Revanth Reddy, Komatireddy – కోమటిరెడ్డి మనసు మార్చుకున్నారా..?

రాజకీయాల్లో కత్తులు దూసుకున్న పార్టీలు తర్వాత పొత్తులు పెట్టుకుని పోటీ చేసిన సందర్భాలు అనేకం. అదే విధంగా ఒకే పార్టీలో నేతల మధ్య ఆధిపత్యపోరు సాగడం, ఆ తర్వాత కలిసి పని చేయడం కూడా చూస్తుంటాం. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. నిన్నమొన్నటి వరకు మల్కాజ్‌గిరి ఎంపీ, టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై అగ్గిమీద గుగ్గిలం అయిన భువనగిరి ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తాజాగా మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. టీపీసీసీ పదవి కోసం పోటీ పడిన వెంకట్‌ రెడ్డి.. ఆ పదవి రాకపోవడం, టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌ రెడ్డికి దక్కడంతో తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్‌ రెడ్డి పదవిని కొనుక్కున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర పార్టీతో సంబంధం లేదని, తన నియోజకవర్గానికే పరిమితం అవుతానని ప్రకటనలు చేశారు.

రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత ముఖ్యనేతలందరినీ కలిశారు. ఈ క్రమంలో కోమటిరెడ్డిని కూడా కలిసేందుకు వెళ్లేందుకు సిద్ధమవగా.. తాను కలిసేది లేదంటూ కోమటిరెడ్డి తేల్చి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ పలు కార్యక్రమాలు నిర్వహించినా కోమటిరెడ్డి వాటిలో పాల్గొనలేదు. ఈ స్థాయిలో రేవంత్‌ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించిన కోమటిరెడ్డి.. తాజాగా తన వైఖరిని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఈ రోజు కాంగ్రెస్‌ పార్టీ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద గల ధర్నా చౌక్‌లో ధాన్యం కొనుగోలు చేయాలంటూ వరి దీక్ష ప్రారంభించింది. రెండు రోజుల పాటు ఈ దీక్ష కొనసాగనుంది. ఈ దీక్ష కార్యక్రమానికి కోమటిరెడ్డి హాజరయ్యారు. రేవంత్‌ రెడ్డి పక్కనే కూర్చున్నారు. ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇద్దరు కలిసి ఆలింగనం చేసుకుని అభివాదం కూడా చేశారు.

ఈ పరిణామం కాంగ్రెస్‌ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. నేతల మధ్య విభేదాల కారణంగా కాంగ్రెస్‌ పార్టీ నష్టపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బలమైన కేడర్‌తోపాటు నేతలు ఉన్నా.. పార్టీ ముఖ్యనేతల మధ్య సఖ్యత లేకపోవడం ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఈ పరిస్థితి పోవాలనే ఆకాంక్ష ఆ పార్టీ శ్రేణుల్లోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి కలిసి అభివాదం చేయడం.. ఆ పార్టీ కేడర్‌తోపాటు, రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి అనుచరుల్లో జోష్‌ నింపింది. తమ నేతలు ఇలానే పని చేయాలని, 2023 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాలని ఆ పార్టీ కేడర్‌ ఆకాంక్షిస్తోంది. అయితే ఈ సఖ్యత ఇలాగే కొనసాగుతుందా..? సందర్భం వచ్చినప్పుడు మళ్లీ కోమటిరెడ్డి వ్యతిరేక గళం విప్పుతారా..? వేచి చూడాలి.

Also Read : Telangana Congress, Etela Rajender – తెలంగాణ కాంగ్రెస్‌ను ఆ బాధ ఇంకా వెంటాడుతోందా..?

Show comments