్యారమై'(Okaparikokapari Oyyaramai) వీడియోలో అన్నమయ్య కీర్తన చిత్రీకరణపై అన్నమయ్య వంశస్తులు ఆమెపై మండిపడ్డారు. కోర్టుకు కూడా వెళ్తామనికూడా హెచ్చరించారు. ఇవన్నీ సోషల్ మీడియాలో బాగా తెలిసిన విషయాలే.
నేను చేసిన వీడియోలో ఎలాంటి తప్పు లేదు, అది మీ చూపులోనే ఉందని, దుప్పటి కప్పుకుని కుర్చొన్నా అశ్లీలంగానే కనిపిస్తుందన్నది శ్రావణ భార్గవి స్ట్రాంగ్ కౌంటర్. అంతే అటువైపు నుంచికూడా అంతేలా స్ట్రాంగ్ గా రియాక్షన్ రావడంతో, ఈ వివాదం మరింత అగ్గిపుట్టింది. ఆ వీడియోను డిలీట్ చేయాల్సిందేనని పట్టుబట్టారు. తన వీడియో అభ్యంతరకరంగా ఉంటే దైవానుగ్రహం దక్కదని, వీడియోను డిలీట్ చేసేది లేదని తేల్చిచెప్పింది భార్గవి. కొందరు తిరుపతి వాసులు శ్రావణ భార్గవి వీడియోపై తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దీంతో శ్రావణ భార్గవి వెనక్కి తగ్గింది. తన యూట్యూబ్ ఛానెల్ నుంచి ‘ఒకపరి కొకపరి వయ్యారమై’ వీడియోను డిలీట్ చేసింది.
నా యూట్యూబ్ ఛానల్ అభిమానులకు సంతోషాన్ని, ఉత్సాహాన్ని, మనశ్శాంతిని తీసుకొస్తుంది. నేనెప్పుడూ తెలిసి వివాదాలను కొనితెచ్చుకోను. నా సామాజిక మాధ్యమాల వేదికగా, నెగిటీవిటీని అస్సలు ప్రోత్సహించను. నేను అదే పంథాను అనుసరిస్తా. అన్నమాచార్య గారి మీద ఉన్న అపార గౌరవం, ఆరాధాధనతో ఇటీవల విడుదల చేసిన వీడియోను నేను తొలిగిస్తున్నాను. ఇప్పటికే నేను చెప్పేది ఏమిటంటే, ఆ వీడియో తయారీ వెనుక చాలా గంటల సమయం, కష్టం ఉన్నాయి. అదొక అందమైన కళాఖండమని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో మరొక ఆడియోతో నా ఛానల్ లో కొనసాగుతుందని ప్రకటించిన శ్రావణ భార్గవి ఎప్పుడైతే మీరు చూసే తీరు మారుతుందో అప్పుడే మార్పును కూడా చూడగలరని కామెంట్ చేసింది. దృష్టికోణం ప్రతి విషయంలోనూ ఉందని చెప్పింది
మొత్తానికి ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టిన శ్రావణి భార్గవి, తన వీడియోకు అన్నమాచార్య కీర్తన ను తొలగించి, మరో పాటను జోడించనుంది.